కడప సెవెన్‌రోడ్స్: గణతంత్ర దిన వేడుకల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే వేడుకల్లో జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను, వేదికను అందంగా అలంకరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సౌకర్యాల ఏర్పాట్లపై కడప మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. శకటాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖల్లో విశిష్ట సేవలు అందించిన ఉత్తమ అధికారులు, సిబ్బంది, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయడానికి సంబంధిత ప్రతిపాదిత జాబితాను నిర్ణీత గడువు లోపు అందించాలని ఆదేశించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీసుల మార్చ్ ఫాస్ట్‌లో ఎన్‌సీసీ కేడెట్లను భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పోస్టర్ల ఆవిష్కరణ
యాక్సిడెంట్ బాధితులకు సహాయం అందించి వారి ప్రాణాలు కాపాడుదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రవాణా భద్రత మాసోత్సవాలు–2025 పురస్కరించుకొని ‘దారి భద్రత ప్రచారం‘ – (శ్రద్ధ వహించండి)‘ కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 36వ జాతీయ రవాణా భద్రత మాసోత్సవాలు–2025లో భాగంగా తేదీ ఈనెల 16 నుంచి ఫిబ్రవరి 15వ తేది వరకు నెల రోజులాటు ‘దారి భద్రత ప్రచారం‘ – (శ్రద్ధ వహించండి)‘ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన గంట (గోల్డెన్ అవర్)లోపు బాధితులకు సరైన వైద్య చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చునన్నారు. మద్యంతాగి వాహనం నడపరాదని, రాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ నేరమన్నారు. సీట్ బెల్ట్ ధరించాలని, భద్రంగా గమ్యం చేరాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment