ఆర్థిక సంస్కరణల సారథి
రెండుసార్లు దేశ ప్రధాని... మచ్చలేని రాజనీతిజు్ఞడు
రాష్ట్రపతి, ప్రధాని తదితరుల దిగ్భ్రాంతి..
దేశవ్యాప్తంగా ఏడు రోజులు సంతాపం
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) ఇక లేరు. వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆయన గురువారం ఢిల్లీలోని తన నివాసంలో చికిత్స పొందుతూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. దాంతో అత్యంత విషమ స్థితిలో రాత్రి 8 గంటల వేళ హుటాహుటిగా ఎయిమ్స్ ఎమర్జెన్సీ విభాగానికి తరలించారు. ‘‘అన్నిరకాలుగా అత్యవసర చికిత్స అందించినా లాభం లేకపోయింది. 9.51 గంటల ప్రాంతంలో మన్మోహన్ తుదిశ్వాస విడిచారు’’ అని ఎయిమ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.
వివాద రహితునిగా, అత్యంత సౌమ్యునిగా, మృదుభాషిగా, మచ్చలేని రాజనీతిజు్ఞడిగా పేరొందిన మన్మోహన్ మృతి పట్ల రాజకీయ తదితర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాందీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. మన్మోహన్ అస్వస్థత గురించి తెలియగానే సోనియా తన కుమార్తె ప్రియాంకతో కలిసి హుటాహుటిన ఎయిమ్స్‌కు చేరుకున్నారు. మన్మోహన్ పార్థివదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం ఉంచారు.
ఆయన మరణ వార్త తెలిసి సీడబ్ల్యూసీ భేటీ కోసం కర్ణాటకలోని బెల్గావీలో ఉన్న ఖర్గే, రాహుల్ తదితరులంతా హస్తిన బయల్దేరారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం ప్రకటించింది. మన్మోహన్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని ఆదేశించింది. కాంగ్రెస్ కూడా వారం పాటు పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుంది. కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఉదయం సమావేశమై మన్మోహన్‌కు ఘనంగా నివాళులు అర్పించనుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ రెండుసార్లు ప్రధానిగా చేశారు. ఆయనకు భార్య గురుచరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలున్నారు.
⇒ శాంతి, శ్రేయస్సు విడదీయలేనివి. శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అదే సమయంలో అభివృద్ధి లేకుంటే శాంతి ఉండదు. భారతదేశ అసలైన భవితవ్యం దాని సహనశీలత, సమ్మిళిత, సమానత్వ సమాజంగా ఎదగగల సామర్థ్యంలో దాగి ఉంది.
⇒ 1991లో మేం చేపట్టిన సంస్కరణలు ఎవరినీ సంతోషపరిచేందుకు కాదు. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు స్థిరమైన వృద్ధికి పునాది వేయడమే వాటి ఉద్దేశం.
⇒ మన ప్రజల తలసరి ఆదాయం గురించి కంటే వారి ఆదాయాల్లోని అసమానతల గురించే నాకు ఎక్కువ ఆందోళన ఉంది.
⇒ మన దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కానీ వాటిని ప్రతిసారీ మనం మరింత బలంగా, మరింత ఐక్యంగా, మరింత పట్టుదలతో ఎదుర్కొని బయటపడ్డాం. మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కానీ కష్టపడేతత్వం, చిత్తశుద్ధి, సరైన విధానాలతో మనం మనుగడ సాగించగలం.
Comments
Please login to add a commentAdd a comment