మార్కెట్ నిర్మాణానికి నిధుల్లేవట !
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మున్సిపల్ మార్కెట్ నిర్మాణానికి నిధులు ఇవ్వలేమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణానికి అవసరమయ్యే నిధులను మున్సిపాలిటీ నుంచే ఇవ్వాలని అందులో పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను చూసిన స్థానిక నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రొద్దుటూరు పట్టణంలో 40 ఏళ్ల క్రితం నిర్మించిన కూరగాయల మార్కెట్ అధ్వానంగా ఉండేది. మహిళలు నిత్యం మార్కెట్‌కు వెళ్లి ఇబ్బందులు పడేవారు. ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ప్రతి ఒక్కరి నోటా మార్కెట్ సమస్య పరిష్కారం గురించిన చర్చే జరిగేది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మార్కెట్ నిర్మాణం కోసం తీవ్రంగా కృషి చేశారు. ఉన్న మార్కెట్‌ను ఎంతో ధైర్య సాహసాలతో కూల్చివేయించి కొత్త మార్కెట్ నిర్మాణాన్ని మంజూరు చేయించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చించి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మార్కెట్ నిర్మాణానికి రూ.50.90 కోట్లు నిధులు మంజూరు చేయించారు. 2022 నుంచి పనులు ప్రారంభించారు. సాంకేతిక సమస్యలను గుర్తించిన ఇంజనీరింగ్ నిపుణులు అంచనాలను సవరించి రూ.60.85 కోట్లకు పెంచారు. ఇసుక సమస్య కారణంగా నిర్మాణంలో జాప్యం జరిగింది. మార్కెట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు రూ.21కోట్లు విడుదల చేశారు.
మార్కెట్ నిర్మాణానికి నిధులు లేవు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ నిర్మాణానికి నిధులు లేవని ప్రభుత్వం ఈనెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ డి.మరియన్న ఈ మేరకు అనంతపురం ఎస్‌ఈకి లేఖ రాశారు. ఇక నుంచి మార్కెట్ నిర్మాణానికి అవసరమయ్యే నిధులను మున్సిపల్ నిధుల నుంచే కేటాయించాలని కోరారు. ఈమేరకు కౌన్సిల్‌లో ఆమోదం పొందాలని సూచించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరుకు రకరకాల నిధులు వస్తాయని ప్రజలు ఆశిస్తుండగా గత ప్రభుత్వంలో మంజూరు చేసిన మార్కెట్ నిర్మాణానికే నిధులు లేవని చెప్పడం చర్చాంశనీయంగా మారింది.
మున్సిపల్ నిధుల నుంచి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు
కంగుతిన్న నేతలు
ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం
మార్కెట్ నిర్మాణానికి సంబంధించి నిధుల విషయంపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వంతో మాట్లా డి ఆయన నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇక్కడ నిధుల కొరత ఉంది. – వి.మల్లికార్జున,
మున్సిపల్ కమిషనర్, ప్రొద్దుటూరు.
Comments
Please login to add a commentAdd a comment