కూటమి సర్కార్‌లో ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్నాయి. టీడీప
సాక్షి ప్రతినిధి, కడప : జిల్లా కేంద్రమైన కడపకు పొరుగునే ఉన్న కమలాపురం నియోజకవర్గంలో ఆకాశమే హద్దుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. కొత్తూరు, పైడికాల్వ, సంబటూరు రీచ్‌లు అధికారికంగా ఉన్నప్పటికి పక్క గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ‘ఇసుక ఉచితం’ మాటున నదులను గుళ్ల చేస్తున్నారు. అక్రమ సంపాదన కోసం ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని చిత్రావతి, పెన్నా, పాపాఘ్ని, చెయ్యేరు నదులపై దండయాత్ర చేస్తున్నారు. ప్రొక్లయిన్ల ద్వారా లోడింగ్ చేస్తూ భారీ టిప్పర్లతో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రీచ్‌లు దక్కించుకుని పొరుగున్నే ఉన్న మరో గ్రామం నుంచి ఇసుక బాహాటంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా కమలాపురం నియోజకవర్గంలోని పైడికాల్వ, కొత్తగంగిరెడ్డిపల్లె, నందిమండలం, సంబటూరు ఇసుక రీచ్‌లు నిలుస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఇసుక రీచ్ నిర్వహణను దక్కించుకున్న టీడీపీ నేతలు ఆ మాటున అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా వినియోగదారుడికి ఇసుక కావాలంటే చుక్కలు చూడాల్సి వస్తోంది.
అనధికారికంగా ఇసుక అక్రమ రవాణా...
పైడికాల్వ ఇసుక రీచ్‌లో 49,733 మెట్రిక్ టన్నులు ఇసుక ఉన్నట్లు అధికారిక సమాచారం. కాగా, పైడికాల్వ నుంచి కాకుండా రాచవారిపల్లె నుంచి అధికారపార్టీ నేతలు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. అందుకోసం రాచవారిపల్లె నుంచి పాపాఘ్ని నదిలోకి రహదారి ఏర్పాటు చేశారు. లోడింగ్ కోసం యంత్రాలను ఏర్పాటు చేసి భారీ లారీలతో ఇసుక తరలిస్తున్నారు. అదే పంథాలో మొలకలవారిపల్లె నుంచి కొనసాగిస్తున్నారు. అక్కడ సంబటూరు ఇసుక రీచ్ ఉండగా అక్కడి నుంచి కాకుండా మొలకలవారిపల్లె గ్రామం నుంచి ఇసుక తరలిస్తున్నారు. గ్రామస్తులు అభ్యంతరం చెప్పినా బేఖాతరు చేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇదే పరిస్థితి కొత్తగంగిరెడ్డిపల్లె, నందిమండలం ఇసుక రీచ్‌లలో ఉంది. మార్కింగ్ ఇచ్చిన ఏరియాల్లో కాకుండా మరింత ఆవలివైపు నుంచి ఇసుకను తరలిస్తున్నా రు. ఇవన్నీ కూడా తెలుగుతమ్ముళ్ల కనుసన్నుల్లోనే కొనసాగుతున్నాయి. అయినప్పటికీ అధికారులు అటువైపు పర్యవేక్షణ, పరిశీలన లేకుండా అక్రమార్జనకు అవకాశం కల్పిస్తుండడం గమనార్హం.
ప్రధాన నగరాలకు తరలింపు...
కమలాపురం నియోజకవర్గం నుంచి ప్రధాన నగరాలకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. యంత్రాలతో లోడింగ్ చేసి, భారీ వాహనాలల్లో ఇసుక కన్పించకుండా పట్ట కట్టుకొని బెంగుళూరు పట్టణానికి తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇసుక, గ్రావెల్‌తో అక్రమ రవాణాతో కోట్లు కొల్లగొడుతున్నారు. అధికారిక రీచ్‌ల నుంచి కాకుండా పక్కగ్రామాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఘటనలు కమలాపురం నియోజకవర్గంలో సాధారణంగా మారాయి. స్వయంగా కలెక్టర్ శ్రీధర్ పరిశీలనలో నందిమండలం వద్ద ఇలాంటి ఘటన వెలుగు చూసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవనే ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికై నా అక్రమార్కుల నుంచి నదులను రక్షించాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.
అక్రమాలకు అడ్డ‘దారి’
ఇసుక అక్రమ రవాణాలో
అధికార పార్టీ నేతల దోపిడీ
కమలాపురంలో యథేచ్ఛగా
ఇసుక అక్రమ రవాణా
పాపాఘ్నిలోకి రహదారి ఏర్పాటు చేసి తరలిస్తున్న వైనం
ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు
Comments
Please login to add a commentAdd a comment