మోటార్ సైకిల్‌ను ఢీకొన్న ట్యాంకర్
ఇద్దరు యువకుల దుర్మరణం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని కేంద్ర కారాగారం సమీపంలో బుధవారం రాత్రి మోటార్ సైకిల్‌ను ట్యాంకర్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రిమ్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలతో ఉన్నారేమో అనే ఆశతో పోలీసులు వెంటనే వారిని రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో వైద్యులు పరీక్షించి ఇద్దరు యువకులు మృతి చెందారని నిర్ధారించారు. రిమ్స్ పోలీసుల కథనం మేరకు కడప నగరం రామాంజనేయపురం పరిధిలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన పడిగ ప్రవీణ్ (29), అతని సమీప బంధువు వి. సుభాష్ (23)లు మోటార్ సైకిల్‌పై కడప నగరంలోకి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా తిరుపతి వైపు నుంచి కర్నూలుకు వెళుతున్న ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. క్యాజువాలిటీ నుంచి మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment