రిజిస్ట్రేషన్ చార్జీల పెంపే సంక్రాంతి కానుక
ప్రొద్దుటూరు : రిజిస్ట్రేషన్ చార్జీల పెంపును ప్రజలు సంక్రాంతి కానుకగా భావించాలా అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. గురువారం ప్రొద్దుటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంపద సృష్టిస్తా అని ఎన్నికల సందర్భంగా గొప్పలు చెప్పిన చంద్రబాబు గడిచిన ఆరు నెలల్లో ఏయే సంపద సృష్టించారో చెప్పాలన్నారు. అన్నింటా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 2025 జనవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలను దాదాపు రెండింతలు పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన ఒకటి రెండు నెలలు మాత్రమే సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు మంజూరు చేశారని, తర్వాత ఏ తేదీన ఇస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను చెల్లించలేదని, ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం అప్పుడే రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చిందన్నారు. వలంటీర్ల వేతనాన్ని రూ.10వేలు పెంచుతామని చెప్పి ఇప్పుడు మాట తప్పారన్నారు. నేతన్న నేస్తం ఏమైందని అడిగారు. ఇప్పటికే ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొత్త పింఛన్లు ఇవ్వాల్సింది పోయి ఉన్న పింఛన్లు తొలగించడం న్యాయమా అని నిలదీశారు.
రేషన్ కార్డుల ఊసే లేదు
వివిధ కారణాల వల్ల అర్హత ఉన్న పేదలు సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నారని రాచమల్లు తెలిపారు. ఇందుకోసం రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. కొత్తవి మంజూరు చేయకపోవడం వల్ల అర్హత ఉన్న దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు, మంచానికే పరిమితమైన వారు కొత్త పింఛన్లు అందుకోలేక పోతున్నారన్నారు. చంద్రబాబును నమ్మి అన్ని వర్గాల ప్రజలు మరో మారు మోసపోయారని తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, గుర్రం లావణ్య, కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షురాలు గజ్జల కళావతి, వైఎస్సార్‌సీపీ నాయకులు బీఎన్‌ఆర్, చౌడం రవి, టంగుటూరు గౌతం రెడ్డి, పార్వతి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
రాచమల్లు శివప్రసాదరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment