శ్రీ చైతన్య పాఠశాల వద్ద మృతుడి కుటుంబీకుల ఆందోళన
ప్రొద్దుటూరు కల్చరల్ : ఇటీవల అమృతానగర్‌లో శ్రీ చైతన్య పాఠశాల బస్సు ఢీ కొని మృతి చెందిన అబ్దుల్ మునాఫ్ కుంటుబీకులు సోమవారం స్థానిక సాయిరాజేశ్వరి కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఆందోళన చేశారు. శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన బస్సు కొద్దిరోజుల క్రితం విద్యార్థులతో వస్తుండగా అమృతానగర్‌లో మునాఫ్‌ను ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ బాలమద్దిలేటి, పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. సినీహబ్ యజమాని బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, పాఠశాల ఏజీఎం నాగిరెడ్డిలు మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment