వైకుంఠ దర్శనాలకు సర్వం సిద్ధం
కడప కల్చరల్ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో శుక్రవారం అలంకారాలు, విశేష పూజలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుంచి ఆయా దేవాలయాల్లోని దేవతామూర్తులను దర్శించుకుంటే వైకుంఠం ప్రాిప్తిస్తుందన్నది వైష్ణవ భక్తుల విశ్వాసం. ధనుర్మాసం సందర్భంగా వీరంతా నిత్యం ఉదయం, సాయంత్రం పాశురాల గానం చేస్తూ భక్తితో ఉంటారు. దీనికి ముగింపుగా వైకుంఠ ఏకాదశి రావడంతో భక్తుల్లో పాశురాల ముగింపుతోపాటు వైకుంఠ దర్శనాలు ఉంటాయి. ఈ సందర్భాన్ని పవిత్రమైనదిగా భావిస్తున్నారు.
● ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం రాష్ట్ర లాంఛనాల హోదా కలిగి ఉండడంతో ఇక్కడి ప్రతి పూజోత్సవానికి విశేషమైన ప్రత్యేకత ఉంటోంది. ప్రత్యేకంగా జిల్లాలో మూడు గోపురాలు గల ఆలయాలలో ఈ ఆలయం ప్రథమ స్థానంలో ఉంది. ఏటా వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఈ ఆలయం ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. భక్తుల కోసం ఇప్పటికే ఆ ద్వారం గుండా లోనికి వెళ్లేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. టెంపుల్ విలేజ్‌గా పేరుగాంచిన పుష్పగిరిలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు.
● దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న దేవునికడపలో నూతన సంవత్సర సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి తెలిపా రు. భక్తులకు దేవతామూర్తుల సులభ దర్శనమయ్యేలా ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. తిరుమల–తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తున్న జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వరస్వామి ఆలయం, గండి వీరాంజనేయస్వామి ఆలయం, నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం, తాళ్లపాక, బద్వేలు, రాజంపేట, చిట్వేలి, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ రామాలయాలలో కూడా ఉత్తర ద్వార దర్శన సౌకర్యం కల్పించనున్నారు.
రేపే వైకుంఠ ఏకాదశి
ఆలయాల్లో విశేష ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment