నేనేమి చేశాను నేరం..!
జమ్మలమడుగు : పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ పసికందుకు ముళ్ల కంపే పడక పాన్పు అయింది. తల్లిదండ్రుల ప్రేమానురాగాల మధ్య అల్లారుముద్దుగా పెరగాల్సిన ఆ చిన్నారి అనాథగా మారి విలవిల్లాడాల్సి వచ్చింది. నవ మాసాలు మోసి కన్న తల్లి జాడ లేదు. అబ్బురంగా చూసుకోవాల్సిన తండ్రి ఊసు తెలియదు. బొడ్డు తాడు కూడా ముడివేయలేదు. బోసినవ్వులను చూసి మురిసిపోవాల్సిన వారు కర్కశంగా వదిలేశారు. ఇంకా పూర్తిగా కళ్లు విప్పి లోకాన్ని కూడా చూడని ఆ గంటల వయసున్న చిన్నారిని వదిలించుకోవాలనుకున్నారు. ముళ్లపొదల్లో పడేశారు. అమ్మపాలు లేక ఆకలితో ఏడ్వడమే ఆ పసికందు ప్రాణాలను కాపాడింది. ఈ అమానవీయ సంఘటన జమ్మలమడుగులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు, వైద్య సిబ్బంది కథనం మేరకు.. జమ్మలమడుగు పట్టణం ముద్దనూరు రహదారిలోని ముళ్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ చిన్నారిని వదిలేసి వెళ్లారు. తల్లిపాల కోసం ఏడుస్తున్న ఆ పసికందును గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆ చిన్నారిని కడపకు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవం అయిన వారి వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ చిన్నారిని ఎవరు.. ఎందుకు పడేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారిని ఇలా రోడ్డుపాలు చేసిన ఈ అమానుష చర్యపై ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment