News
-
తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు
మంచిర్యాల రూరల్: ఉపాధి హామీ పథకం అమలులో ఎలాంటి తప్పులు జరిగినా ఉపేక్షించేది లేదని డీఆర్డీఓ బి.శేషాద్రి స్పష్టం చేశారు. మంగళవారం హాజీపూర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం 2వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 17గ్రామ పంచాయతీల్లో 2020 డిసెంబర్ ఒకటి నుంచి 2023 మార్చి 31వరకు చేపట్టిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాయి. ఈ సందర్భంగా పనుల్లో జరిగిన తప్పులు, నిధుల దుర్వినియోగం గుర్తించారు. పక్కదోవ పట్టిన నిధులను రికవరీ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. మండలంలో 835 ఉపాధి పనులు చేపట్టగా రూ.7.45 కోట్లపై విలువైన పనులు జరిగాయని, పంచాయతీ రాజ్ పరిధిలో 160 పనులకు రూ.4.51 కోట్లకు పైగా విలువైన పనులు జరిగాయని, అటవీ శాఖ పరిధిలో రూ.2.68 లక్షలతో పనులు జరిగినట్లు తెలిపారు. కొలతలు, రికార్డుల విషయంలో లోపాలు జరిగాయని, ఉపాధి హామీ పనులు తప్పుల తడకగా జరిగాయని తనిఖీ బృందాలు తేల్చిచెప్పాయి. డీఆర్డీఓ శేషాద్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి పనులు పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. ఎంపీపీ మందపల్లి స్వర్ణలత, జెడ్పీ కో ఆప్షన్ నహీంపాషా, అదనపు డీఆర్డీఓ దత్తారావు, డీవీఓ సురేశ్, ఎస్టీఎం నరేందర్, అంబుడ్స్‌మెన్ పర్సన్ శివరామ్, క్వాలిటీ కంట్రోలర్ చంద్రశేఖర్, విజిలెన్స్ మేనేజర్ కిరణ్, ఎస్ఆర్పీ భగవంత్‌రావు, ఎంపీడీఓ అబ్దుల్‌హై, ఎంపీఓ శ్రీనివాసరెడ్డి, ఏపీఓ మల్లయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎంబీబీఎస్ ప్రవేశాలు
సిరిసిల్ల: జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ భవనం సిద్ధమైంది. సిరిసిల్ల, వేములవాడ పాత తాలూకా ప్రాంతాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఆవిర్భవించడం.. రాష్ట్రంలోనే భౌగోళికంగా, జనాభా పరంగా చిన్న జిల్లాగా ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం అగ్రస్థానంలో నిలుస్తూ మెడికల్ కాలేజీ ఏర్పాటు అవుతుంది. పట్టణ శివారులోని పెద్దూరు బైపాస్ రోడ్డులో పది ఎకరాల స్థలంలో రూ.40 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం, విద్యార్థుల హాస్టళ్ల భవనాలు శరవేగంగా నిర్మాణమవుతున్నాయి. ఆగస్ట్ మొదటి వారంలోగా పనులు పూర్తి కానున్నాయి. రెండో వారంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం వైద్య విద్య తరగతులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్ఎంసీ అనుమతులు జిల్లా కేంద్రంలో వైద్య విద్యను బోధించే మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) న్యూఢిల్లీ లెటర్ ఆఫ్ ఇన్టెంట్(ఎల్వోటీ) నం.ఎన్ఎంసీ/యూజీ/2023– 2024/000033/ 021 475 తేదీ: 21.0.4.2023ను జారీ చేసింది. కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీకి వంద ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. ఈ ఏడాది ఆగస్ట్ మొదటి వారంలో మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు జరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారికంగా మెడికల్ కాలేజీకి అనుమతి లభించింది. ఎంబీబీఎస్ తరగతులకు శ్రీకారం సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది వంద సీట్లు కేటాయించగా, ఇందులో 15 సీట్లు ఆలిండియా కోటాలో కేటాయిస్తారు. మరో 85 మన రాష్ట్ర అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. 40 శాతం బాలురు, 60 శాతం సీట్లు బాలికలకు ఉంటాయి. ఆగస్ట్ మొదటి వారంలో కౌన్సెలింగ్ ఉంటుంది. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో మొత్తం 340 బెడ్స్ సిద్ధం చేశారు. పెద్దూరు వద్ద నిర్మించిన సొంత భవనంలోనే ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తారు. హాస్టల్ భవనాలు నిర్మాణంలో ఉండగా, అబ్బాయిలు, అమ్మాయిల కోసం వేర్వేరు ప్రైవేటు భవనాలు సిద్ధం చేశారు. సిరిసిల్లకు వచ్చిన ప్రొఫెసర్లు సిరిసిల్ల మెడికల్ కాలేజీకి ప్రభుత్వం సిబ్బందిని కేటాయించింది. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది కేటాయింపులు జరిగాయి. ఇప్పటికే 55 మంది సిబ్బందిని కేటాయించారు. మెడికల్ కాలేజీ ప్రారంభమైతే సుమారు వంద మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మొత్తంగా మెడికల్ కాలేజీలో సుమారు 700 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన బోధన సిబ్బంది, ఇతర డాక్టర్లు జిల్లా ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. సీఎంతో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిరిసిల్ల మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోనరావుపేట మండలం మల్కపేట వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9లో నిర్మించిన జలాశయం, జిల్లా పోలీస్ ఆఫీస్ భవనాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. మెడికల్ కాలేజీ ప్రారంభంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. పట్టణంలోని జిల్లా ఆస్పత్రి పూర్తి స్థాయిలో మాతాశిశు సంరక్షణ, నవజాత శిశువుల కేంద్రంగా మారుతుంది. జనరల్ ఆస్పత్రి మొత్తంగా మెడికల్ కాలేజీకి మార్చడంతో పెద్దూరు శివారులోని మెడికల్ కాలేజీ బోధన ఆస్పత్రిగా ఉంటుంది. అన్ని రకాల వైద్యసేవలు, ఆధునిక పరికరాలతో అందుబాటులోకి వస్తుంది. ఆగస్టులో తరగతులు.. రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఆగస్ట్‌లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. భవన నిర్మాణ పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. మొదటి ఏడాది వైద్యపాఠాలు బోధించేందుకు మౌలిక వసతులు సమకూరాయి. – డాక్టర్ ఎస్.చంద్రశేఖర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ న్యూస్‌రీల్ -
నేలకూలిన నూరేళ్ల చెట్టు
మంచిర్యాల: వేమనపల్లి మండంలోని నాగారం గ్రామంలో మంగళవారం ఉదయం భారీ వర్షానికి నూరేళ్ల కాలం నాటి చింత చెట్టు నేలకులింది. వేమనపల్లి–బెల్లంపల్లి మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై చెట్టు పడిపోవడంతో నియోజకవర్గం కేంద్రానికి, కాగజ్‌నగర్ వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. త్రీఫేజ్ విద్యుత్ లైన్ తెగిపోవడంతో పంట పొలాలు, గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. ఎంపీవో బాపురావు సూచన మేరకు స్థానిక సర్పంచ్ గ్రామస్తులతో చెట్టు తొలగించే ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి నుంచి కటింగ్ మిషన్ తెప్పించి అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించారు. ట్రాన్స్‌కో ఏఈ దీక్షిత్‌తో మాట్లాడి విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించి సరఫరా చేపట్టారు. సాయంత్రం వరకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. -
ఆకాశయానం అందని ద్రాక్షేనా?
భద్రాద్రి: రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్డుల నిర్మాణంపై గతేడాది ఆగస్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇందులో వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్, నిజామాబాద్ (జక్రాన్‌పల్లి) ఎయిర్‌పోర్టుల ప్రస్తావనే వచ్చింది తప్పితే కొత్తగూడెం ఊసే లేదు. అప్పటి వరకు తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల ప్రస్తావన ఎప్పుడొచ్చినా కొత్తగూడెం పేరు తప్పకుండా ఉండేది. మరోవైపు విమాన ప్రయాణ, రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు సైతం ఆకాశయానం అవకాశం కల్పించేందుకు కేంద్రం ఉడాన్ (ఉడే దేశ్‌కి ఆమ్ నాగరిక్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడ కూడా కొత్తగూడెం పేరు లేకపోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కొత్తగా ఎనిమిది విమానాశ్రయాలు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంపీగా గెలిచిన రేణుకాచౌదరి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆమె చూపిన చొరవతో కొత్త ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనల్లో కొత్తగూడెం పేరు కూడా చేరింది. అయితే గత 15 ఏళ్లుగా ఎయిర్‌పోర్టు అంశం విక్రమ్ బేతాళ్ కథలా మారిపోయింది. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తాయి. ఆ తర్వాత విడతల వారీగా నిపుణుల బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తాయి. వారి సూచనలకు అనుగుణంగా, జిల్లా యంత్రాంగం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం సర్వేలు చేపడతాయి. పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతాయి. అంతే ఇక ఆ తర్వాత ఉలుకూపలుకూ ఉండదు. మూడుసార్లు ప్రభుత్వాలు మారినా ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. విమానాశ్రయం ముచ్చట సాగిందిలా.. ► కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2008లో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. నాటి నుంచి 2014 వరకు కాగితాల్లో ప్రతిపాదనలే తప్ప క్షేత్ర స్థాయిలో అంగుళం పని కూడా జరగలేదు. ► తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఎయిర్‌పోర్టు పనుల్లో దూకుడు పెంచారు. ► ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల కోసం 2015 జనవరి నుంచి 2017 మార్చి వరకు అన్వేషణ సాగింది. ► పాల్వంచ మండలం పునుకుడుచెలక దగ్గర 1600 ఎకరాల స్థలాన్ని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైనదిగా గుర్తించారు. ► ఈ స్థలాన్ని తమకు అప్పగిస్తే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని 2017 మార్చిలో కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. ► పునుకుడుచెలక దగ్గరున్న స్థల సేకరణకు పర్యావరణ, అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ, సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డొచ్చాయి. దీంతో ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. ► 2019లో పాల్వంచ మండలంలో సర్వే నంబర్ 441లో ఉన్న 700 ఎకరాల స్థలాన్ని పరిశీలనలోకి తీసుకున్నారు. శ్రీనివాసకాలనీ నుంచి బంగారుజాల వరకు ఉన్న భూములను ఎంపిక చేసి 2020లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిశీలనకు పంపారు. ► విమానాలు ల్యాండ్, టేకాఫ్ అయ్యేందుకు బంగారుజాల దగ్గరున్న స్థలం అనువైనదా, కాదే అనే అంశాలను ఏఏఐ బృందం 2021లో పరిశీలించింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన శాఖాపరమైన అనుమతుల కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ అప్పటి నుంచి ఎయిర్‌పోర్టు పనులు ముందుకు సాగలేదు. దృష్టిపెట్టండి.. పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా భద్రాద్రి జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే దేశ నలుమూల నుంచి పర్యాటకులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఆకాశయాన సౌకర్యం లేక సింగరేణి, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, హెవీ వాటర్ ప్లాంట్, పేపర్‌బోర్డు తదితర పరిశ్రమల్లో పనిచేసే ఉన్నతాధికారులు, నిపుణులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే ఎయిర్‌పోర్టు నిర్మాణంపై అవసరమైన దృష్టిపెట్టడం లేదనే అపవాదు ను జిల్లా ప్రజాప్రతినిధులు మూటగట్టుకున్నారు. ఇప్పటికై నా ఎయిర్‌పోర్టు నిర్మాణంలో కదలిక వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఆకాశయానం జిల్లా ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. పదిహేనేళ్లుగా ఇదుగో అదుగో అంటూ ప్రకనటలు చేయడం, ఆపై సర్వేలు అంటూ హడావుడి చేయడం మినహా ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. -
చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
భద్రాద్రి: అశ్వాపురం మండలంలోని జగ్గారం క్రాస్ రోడ్డు వద్ద మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మణుగూరు డిపోకు చెందిన బస్సు మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తోంది. జగ్గారం క్రాస్ రోడ్డు సమీపంలో మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై బస్సుకు ఎద్దు అడ్డు రావడంతో తప్పించబోయి అదుపుతప్పి రహదారి కిందకు దిగి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులెవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
అర్ధరాత్రి ఆగంతకుడు !
భద్రాద్రి: ఇల్లెందులోని సింగరేణి కార్మికవాడల్లో అర్ధరాత్రి ఓ ఆగంతకుడు సంచరించిన సంఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ మొదటి లైన్లో శనివారం తెల్లారుజామున 3.35 గంటల ప్రాంతంలో 20 ఏళ్ల లోపు వయసు ఉన్న ఆగంతకుడు ముఖానికి మంకీ క్యాప్, మాస్క్ ధరించి కొన్ని ఇళ్లల్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇల్లెందులోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో పని చేస్తున్న క్రాంతి, సింగరేణి స్కూల్లో పని చేస్తున్న ఆయన సతీమణి కృష్ణవేణి నివాసం ఉంటున్న సింగరేణి క్వార్టర్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. వారి క్వార్టర్ ముందు కిటికీ తీసి ఇంట్లోకి మొబైల్ టార్చ్ వేసి చూశాడు. ఇంట్లోని కుక్క గమనించి అరవడంతో ఇంటి యజమాని కృష్ణవేణి నిద్ర లేచింది. కిటికీ ముందు నిలబడిన ఆగంతకుడు మొబైల్ టార్చ్ వేసుకుని చూస్తుండటంతో భయపడిన కృష్ణవేణి కేకలు వేసింది. ఆ సమయంలో భర్త క్రాంతి ఊరెళ్లాడు. పక్కింటివారికి ఫోన్ చేయగా, వారు నిద్రలేచి వెతికినా అప్పటికే ఆగంతకుడు పారిపోయాడు. అదే లైన్లో మరికొన్ని ఇళ్లల్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కూడా సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. గతేడాది వేసవిలో కూడా ఇదే తరహాలో పట్టణంలో దుండుగులు చోరీలకు పాల్పడ్డారు. తాజాగా సింగరేణి కాలనీలో ఆగంతకుడి సంచారంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఉరితాళ్లతో జీపీ కార్మికుల నిరసన !
కుమరం భీం: రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ప్రారంభించిన సమ్మె సోమవారం 12వ రోజుకు చేరింది. దీక్షా శిబిరంలో కార్మికులు తలకు ఉరితాళ్లతో వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా 11వ పీఆర్సీ, జీవో నం.60ని వెంటనే అమలు చేయాలని సంఘం నాయకులు శ్రీకాంత్, లోకేష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, శంకర్, రాజు, సమ్మయ్య, శ్రీనివాస్ కార్మికులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు!
సాక్షి, నిజామాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నడుం బిగించారు. ఇందులో భాగంగా ఈ నెల 23న కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించాలని నిర్ణయించారు. 60 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. వెయ్యి మంది ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఐటీ, పార్మా, బ్యాంకింగ్వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. జాబ్ మేళాపై నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. నియోజకవర్గంలో చదువుకున్న వేలాది మంది ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలకు వేలాది మంది హాజరయ్యారు. ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలని ఆరాటపడుతు న్న నిరుద్యోగులు మేళాకు తరలివస్తారని భావిస్తున్నారు. అరవైకిపైగా కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొని, తమకు కావలసిన ఉద్యోగుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. ఆయా రంగాల్లో ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేసి ఉద్యోగావకాశం కల్పిస్తాయి. ఈ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. విజయవంతం చేయండి దోమకొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 23న నిర్వహించే జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు గంప శశాంక్ కోరారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన జాబ్‌మేళా పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. జాబ్‌మేళాలో 60కిపైగా కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. కార్యక్ర మంలో జెడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్, సీడీసీ చైర్మన్ ఐరేని నర్సయ్య, సింగిల్ విండో చైర్మన్ పన్యాల నాగరాజ్‌రెడ్డి తదితరులున్నారు. -
పంపిణీకి నోచని డబుల్ బెడ్రూం ఇళ్లు..!
మెదక్: దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వని చందంగా మారింది డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల పరిస్ధితి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా ఇళ్లు కట్టివ్వలేదు. హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతగా 160 ఇళ్లు, రెండో విడతకు 400 డబుల్ బెడ్రూం పంపిణీకి మంజూరు చేసింది. పట్టణ శివారులో జీప్లస్ టూ పద్ధతిన ఇళ్లు నిర్మించారు. ఎన్నో ఏళ్ల సొంతింటి కల నేరవేరిందని సంతోషం పడుతున్న లబ్ధిదారులకు కలగానే మిగిలింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇళ్ల మంజూరునకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా, 1426 వచ్చాయి. ప్రస్తుతం 264 ఇళ్లు పూర్తికాగా మిగిలినవి చివరి దశలో ఉన్నా యి. లబ్ధిదారుల ఇళ్ల మంజూరునకు జిల్లా అధికా రులు సర్వే నిర్వహించారు. తొలి విడతలో 480 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. ఈ క్రమంలో జా బితాలో అనర్హులు ఉన్నారంటూ లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు రీ సర్వే చేపట్టారు. ఈ రీసర్వేలో 189 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు. మొత్తం 560 ఇళ్లకు గాను 264 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. ఈ 264 ఇళ్లకోసం మొత్తం 342 మందిని ఎంపిక చేశారు. దీంతో మార్చి 22న డ్రా తీయగా, 264 మందికి ఇళ్ల పంపిణీ చేశారు. 78 మందికి నిరాశే మిగిలింది. 20 నుంచి 30 ఇళ్లు మిగిలాయి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. దాదాపు 20 నుంచి 30 ఇండ్లకు సంబందించి చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సతీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే లభ్దిదారులకు పట్టాలు ఇప్పించి గృహ ప్రవేశాలు చేయిస్తాం. – ఆకుల రజిత, మున్సిపల్ చైర్ పర్సన్, హుస్నాబాద్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ డబుల్ బెడ్రూం ఇళ్లను మే 5వ తేదీన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీ దుగా ప్రారంభించి కేవలం 5 గురు లబ్ధిదారు లకు మాత్రమే పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి పట్టాలు ఇచ్చిన వారికి ఇళ్లు ఇవ్వలేదు. ఎంపిక చేసిన మిగితా లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు ఇవ్వకపోవడంతో వారు నిరాశతో ఉన్నారు. పట్టాలు తీసుకున్న వారికి ఇల్లు వచ్చిందనే సంతోషం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్లకు ఎంపికై న వారికి కూడా సంతోషం లేకుండా పోయింది. ప్రతి రోజూ ఇళ్ల వద్దకు వెళ్లి చూసి సంతోషపడాల్సిందే తప్ప గృహ ప్రవేశం చేసింది లేదు. -
వివాహిత అదృశ్యం !
సంగారెడ్డి: కూర బాగాలేదని భర్త మందలించడంతో ఓ వివాహిత ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండలగూడలో నివాసం ఉండే అంజయ్య కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూర బాగాలేదని బార్య ప్రసన్నలక్ష్మీతో గొడవపడ్డాడు. దీంతో ఆమె అదే రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం స్నేహితులు, బంధువుల ఇంట్లో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతుల ఇళ్లకు నోటీసులు !
వర్ధన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు అన్నదాతలకు నోటీసులు పంపుతున్నాయని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరుకుడు వెంకటయ్య అన్నారు. సోమవారం వర్ధన్నపేటలో అఖిలపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి వల్లందాసు కుమార్, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఈరెల్లి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కి శ్రీకాంత్‌తో కలిసి వెంకటయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ. లక్ష వరకు రుణ మాఫీ కోసం రూ.21,557 కోట్లు అవసరమని వ్యవసాయాధికారులు, బ్యాంకర్లు తేల్చి చెప్పారన్నారు. రూ.37 వేల వరకు ఉన్న 5,42,609 మంది రైతులకు రుణం రూ.1206 కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. 31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.20.35 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. బకాయిలున్న 20 లక్షల మంది రైతులను బ్యాంకర్లు డిఫాల్టర్ల జాబితా లో చేర్చడంతో వారి కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నారన్నారు. రుణమాఫీ అమలులో జాప్యం చేయడంతో అసలు వడ్డీ కలిపి అన్నదాతలకు మోయలేని భారంగా మారిందన్నారు. రెన్యువల్ చేయకపోవడంతో రైతులు కొత్తగా సాగు కోసం అప్పు తీసుకునే పరిస్థితి లేదన్నారు. పెట్టుబడి కోసం అధిక వడ్డీకి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను సంప్రదించాల్సి వస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు - నరుకుడు వెంకటయ్య -
ఉచిత ప్రయాణం..! మహిళల ఇష్టారాజ్యం..!!
యశవంతపుర: ఇద్దరు మహిళలు డ్రైవర్, కండక్టర్‌తో గొడవ పడడంతో డ్రైవర్ బస్‌ను నేరుగా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కబ్బూర పట్టణంలో జరిగింది. శనివారం సాయంత్రం చిక్కోడి నుంచి గోకాక్‌కు ఆర్టీసీ బస్ బయలుదేరింది. బస్‌ను ఆరోగ్య కేంద్రం వద్ద నిలపాలని కొందరు మహిళలు డిమాండ్ చేశారు. అక్కడ స్టాప్ లేదని డ్రైవర్ చెప్పాడు. ఎందుకు నిలపవంటూ ఇద్దరు మహిళలు డ్రైవర్, కండక్టర్‌తో గలాటాకు దిగారు. దీంతో డ్రైవర్ కబ్బూరు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు సర్దిచెప్పి పంపించారు. కాగా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి వచ్చాక గొడవలు పెరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి -
పంట పంటకీ.. డీలర్లకు తూకం తంటా..!
నల్లగొండ: పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని గోదాముల వద్ద తూకం వేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీలర్లుకు ఎంఎల్ఎస్ (మండల్ లెవల్ స్టాక్) పాయింట్ వద్ద బియ్యం తూకం వేసి ఇవ్వాలన్న కోర్టు ఆదేశాల మేరకు అధికారులు చర్యలకు పూనుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద వేబ్రిడ్జిలు లేకపోవడంతో డీలర్లు బయోమెట్రిక్‌ను గోదాముల్లో సేకరిస్తూ.. బియ్యం తూకం మాత్రం బయట వేబ్రిడ్డిల వద్ద వేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 4,66,529 రేషన్ కార్డులు జిల్లాలో మొత్తం 4,66,529 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటి పరిధిలో 13,96,933 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఉచితంగా ప్రభుత్వం ఐదు కిలోల చొప్పన బియ్యం అందిస్తోంది. అయితే ప్రతినెల డీలర్లు కార్డుదారులకు బియ్యం తూకం వేసి ఇస్తున్నారు. కానీ డీలర్లకు బియ్యం సరఫరా చేసే ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద మాత్రం తూకం వేయకుండా బస్తా 50 కేజీల చొప్పున లెక్కగట్టి పంపుతున్నారు. దీనివల్ల బియ్యం తక్కువగా వచ్చి తా ము నష్టపోతున్నామని డీలర్లు కోర్టును ఆశ్రయించడంతో డీలర్లకు బయోమెట్రిక్ విధానంలో బియ్యం తూకం వేసి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఆలస్యంగా బియ్యం పంపిణీ.. డీలర్లకు బయోమెట్రిక్ విధానంలో తూకం వేసి బియ్యం ఇవ్వాలని నిర్ణయించడంతో జూలై మాసానికి సంబంధించి ప్రజలకు బియ్యం పంపిణీని 7వ తేదీ నుంచి ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ బియ్యం సరఫరాలో ఆలస్యం కారణంగా 10వ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించారు. గ్రామీణ డీలర్లకు ఇబ్బందులు.. కోర్టు ఆదేశాల మేరకు జూలై మాసానికి సంబంధించిన బియ్యం తూకం వేసి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే, జిల్లాలోని ఆరు ఎంఎల్ఎస్ పాయింట్లలో డీలర్లు వేలిముద్రలు వేసి బియ్యం మాత్రం ప్రైవేట్ వేబ్రిడ్జిల మీద తూకం వేయించుకుంటున్నారు. పట్టణ ప్రాంతంలోని డీలర్లకు ఎక్కువ బియ్యం ఉండడం వల్ల వారికి ఒక లారీ బియ్యం తూకం వేసేందుకు వీలు అవుతుంది. కానీ, గ్రామీణ ప్రాంతాల డీలర్లకు మాత్రం ఇద్దరు, ముగ్గురికి కలిపి ఒక లారీలో బియ్యం పంపిస్తారు. అలా ముగ్గురికి బయట వేబ్రిడ్జి మీద తూకం వేయడం సాధ్యం కావడం లేదు. దీంతో తూకం వేయకుండా పాత పద్ధతినే 50 కేజీల బస్తా చొప్పన లెక్కగట్టి ఇస్తున్నారని కొందరు డీలర్లు పేర్కొంటున్నారు. తూకం వేయకపోవడం వల్ల మళ్లీ తరుగు వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. -
దివ్యాంగులకు దిగులులేని మరింత దివ్యమైన ‘ఆసరా’
నెక్కొండ: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దివ్యాంగులకు అందించే ఆసరా పింఛన్‌ను అదనంగా రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రూ.3,016 ఇస్తుండగా రూ. వెయ్యి పెంపుతో రూ.4,016 అందుకోనున్నారు. తాజా నిర్ణయంతో జిల్లాలోని 15,585 మందికి లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా ప్రభుత్వం వివిధ రూపాల్లో వారికి అండగా నిలుస్తోంది. దివ్యాంగులకు నెలనెలా పింఛన్లతోపాటు ఉపకరణాలు, వాహనాలు, ఇతర పథకాలను అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, బోదకాలు, డయాలసిస్ రోగులు మొత్తం 1,27,089 మంది ప్రతి నెలా ఆసరా పింఛన్లు పొందుతున్నారు. 13 మండలాలు.. 15,585 మంది లబ్ధిదారులు సీఎం ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా 13 మండలాల పరిధిలోని మొత్తం 15,585 మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు. వీరికి ప్రతి నెలా రూ.47 కోట్లను ఆసరా పింఛన్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. తాజా పెంపుతో అదనంగా రూ.1.55 కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందిస్తోంది. మరీ ముఖ్యంగా దివ్యాంగులు ఎలాంటి పని చేయలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలో పింఛన్ పెంపుతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్వులు రాగానే పంపిణీ.. జిల్లాలోని 13 మండలాల పరిధిలో మొత్తం 15,585 మంది దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం వీరికి రూ. 3,016 చొప్పున పింఛన్ అందిస్తోంది. సీఎం ప్రకటనతో వీరికి అదనంగా రూ.1000 కలిపి రూ.4,016 పింఛన్ అందనుంది. ఉత్తర్వులు రాగానే పంపిణీ చేస్తాం. పోరాడి సాధించుకున్నాం.. సంఘటితంగా దివ్యాంగులు చేసిన పోరాట ఫలితంగా ప్రభుత్వం పింఛన్‌ను పెంచింది. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా పింఛన్ పెంచాలని సంఘం తరఫున ఉద్యమించాం. దాని ఫలితంగా రాష్ట్రంలో రూ.4,016 అందుకోనుండడం సంతోషంగా ఉంది. జిల్లాలో ఇంకా అర్హులైన దివ్యాంగులు ఉన్నారని, వారందరికీ ధ్రువపత్రాలు జారీ చేసి పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి. రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నాం. వచ్చే నెలలో అమలు చేస్తామని చెప్పడం హర్షణీయం. –కృష్ణమూర్తి, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు, నెక్కొండ -
కాంగ్రెస్‌లో టికెట్ల పోరు.. నీదా..! నాదా..! ఎవరరిది..?
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనుండటంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తుండగా.. మరోవైపు వారి చేరికకు ముందే చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నాయి. త్వరలో ఇరువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నవారు వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్‌లో అంతర్గత పోరు తప్పదన్న సంకేతాలను చూపుతోంది. జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో కొల్లాపూర్ వేదికగా నిర్వహించేందుకు తలపెట్టిన ‘పాలమూరు ప్రజాభేరి’ బహిరంగ సభ ఏర్పాట్లను సైతం ఇరువర్గాలుగా నేతలు తమ బలప్రదర్శనను చాటేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త, పాత నేతలు సర్దుకుంటారా..! కాంగ్రెస్‌లోకి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి పార్టీ టికెట్ కోసం అంతర్గత పోరు తప్పేలా కనిపించడం లేదు. జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సన్నద్ధం అవుతుండగా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ నియోజకవర్గ నేత చింతలపల్లి జగదీశ్వర్‌రావు భారీ ర్యాలీతో బలప్రదర్శన చేపట్టారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వచ్చే ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాల ని పిలుపునిచ్చారు. ఏళ్లుగా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభల నిర్వహణ, సభ్యత్వాలను పెంచి పార్టీ బలాన్ని పెంచానని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో తాను పోటీలో ఉండటం ఖాయమని ప్రకటించడంతో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న జూపల్లికి పార్టీలో అంతర్గత పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలకు నెలలు మాత్రమే సమయం మిగిలి ఉన్న తరుణంలో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన కేడర్‌లో నెలకొంది. సర్వేల చుట్టూ రాజకీయాలు.. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం కాగా.. వచ్చే ఎన్నికల్లో వీరు కాంగ్రెస్ నుంచి టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని నాగం చెబుతున్నారు. పార్టీలో అంతర్గత పోరును కట్టడి చేసేందు కు సర్వేల ద్వారా టికెట్లను ఖరారు చేస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్వే మొదలైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అ యితే సర్వేలతో పనిలేకుండా ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి అవకాశం ఇవ్వాలని నాగం, జగదీశ్వర్‌రావులు డిమాండ్ చేస్తున్నారు. సమీకరణాలపై ఉత్కంఠ.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలోకి నేతల చేరికలతోపాటు పాలమూరు జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుల చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే వారి చేరికకు ముందే కొత్త, పాత నేతల మధ్య వైరం పెరుగుతుండటం పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. ఆదివారం కొల్లాపూర్‌లో నిర్వహించిన సమావేశానికి హాజరైన నాగం జనార్దన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కకుండా చేస్తే వారిని ఓడిస్తామనే సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే ఇందుకోసం వ్యతిరేకులను అంతా ఏకం చేసే యోచనలో సైతం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో టికెట్ కోసం ఇరువర్గాల నాయకులు చేస్తున్న ప్రయత్నాలు, వారి పట్టింపుల నడుమ చివరికి టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది. పార్టీ ఆదేశించిన విధంగా కొత్త, పాత నేతలు నడుచుకుంటారా.. అంతర్గత కుమ్ములాటలు ఎటువైపు దారితీస్తాయోనన్నది ఉత్కంఠగా మారింది. -
ఇది సీఎం జగన్ పట్టుదల, దక్షతలకు నిదర్శనం
పేదలకు మేలు జరుగుతుందన్న విశ్వాసం కలిగితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతదాకా అయినా వెళ్లడానికి వెనుకాడరు అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లేదేమో. తను నమ్మిన న్యాయం కోసం ఆయన పోరాడతారు. సాధించి తీరుతారు.రాజధాని అమరావతి గ్రామాలలో పేదలకు 50 వేలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన తీరు, తదుపరి వారందరికి ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించిన వైనం చూసిన తర్వాత ఏపీలో పేద వర్గాలకు మరింత భరోసా దక్కినట్లయింది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మరో పక్క ఈనాడు వంటి మీడియా సంస్థలు వేటకుక్కల మాదిరి వెంబడిస్తున్నా జగన్ ఎక్కడా తొణకలేదు. బెణకలేదు. పేదల పట్టాల పంపిణీ కి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడితే దానిని చెడగొట్టాలని కొందరు ప్రయత్నం చేయకపోలేదు. కాని పోలీసులు సమర్ధంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చేశారు.కాని రైతుల ముసుగులో కొంతమంది నల్లజెండాలు, నల్ల బెలూన్లు వంటివాటితో నిరసన తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిరసనగా కూడా సరిగ్గా ఇలాగే బెలూన్ లు ఎగురవేశారు. కాని ఆ తర్వాత ఏమైందో అంతా చూశారు. మోదీ మరోసారి ఎన్నికై దేశానికి ప్రదానమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా కూడా జరిగే ప్రయత్నాలు అలాగే ఉన్నాయి. అమరావతిలో పేదలకు భూములు ఇవ్వడానికి అడ్డుతగులుతున్నారన్న విషయం రాష్ట్రం అంతా తెలిసిపోవడం వల్ల టీడీపీకి భారీగా నష్టం వాటిల్లిందట. ఈ విషయం వారి సొంత సర్వేలలో తేలిందట. దాంతో అమరావతి గ్రామాలలో శుక్రవారం చాలా తక్కువ స్థాయిలోనే ఈ నిరసనలు జరిగాయని చెప్పాలి. టీడీపీ నేతలు నేరుగా రంగంలోకి రాకుండా కొంతమేర జాగ్రత్తపడ్డారని అనుకోవచ్చు. జెఎసి నేతల పేరుతోనో, ఊరు,పేరు లేని రాజకీయ పార్టీ నేత పేరుతోనో ఆందోళన చేయించాలని చూశారు. వారి దీక్ష శిబిరాల వద్ద ఉద్రిక్తత సృష్టించాలని యత్నించారు. పోలీసు అధికారులు మహిళలను ఏదో అన్నారని ప్రచారం చేశారు. వాటిని పెద్ద,పెద్ద అక్షరాలతో ఈనాడు పత్రికలో అచ్చేయించారు. అయినా ప్రజలలో పెద్ద కదలిక రాలేదు. యధాప్రకారం పది, ఇరవై మంది వారి శిబిరంలో కనిపించారు. పేదల పట్టాల విషయంలో తెలుగుదేశం కు కొమ్ముకాసిన వామపక్షాలు కూడా కాస్త సిగ్గుపడినట్లుగా ఉంది. వారు ఎక్కడా ప్రత్యక్ష నిరసనలలో కనిపంచలేదు. మరో వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు పట్టాల పంపిణీకి కార్యక్రమం నిర్వహిస్తే వేలాది మంది తరలివచ్చి ఆయనకు జేజేలు పలికారు. జగన్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సామాజిక అమరావతికి శ్రీకారం చుట్టామని అన్నారు. అంటే ఏదో ఒక కులం, ఒక వర్గం ప్రాధాన్యత కాకుండా, అందరికి సమప్రాతినిద్యం లబించేలా పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం అన్నమాట. గతంలో పేదలకు పట్టాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పేరుతో తెలుగుదేశం నేతలు కోర్టుకు వెళ్లినప్పుడు సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాదించారు. దానికి జగన్ ఇప్పుడు సమాదానం ఇచ్చినట్లయింది.పేదలకు, పెత్తందార్లకు మద్య పోరాటంగానే జగన్ తీసుకువెళుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సెంటు స్థలం స్మశానం, అని సమాధి అని చేసిన తెలివితక్కువ వ్యాఖ్యల ప్రభావం కూడా బాగానే ఉందనిపించింది. లబ్దిదారులు కొందరు దీనిపై ఆయన మీద మండిపడ్డారు. ఒక మహిళ అయితే ముసలినక్కలు తమకు స్థలాలు రాకుండా అడ్డుకోవాలని చూశాయని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం నేతలు కాని, జెఎసి నేతలు కాని గతంలో హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పులు వస్తే తమదే విజయం అని, ప్రభుత్వం దానిని పాటించాలని అంటుండేవారు. కాని ఇప్పుడు ఇళ్ల పట్టాల కేసులో సుప్రింకోర్టు తీర్పు పేదలకు అనుకూలంగా అంటే ప్రభుత్వ వాదనను బలపరిచేలా వచ్చినా వీరు ఆందోళన వీడడం లేదు. విమర్శలు ఆపడం లేదు. పేదల స్థలాల పంపిణీని ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఇదంతా చంద్రబాబు చేసిన నిర్వాకమే అని చెప్పాలి. ఆయన అనవసరంగా వేల ఎకరాల పచ్చని పంటల భూమిని సమీకరించి ,రైతులకు పని లేకుండా ఏడాదికి ఏభైవేల రూపాయల కౌలు ఇవ్వడానికి అంగీకరించిన ఫలితమే ఈ తలనొప్పి అని చెప్పాలి. అదే ఏ వెయ్యో, రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే ఏ గొడవ ఉండేదికాదు. అప్పుడు ఏ పేదలకు ఎక్కడ నివాస స్థలాలు ఇచ్చినా ఎవరూ కాదనేవారు కాదు. అలాకాకుండా మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చడంతో వచ్చిన చిక్కు ఇదంతా. తను తీసుకు వచ్చిన చట్టంలోనే ఐదు శాతం భూమి పేదలకు ఇవ్వాలని ఉంది. దానిని అమలు చేస్తుంటే ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.పట్టాల పంపిణీ సభలో మాట్లాడిన ఇద్దరు మహిళలు తమ ఆవేదనను పంచుకుంటూ సొంత ఇల్లు అన్నది తమ చిరకాల వాంఛ అని, దానిని జగన్ తీర్చారని చాలా సంతృప్తిగా మాట్లాడారు. ఒకరైతే కన్నీటి పర్యంతం అయ్యారు. కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుపడుతున్నా, జగన్ తమకోసం పోరాడారని వారు అభిప్రాయ పడ్డారు. ముఖ్యమంత్రి కూడా వచ్చే జూలై ఎనిమిది అంటే దివంగత తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నాటికి ఈ స్థలాలలో ఇళ్ల నిర్మాణం ఆరంభం అవుతుందని ప్రకటించడం లబ్దిదారులలో ఎంతో సంతోషం కలిగించింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నరకాసురుడిని అయినా నమ్మవచ్చేమో కాని, నారా చంద్రబాబును మాత్రం నమ్మవద్దని కొత్త డైలాగు విసిరారు. యదా ప్రకారం ఎల్లో మీడియా తన ప్రభుత్వానికి సృష్టిస్తున్న అడ్డంకులను ప్రజలకు వివరించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం చానల్ ఒకటి టీడీపీ అధికారంలోకి రాగానే ఈ పట్టాలు రద్దు అవుతాయని దుర్మార్గంగా ప్రచారం చేసిందని వ్యాఖ్యానించారు.వైసిపి ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాజదానిలో ఇళ్ల స్థలాల పంపిణీని ఒక వారం రోజుల కార్యక్రమంగా రూపొందించింది. తద్వారా రాష్ట్రవ్యాప్త ప్రజలపై ఒక ప్రభావం పడాలని యత్నిస్తోంది. తెలుగుదేశం పార్టీ పేదల వ్యతిరేక పార్టీ అని, వారికి మేలు చేస్తుంటే చూడలేకపోతోందని వైసిపి ప్రచారం చేయడానికి ఈ అవకాశం వినియోగించుకుంటుంది. అందుకు తెలుగుదేశం పార్టీనే చాన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా జగన్ పట్టుదల, దక్షతలకు ఈ ఇంత వేగంగా ఈ ఇళ్ల స్థలాల పంపిణీ నిదర్శనం అని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్