![హామీల](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04kdp806b-170068_mr-1738701557-0.jpg.webp?itok=7wsSU_9G)
హామీలను అమలు చేస్తాం
కడప సెవెన్‌రోడ్స్: ఎన్నికల హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాకు త్వరలో భారీ పరిశ్రమలు, సాగునీటి పథకాలు రాబోతున్నాయని తెలిపారు. డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఇప్పటికే ఏర్పాటు చేశామని, త్వరలో నోటిఫికేషన్ కూడా వెలువడనుందని చెప్పారు. పులివెందుల, కడపలో ఉన్న తాగునీటి సమస్యతో పాటు టిడ్కో, రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తొలుత కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ శాఖల వారీగా జిల్లాలో సాధించిన ప్రగతిని మంత్రికి వివరించారు. పల్లె పండుగ కార్యక్రమంలో మొదటి దశ ప్రతిపాదనలలో చేపట్టిన పనులు పూర్తి చేశామన్నారు. మినీ గోకులాల నిర్మాణం మార్చిలోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మార్చిలోపు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక మేళాలు నిర్వహించి మహిళా సంఘాలకు, యువతకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేస్తామని తెలిపా రు. ఆరు ప్రధాన రిజర్వాయర్లలో 80 శాతం మేర నీరు నిల్వ ఉందని వెల్లడించారు. రబీ పంటలతోపాటు తాగునీటికి ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని వివరించారు. రహదారుల్లో పాట్ హోల్–3 పనులు ఈనెల 15వ తేదీలోపు పూర్తి చేస్తామన్నారు.
● ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి మాట్లాడుతూ తెగుళ్ల నివారణ, ఎరువుల వాడకం వంటి అంశాలపై ఆయా సీజన్లలో అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు సలహాలు ఇవ్వాలన్నారు. వాట్సాప్ గ్రూపు ద్వారా ఉద్యాన రైతులను ఇప్పటికే వివిధ కేటగిరీల్లో గ్రూపులుగా యాడ్ చేసి సలహాలు ఇస్తున్నామని కలెక్టర్ బదులిచ్చారు.
● ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ చీనీ తోటలు ఎండుముఖం పట్టాయని, ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కరువు మండలాల ప్రకటనలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు.
● ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న టిడ్కో గృహ సముదాయలు లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు.
● ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళల పేరిట చాలామంది అక్రమంగా పెన్షన్లు పొందారని తెలిపారు. అలాగే వికలాంగుల పెన్షన్లలో కూడా అవకతవకలు జరిగాయన్నారు. వీటిని సరిదిద్ది అర్హులకు అందేలా చూడాలని కోరారు. పాలెంపల్లెలో పశు వైద్యశాలను ఏర్పాటు చేయాలని కోరారు. నగరంలో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా రోజూ నీరందించేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
● విద్యతోపాటు క్రీడలూ ముఖ్యమే: మంత్రి సవిత
కడప ఎడ్యుకేషన్: నేటి విద్యార్థులే రేపటి భావిభారత పౌరులని, విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించి పాఠశాలతోపాటు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని జిల్లా ఇంచార్జి మంత్రి సవిత అన్నారు. మంగళవారం కడపలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలులో నిర్వహించిన 37వ క్రీడా దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
క్రీడలవల్ల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. క్రీడలలో గెలుపు, ఓటములు సహజం అని పిల్లలెప్పుడు పాజిటివ్ గా ఉండాలన్నారు. ఆడపిల్లలు కూడా అన్ని రంగాలలో రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని అన్నారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు క్రమశిక్షణకు మారుపేరుగా ఉందని కొనియాడారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మన జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తాయన్నారు. క్రీడల వల్ల నాయకత్వపు లక్షణాలు వస్తాయని వివరించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు, పొలిట్ బ్యూరో శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. తొలుత మంత్రి మార్చిపాస్ట్ వందనం స్వీకరించారు. క్రీడా దినోత్సవ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఈవో డాక్టర్ షేక్ షంషుద్దీన్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు డైరెక్టర్ ఏం. వివేకానందరెడ్డి, ప్రిన్సిపల్ పి. హరి కృష్ణ, ఇంచార్జి సంధ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జి మంత్రి సవిత
![హామీలను అమలు చేస్తాం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/5/04kdp205-603002_mr-1738701558-1.jpg)
హామీలను అమలు చేస్తాం
Comments
Please login to add a commentAdd a comment