వేంకటపతి.. జన హారతి
కడప కల్చరల్: ఇసుకేస్తే రాలనంత భక్తజనం మధ్య.. ఉవ్వెత్తున ఎగసిన ఆనందోత్సాహాల నడుమ .. కడప రాయుని రథం వైభవంగా కదిలింది. బ్రహ్మదేవుడు సారధ్యం వహించినట్లుగా అలంకరించిన రథం విశ్వతేజోమూర్తి సూర్యుని సాక్షిగా తేరు మేరు పర్వతంలా గంభీరంగా సాగింది. కడప రాయుని బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రఽథోత్సవాన్ని నిర్వహించారు. దేవునికడప వీధులన్నీ జనంతో నిండిపోయాయి. మిద్దెలు, మేడలపై నుంచి కూడా భక్తులు రథంలోని దేవదేవుడిని తిలకించి పులకించారు.
కట్టలు తెగిన ఉత్సాహం
కడప రాయుడు దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో ఉదయం స్వామి వారిని రథంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆలయంలోని స్వామిని దర్శించుకోవడంతోపాటు తేరుపై కొలువుదీర్చిన దేవతామూర్తులను దర్శించుకునే అరుదైన అవకాశం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచి దేవునికడపకు రావడం మొదలైంది. ఈ సంవత్సరం అర్చకుల ప్రత్యేకమైన విన్నపంతో తేరు ముందు ప్రత్యేకమైన, విశాలమైన ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడంతోపాటు ఎక్కువ మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకోగలిగారు. ఉదయం నుంచే సాగిన ఈ దర్శనాలు మధ్యాహ్నం ముగిశాయి. తొలుత రథాన్ని కొద్దిగా కదిలించిన నిర్వాహకులు శుభ ఘడియాల కోసం మరికొద్దిసేపు వేచి ఉండి ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు తొలి పూజ లు చేసి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి రథాన్ని కదిలించారు. దేవునికడప, పాత కడప, మోడమీదిపల్లె యువత కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో కదం తొక్కుతూ రథ చక్రాల కింద కొయ్య మొద్దులు వేసి వెదురు కర్రల సాయంతో ముందుకు కదిలించారు. ముందువైపు అశేష జనసందోహం పోటీలుపడి గొలుసులతో రథాన్ని లాగారు. అర్చకులు అడుగడుగునా రథంపై నుంచి ప్రజలకు స్వామి వారి హారతులిచ్చారు. భక్తుల గోవిందనామ స్మరణలతోదేవునికడప మార్మోగింది. ఆ వీధుల్లోని మిద్దెలు, మేడలన్నీ జనంతో నిండిపోయాయి. భక్తుల గోవిందనామ స్మరణల మధ్య మధ్యాహ్నం కదిలిన రథం మూడు గంటలపాటు మాడవీధుల్లో పయనించింది. అనంతరం ధూళి ఉత్సవం నిర్వహించారు.
సేవలు: నగరంలోని కృష్ణా సర్కిల్ నుంచి రోడ్డుకు ఇరువైపు దుకాణాలు ఏర్పాటు కావడంతో ఈ ప్రాంతాల్లో కూడా జనం కిక్కిరిసి కనిపించారు. స్వామి సేవకులు పలుచోట్ల శీతల పానీయాలు, అన్నదానాలు, అల్పాహారం అందజేశారు.
ఒంటిమిట్ట రామాలయంలో..
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం రథసప్తమి సందర్భంగా సీతారామ లక్ష్మణ మూర్తుల ఉత్సవ విగ్రహాలతో టీటీడీ వారు వైభవంగా గ్రామో త్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా విగ్రహాలకు పంచామృతాభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి, తులసీ గజమాలతో అలంకరించారు. అర్చకులు వీణా రాఘవాచార్యులు, వీణా మనోజ్ కుమార్ మహా మంగళహారతి ఇచ్చి గ్రామోత్సవానికి బయలుదేరారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.
చిన్నారి
నృత్య
ప్రదర్శన
జనసంద్రంలా దేవునికడప క్షేత్రం
జిల్లా నలుమూలల నుంచి వెల్లువలా భక్తజనం
Comments
Please login to add a commentAdd a comment