ప్రైవేటు ఆసుపత్రి మూత
పోరుమామిళ్ల : పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న డాక్టర్ జనార్దన్‌రెడ్డి ఆసుపత్రిని సోమవారం జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖా ధికారి డాక్టర్ మల్లేష్ మూసి వేయించారు. ఇక్కడి వైద్యుడు చేసిన చికిత్స వికటించి రామాయపల్లెకు చెందిన కారు రామయ్య ఇటీవల మృతి చెందాడు. ఈ నేపథ్యంలో సోమవాం జిల్లా అధికారి విచారణకు వచ్చారు. సదరు డాక్టర్ లేకపోవడంతో ఆస్పత్రికి క్లోజ్‌డ్ స్లిక్కర్ అంటించారు. అంతకు ముందు ఎస్‌ఐ కొండారెడ్డితో అధికారి మాట్లాడారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక తగిన నిర్ణయం తీసుకుంటామని జిల్లా అధికారి తెలిపారు. ఆయన వెంట ఆరోగ్య విద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ ఉన్నారు.
డీఈఓగా షంషుద్దీన్ నియామకం
కడప ఎడ్యుకేషన్ : జిల్లా విద్యాశాఖ అధికారి (ఎఫ్‌ఏసీ)గా షంషుద్దీన్ నియమితులయారు. కర్నూల్ జిల్లా తాండ్రపాడు డైట్ కళాశాల సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న షంషుద్దీన్‌ను వైఎస్సార్ జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కొన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేడో, రేపో ఆయన బాధ్యతలను చేపట్టనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం డీఈఓగా పనిచేస్తున్న మీనాక్షిని ప్రొద్దుటూరు డిప్యూటి ఈఓగా కొనసాగించనున్నట్లు తెలిసింది. ఆమైపె పలు ఆరోపణలు రావడంతోపాటు ఉపాధ్యాయ సంఘాలు ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన విష యం తెలిసిందే.
హుండీ ఆదాయం లెక్కింపు
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో సోమవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రెండు నెలలపాటు భక్తులు సమర్పించిన కానుకలను ఇందులో లెక్కించారు. మఠం ఆవరణలో ప్రొద్దుటూరు, మైదుకూరు, పట్టణాలకు చెందిన దాదాపు 50మంది మహిళా భక్తులు డ్రస్ కోడుతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.23,30,585 నగదు, 200గ్రాముల బంగారం, 90 గ్రాముల వెండి వచ్చినట్లు మఠం మేనేజర్ ఈశ్వరాచారి, ఫిట్‌పర్సన్ శంకర్ బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్, పూర్వపు మఠాధిపతి కుమారులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
‘కేతు’ పతకానికి
చెక్కు అందజేత
కడప ఎడ్యుకేషన్ : వైవీయూ తెలుగుశాఖలో ప్రతిభావంతులకు ఏటా కేతు విశ్వనాథరెడ్డి పేరిట స్మారక బంగారు పతకం, నగదు బహుమతి అందజేసేందుకు ఆయన కుమారుడు కేతు శశికాంత్ రూ.3.5 లక్షల చెక్కును యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డికి అందజేశారు. ఈ మేరకు ఆచార్య కృష్ణారెడ్డి సమక్షంలో విద్యాలయ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. రఘునాఽథ రెడ్డి కేతు శశికాంత్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం చెక్కులను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వి కృష్ణారావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆచార్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రఖ్యాత విద్యావేత్త, ప్రముఖ రచయిత, సాహిత్య విమర్శకుడు ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి పేరిట అవార్డు నెలకొల్పడం సంతోషదాయకమన్నారు. సాంస్కృతిక వారసత్వానికి బలమైన పునాది వేసిన ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి చిరస్మరణీయుడన్నారు. ఆచార్య రఘునాథ రెడ్డి కేతు సేవలను కొనియాడారు. దివంగత ప్రొఫెసర్ కేతు విశ్వనాథరెడ్డి కుటుంబ సభ్యులు కేతు పద్మావతమ్మ, కేతు శశికాంత్ , కేతు మాధవి, శిరీషలను వీసీ తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆచార్య ఎ.జి.దాము పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment