అబద్ధపు హామీలు ఇవ్వడం చంద్రబాబు నైజం
పులివెందుల రూరల్ : అబద్ధపు హామీలు ఇవ్వడం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజమని టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఓ వివాహ వేడుకకు హాజరరయ్యారు. అనంతరం పులివెందుల నియోజకవర్గం అంబకపల్లె రోడ్డులో ఉన్న వైఎస్ మధురెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని లక్ష్యంగా ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు లెక్కలేని హామీలు ఇచ్చారన్నారు. ఆశతో నమ్మి ఓట్లు వేసిన రాష్ట్ర ప్రజలను పూర్తిగా మోసం చేశారన్నారు. రాష్ట్ర పరిస్థితి సరిగా లేకపోయినప్పటికీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 8 నెలలు పూర్తవుతున్నా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. కరెంటు చార్జీలు పెంచారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా విద్యార్థుల చదువులతో చెలగాటమాడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంవల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు అధికారంలోకి తెచ్చామా అని రాష్ట్ర ప్రజానీకం బాధపడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. 2027లో వచ్చే జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్సార్‌సీపీని గెలిపించుకునేందుకు, మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
టీటీడీ మాజీ చైర్మన్,
రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment