బోటు మోటారు మాయం!
జమ్మలమడుగు : పర్యాటక కేంద్రమైన మైలవరం జలాశయంలో ఇటీవల కాలంలో టూరిస్టులను ఆకర్షించే విధంగా బోటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా కొంత మంది ప్రైవేట్ బోట్లను ఏర్పాటు చేసి పర్యాటకులనుంచి దోపిడీకి తెర లేపారు. దీంతో టూరిజం అధికారులు బోటు నడుపుకునేందుకు ఎలాంటి అనుమతులు లేవని బోటును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బోటు మోటార్‌ను దప్పెర్ల టూరిజం హోటల్ వద్ద ఏర్పాటు చేసిన బోటు షికారు ప్రాంతంలో నిలిపారు. ప్రస్తుతం బోటుకు ఉన్న ఐదు లక్షల రూపాయల విలువ గల మోటారును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. టూరిజంశాఖ పరిధిలో ఉన్న బోటు మోటారు మాయం కావడం.. టూరిజం అధికారులు సైతం దీని గురించి పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
హఠాత్తుగా
మహిళా కూలీ మృతి
వల్లూరు : మండల పరిఽధిలోని పెద్దపుత్త గ్రామ పొలాల్లో గురువారం పొలం పని చేస్తూ మహిళా కూలీ రామక్క హఠాత్తుగా మృతి చెందింది. తోటి కూలీలు తెలిపిన వివరాల మేరకు ప్రొద్దుటూరు మండల పరిధిలోని సీతంపల్లెకు చెందిన ఒక రైతు పెద్దపుత్త గ్రామ పొలాల్లో భూమిని కౌలుకు తీసుకుని దోస తోట సాగు చేశాడు. అందులో కలుపు తీసేందుకు అతని గ్రామం నుంచి సుమారు 30 మంది కూలీలను ఆటోల్లో తీసుకుని వచ్చాడు. ఉదయం నుంచి వారు పొలంలో కలుపు తీత పనులు చేస్తున్నారు. కూలీల్లో ఒకరైన రామక్క మధ్యాహ్నం సుమారు 3–30 గంటల సమయంలో ఉన్నట్లుండి కుప్ప కూలి స్పృహ తప్పి కిందకు ఒరిగింది. తోటి కూలీలు ఆమెకు సపర్యలు చేస్తూ , 108 వాహనానికి ఫోన్ చేశారు. వారు వచ్చి పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
కర్నూలు : కర్నూలు నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేష్ బాబు (35) ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణానికి చెందిన ఇతను పదేళ్లుగా కర్నూలులోని గణేష్ నగర్‌లో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. గురువారం ఉదయం కృష్ణానగర్ సమీపంలో డోన్ వైపు వెళ్తున్న గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కో పైలట్ సతీష్ ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు రైల్వే పీఎస్ ఎస్‌ఐ కిరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment