దేవాలయ స్థలంలో అక్రమ కట్టడాలు
చింతకొమ్మదిన్నె : కడప–రాయచోటి జాతీయ రహదారి నుంచి కొత్తపేట గంగమ్మ గుడికి వెళ్లే రోడ్డు పక్కనే గంగమ్మ గుడి సమీపంలో బుగ్గలేటిపల్లె గ్రామం సర్వే నంబర్ 22–2 (ఎల్‌పీ నెంబర్లు 185,187)లో 2.42 ఎకరాలు దేవాలయ స్థలం ఉంది. ఈ ప్రదేశంలోని గుడిలోని పురాతన శివలింగానికి పూర్వం వనం రామేశ్వరస్వామి పేరుతో భక్తులు పూజలు చేస్తూ ఉండేవారు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఇక్కడి పురాతన శివలింగాన్ని దొంగలు అపహరించుకపోవడంతో భక్తులు నూతన శివలింగాన్ని ప్రతిష్టించి, పక్కనే పార్వతిదేవికి గుడి నిర్మాణం చేసి పూజలు చేసుకుంటున్నారు. ఆ పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. అయితే కడపకు చెందిన ఓ వ్యక్తి అతని కుమారుడు వేరే ప్రాంతంలో చనిపోగా ఇక్కడి దేవాలయ స్థలంలో పూడ్చి సమాధి నిర్మించారు. దానినే దేవాలయం అని భ్రమపడేలా నిర్మాణాలు చేస్తూ భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని, అన్నదాన కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని దేవదాయశాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలపై పత్రికల్లోనూ వార్తలు రావడంతో దేవదాయ, రెవెన్యూ అధికారులు స్పందించారు. సోమవారం దేవదాయశాఖ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ శివయ్య, ఈఓ రవిశేఖరరెడ్డి దేవాలయ స్థల పరిశీలనకు వచ్చారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ నాగేశ్వరరావు రెవెన్యూ సిబ్బంది, బుగ్గలేటిపల్లె గ్రామ రెవెన్యూ అధికారి లక్ష్మికాంతమ్మ, సర్వేయర్ మౌలాతో సర్వే నంబరు 22/2లోని దేవాలయ భూమిని పరిశీలనకు పంపి దేవదాయ అధికారులు, ప్రజల సమక్షంలోనే కొలతలు వేయించారు. దేవాలయ భూమిలోనే సమాధులు, కొన్ని నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. భక్తులు అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులను కోరారు. ఈ విషయాలపై తహసీల్దార్ నాగేశ్వరరావును వివరణ కోరగా దేవాలయ స్థలంలోకే సమాధులు, వాటిపై దేవాలయ రూపంలోని నిర్మాణాలు వచ్చాయని, సర్వేలో తేలిన వివరాలు దేవదాయశాఖ ఉన్నతధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ శివయ్యను వివరణ కోరగా బుగ్గలేటిపల్లె సర్వే నంబర్ 22–2 (ఎల్‌పీ నెంబర్లు) 185, 187లో 2.42 ఎకరాలు దేవాలయ భూమిగా రెవెన్యూ రికార్డులలో నమోదైందన్నారు. ఆ స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తూ అపవిత్రం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో పరిశీలించామన్నారు. కొలతలు వేయగా ఫిర్యాదులు వాస్తవమే అని తెలిసిందని, జిల్లా స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పరిశీలించిన దేవదాయ, రెవెన్యూ అధికారులు
ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment