నీలగిరి.. నింగినంటి..
బి.కొత్తకోట: 1859లో బ్రిటీష్ పాలనలో ఓ కలెక్టర్ నీలగిరి నాటిన మొక్క ఇంతై..ఇంతింతై అన్నట్టు ఎదుగుతోంది. 1995లో మహావృక్ష పురస్కారంతోపాటు రూ.50వేల నగదు బహుమతి పొందిన ఈ మహావృక్షం బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై ఉంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ మహానీలగిరి వృక్షం తాజా లెక్క ప్రకారం ఎత్తు, మొదలు ఆమాంతం పెరిగింది. ఇదీ ఇంకా పెరుగుతుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఈ ఆసక్తికర నీలగిరి మహావృక్షం వివరాల్లోకి వెళ్తే...బ్రిటీష్ పాలనలో ఉమ్మడి కడపజిల్లా కలెక్టర్‌గా డబ్ల్యూడీ హార్సిలీ పని చేస్తున్న కాలంలో ఆయన హార్సిలీహిల్స్‌ను కనుగొన్న విషయం అందరికి తెలిసిందే. కొండపై విడిది చేసుకుని ఓ అతిథిగృహం నిర్మించుకున్న ఆయన ఆ గది పక్కనే ఓ నీలగిరి మొక్కను 1959లో నాటారు. ఆయన నాటిన ఆ మొక్క ఇంతై..ఇంతింతై అన్నట్టుగా ఎదిగి రికార్డులకెక్కుతుందని ఆనాడు భావించి ఉండరేమో. ఇప్పుడిది రికార్డును సృష్టిస్తోంది. వయసు పెరిగేకొద్ది తరిగిపోతారు. అయితే ఈ నీలగిరికి ఏళ్లు పెరిగేకొద్ది అందరూ తలెత్తి చూసేలా ఎత్తుకు ఎదుగుతూ శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఆక్షరిస్తోంది. 1995 నాటికి ఉమ్మడి ఏపీలో పురాతన, అతి ఎత్తయిన వృక్షంగా గుర్తింపు పొంది రికార్డును సొంతం చేసుకుంది. 2000 మార్చి 16న అప్పటి కేంద్ర ప్రభుత్వం దీనికి మహా వృక్ష పురస్కారం అవార్డును, రూ.50వేల నగదును బహుమతిగా అందించారు. దీనిని అప్పటి చిత్తూరు డీఎఫ్‌ఓ, మదనపల్లె ఎఫ్‌ఆర్‌ఓలు ఢీల్లీలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. 2000లో అప్పటి లెక్క ప్రకారం ఈ మహానీలగిరి వయసు 141 ఏళ్లు, ఎత్తు 40 మీటర్లు, చుట్టు కొలత 4.7 మీటర్లు (15.6 అడుగులు). తాజా లెక్కల ప్రకారం ఈ లెక్క మారింది. ఇప్పుడు దీని వయసు 165 ఏళ్లు. ఎదిగిన ఎత్తు 43 మీటర్లు (అంచనా), అంటే మూడు మీటర్ల ఎత్తు పెరిగింది. కాగా ప్రస్తుతం చుట్టు కొలత 6.32 మీటర్లు. అంటే 20.10 అడుగుల చుట్టు కొలత ఉంది. 2000 ఏడాది నుంచి ఇప్పటి వరకు పెరిగింది 1.66 మీటర్లు, అంటే 5.44 అడుగులు పెరిగింది. ఇదే కొలత ఛాతీ ఎత్తులో అయితే చుట్టు కొలత 6.25 మీటర్లు. అంటే 20.6 అడుగులు అవుతుంది. ఈ లెక్క తీసుకున్నా 1.55 మీటర్లు పెరిగింది. అంటే 5.08 అడుగులు పెరిగినట్టు లెక్క స్పష్టం. ఇప్పటిలెక్క ఇదికాగా వయసు పెరిగేకొద్ది ఇంకెంత ఎదుగుతుందో.
కొండ నిండా నీలగిరి
హార్సిలీహిల్స్‌పై అత్యధికంగా కనిపించేది యూకలిప్టస్ (నీలగిరి) వృక్షాలే. ఈ కొండపై ఏపుగా పెరిగిన నీలగిరి వృక్షాల సందర్శకులకు ప్రత్యేక ఆక్షరణగా నిలుస్తాయి. ఇక్కడ విశేషంగా ఎదిగిన ఈ వృక్షాలపై అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. తొమ్మిది కిలోమీటర్ల ఘాట్‌రోడ్డుపై ఎత్తయిన నీలగిరి వృక్షాలు అలరిస్తాయి. హార్సిలీహిల్స్‌ను అధికారిక విడిదిగా చేసుకునేందుకు కడప కలెక్టర్ హార్సిలీ లేఖ పంపగా మద్రాసు ప్రభుత్వం దీనికి ఆమోదం తెలుపుతూ 1869 మే 4న జీవోఎంఎస్ నంబర్ 11579ను జారీచేసింది. అంతకుముందు గుర్రంపై కొండపైకి వచ్చిన హార్సిలీ మొక్కను నాటారు. తర్వాత అతిథి గృహం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరగా రిజర్వ్ ఫారెస్ట్‌లో బంగ్లా నిర్మించుకునేందుకు 1869 జూన్ 9న జీవోఎంఎస్ నంబర్ 4162ను జారీచేసింది.
హార్సిలీహిల్స్‌పై 1859లో నాటినమహా నీలగిరి వృక్షం ఎత్తు, మొదలు పెరిగింది
1995లో కేంద్రమహావృక్ష పురస్కారం
ఏపీలోనే పురాతన నీలగిరి వృక్షంగా రికార్డు
1995లో దీని ఎత్తు 40 మీటర్లు, చుట్టు కొలత 4.7మీటర్లు
తాజాగా చుట్టు కొలత 6.36మీటర్లు..ఎత్తు 43 మీటర్లు
Comments
Please login to add a commentAdd a comment