-
అవకాశానికే అవకాశం ఇచ్చింది
కొంతమంది గురించి చెప్పడానికి మాటలు అక్కర్లేదు. వాళ్ల పని చూస్తే చాలు! అలాంటి ప్రతిభావంతురాలే థెమిస్ వెనెస్సా! అవకాశాలను ఆమె వెదుక్కోలేదు.. అవకాశాలే థెమిస్ని వెదుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన ప్రతి అవకాశంతో మరో చాన్స్‌ని క్రియేట్ చేసింది ఆమె విలక్షణమైన స్టయిలింగ్!థెమిస్ స్వస్థలం చెన్నై. చిన్నప్పుడే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్‌కి వెళ్లే వయసులోనే నిశ్చయించుకుంది పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని! అనుకున్నట్టుగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక బెంగళూరులోని ఓ ఫ్యాషన్ మేగజీన్‌లో చేరింది. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్‌గా పాపులర్ అయిన అర్చా మెహతాను కలిసింది. ఆమె దగ్గర ఇంటర్న్‌గా చేరింది. తర్వాత తమిళ చిత్రం ‘రెమో’తో ఫ్రీలాన్స్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా సినీ ప్రయాణం మొదలుపెట్టింది. ఆమె విలక్షణ శైలికి సినీ ఇండస్ట్రీ ముచ్చటపడి అవకాశాలను అందిచ్చింది. వాటిల్లో ‘ద రోడ్’, ‘మారా’, ‘వేలైక్కారన్’, ‘పొన్నియిన్ సెల్వన్ ’ వంటి సినిమాలున్నాయి. వాటికి ఆమె అసిస్టెంట్ స్టయిలిస్ట్‌గా చేసింది. ఎన్నో ఫొటో షూట్స్, యాడ్స్‌కూ పనిచేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ ప్రాజెక్ట్ వచ్చినా.. పర్సనాలిటీని హైలైట్ చేసే స్టయిలింగ్‌తో వారిని గ్లోబల్ స్టార్స్‌లా చూపింది. ఆ సిగ్నేచర్ స్టయిల్ ఎంతోమంది స్టార్స్‌కి నచ్చింది. శ్రీనిధి, త్రిష, శోభితా ధూళిపాళ, శ్రద్ధా శ్రీకాంత్, చిన్మయిలతో పాటు శివ కార్తికేయన్, విజయ్, జయం రవిలాంటి మేల్ సెలబ్రిటీలకూ స్టయిలింగ్ చేసింది థెమిస్. -
అచ్చం రాజమౌళి మూవీ 'ఈగ' లాంటి చీమ..!
రాజమౌళి ‘ఈగ’కు ఎన్ని శక్తులు ఉన్నాయో, అన్ని శక్తులూ ఉన్నాయి ఫొటోలోని ఈ చీమకు. కందిరీగ జాతికి చెందిన దీని పేరు ‘ట్రామాటోముటిల్లా బైఫర్కా’. మృదువైన వెంట్రుకల కారణంగా దీనిని బ్రెజిలియన్ వెల్వెట్ చీమ అని కూడా అంటారు. లక్షన్నర జాతుల చీమలు, కందిరీగలు, ఈగలు, తేనెటీగల కంటే కారునలుపులో ఉంటుందిది. ఇది ప్రపంచంలోనే అత్యంత కారునలుపు చీమ, అత్యంత తీవ్రమైన నొప్పి పుట్టించే చీమ కూడా ఇదే! ఈ మధ్యనే దీని బాహ్య నిర్మాణాన్ని నిశితంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు మరిన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. ‘బీల్స్టెయిన్ జర్నల్ ఆఫ్ నానోటెక్నాలజీ’ అధ్యయనం ప్రకారం ఈ చీమకు మెలనిన్తోపాటు, సూపర్ డార్క్ కలరింగ్ ప్లేట్లెట్లు ఎక్కువ. వీటి కారణంగానే దాని శరీరం ఉపరితలంపై పడిన కాంతితో 0.5 శాతం కంటే తక్కువ పరావర్తనం చెందుతుంది. ఈ చీమకు అతినీలలోహిత కాంతిని కూడా గ్రహించే శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వంటగది ఇంటీరియర్ డిజైన్..!) -
స్కాన్ చేసి ధర్మం చేయండి.. బాబయ్యా..
మొన్నీమధ్యే పంజాగుట్ట వెళదామని ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చా.. మెట్లు ఎక్కుతోంటే.. నాలుగో మెట్టు మీద అనుకుంటా... ఒక యాచకుడ్ని చూశా.. యధావిధిగానే అతని ముందో పళ్లెం ఉంది. అందులో కొన్ని చిల్లర పైసలు, 10 రూపాయల నోట్లు ఓ నాలుగు ఉన్నట్లున్నాయి. ఇది కొత్తేమి కాదు కానీ... నన్ను ఆకట్టుకున్నదల్లా... అతని మెళ్ళో ఉన్న ఓ డిజిటల్ కార్డు.అది క్యూఆర్ కోడ్ ఉన్న కార్డు.. పెదాలపై ఓ చిన్న చిరునవ్వు వచ్చింది... ఎస్..మోదీ చెప్పింది కరెక్టే అనిపించింది.. "దేశంలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇప్పుడు అడుగడుగునా డిజిటల్ చెల్లింపులే..రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించి పల్లెల్లో సైతం వేళ్లూనుకుంటాయి..." అంటూ అప్పుడెప్పుడో ప్రధాని అన్నట్లు వచ్చిన వార్త గుర్తుకొచ్చింది.ఇప్పుడీ సంఘటన చూడగానే... నిజమే కదా అనిపించింది..ఇప్పుడంతా డిజిటల్ మయం అయిపోయిందన్నది వాస్తవం. కూరలు కొనడానికి రైతు బజార్ కి వెళ్లినా.. చివరకు ఛాయ్ తాగుదామని టీ స్టాల్ కు వెళ్లినా... జేబులోంచి ఫోన్ తీయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పైసలతో సహా డబ్బులు చెల్లించడం... చాలా సింపుల్ అయిపోయింది..ఎప్పుడైతే ఈ డిజిటల్ చెల్లింపులు విస్తృతమవుతున్నాయో చిల్లరతో పనిలేకుండా పోతోంది.. చిల్లర దాకా ఎందుకు... కనీసం ఒక్క పది రూపాయల నోట్ కూడా జేబులో పెట్టుకోకుండా.. కేవలం సెల్ ఫోన్ తో రోడ్డెక్కేవాళ్ళు ఎంతమందో ఈరోజుల్లో..దీంతో ఎవరైనా చెయ్య చాపి యాచిస్తే... ఓ రూపాయి కూడా విదపలేని పరిస్థితి. మరి వారి ఆదాయం పడిపోక ఏమవుతుంది... అందుకే అనుకుంటా... ఆ యాచకుడు ఈ డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్నట్లున్నాడు.. తప్పులేదు.. త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర యాచించే వాళ్ళు సైతం మెళ్ళో ఓ కార్డు వేసుకుని మీముందు చెయ్యి చాపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీ ప్రిపేర్..మనం పూర్తి స్థాయిలో నగదురహిత సమాజం వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పేందుకు ఇదో ప్రబల ఉదాహరణగా భావించొచ్చు. గత డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా 1673 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్ధిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2024, జనవరి నెలలో ఈ లావాదేవీలు 1220 కోట్లు జరగ్గా.. ఏడాది చివరికి వచ్చేసరికి 400 కోట్లకు పైగా పెరిగాయి. డిజిటల్ విప్లవానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఏం కావాలి?యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) అనేది రకరకాల బ్యాంకుల్ని ఒకేగూటికి చేర్చి చెల్లింపులు చేసేందుకు దోహదపడే ఒక సాధనం. మీ బ్యాంకు ఏదైనా కావచ్చు.. దాన్ని యూపీఐ కి అనుసంధానం చేయడం ద్వారా ఎలాంటి చెల్లింపులైనా క్షణాల్లో చేసేయొచ్చు. పైగా ప్రతీ చెల్లింపునకూ రికార్డు ఉంటుంది.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా సమాచారం ప్రకారం... గత నవంబర్ నెలలో 1548 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ. 21.55 లక్షల కోట్లు. డిసెంబర్ కి వచ్చేసరికి రూ.23.25 లక్షల కోట్ల విలువ చేసే 1673 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్) ని తాజాగా యూపీఐ వెనక్కి నెట్టేసింది. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు 24 గంటల్లో ఎప్పుడైనా సరే తక్షణమే చెల్లింపు చేసే విధంగా ఈ ఐఎంపీఎస్ ను ప్రభుత్వం 2010 లో ప్రారంభించింది. వ్యాపార వర్గాలకు, వ్యక్తులకు ఈ ఐఎంపీఎస్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. ఐఎంపీఎస్ ద్వారా గత ఏడాది నవంబర్ నెలలో రూ. 5.58 లక్షల కోట్ల విలువ చేసే 40.79 కోట్ల లావాదేవీలు జరగ్గా... డిసెంబర్లో వీటి సంఖ్య 44.1 కోట్లకు పెరిగింది. వీటి విలువ కూడా రూ. 6.01 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. ఇక మీరు హైవేల మీద ప్రయాణం చేసేటప్పుడు టోల్ ప్లాజా ల దగ్గర చెల్లింపులు చేస్తారు కదా... గతంలో క్యాష్ ఇచ్చేవారు. ఆ తర్వాత డెబిట్/క్రెడిట్ కార్డులు, యూపీఐ లు వచ్చాయి. ఇప్పుడు ఫాస్టాగ్ అనేది ఈ చెల్లింపుల్లో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. ప్రతి టోల్ ప్లాజా ముందు.. ప్రత్యేకంగా కొంతసేపు ఆగాల్సిన అవసరాన్ని ఈ ఫాస్టాగ్ తప్పించింది. మీరు బయల్దేరేముందే... కొంత మొత్తాన్ని మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఫాస్టాగ్ కి మళ్లిస్తారు. టోల్ ప్లాజా రాగానే అక్కడి స్కానర్లు మీ వాహనానికి ఉన్న ట్యాగ్ ని స్కాన్ చేస్తాయి. అమౌంట్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఇదంతా కొద్ది సెకన్లలోనే జరిగిపోతుంది. తద్వారా వేచి ఉండే వ్యవధి తగ్గడంతో పాటు, చిల్లర నోట్ల బాధ ఉండదు. ఈ ఫాస్టాగ్ లు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. గత నవంబర్ నెలలో 35.89 కోట్ల లావాదేవీలు జరగ్గా.. డిసెంబర్లో ఈ సంఖ్య 38.30 కోట్లకు పెరిగాయి. వీటి విలువ కూడా రూ.6,070 కోట్ల నుంచి రూ.6,642 కోట్లకు పెరిగింది.యూపీఐ, ఐఎంపీఎస్, ఫాస్టాగ్ చెల్లింపులు అనేవి మానవాళి జీవితంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చాయి. ఈ చెల్లింపులు చాలా సురక్షితంగా ఉండటమే కాక, వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ లావాదేవీలు మరింత విస్తృతమై డిజిటల్ ఇండియా రూపురేఖలనే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.-బెహరా శ్రీనివాస రావువిశ్లేషకులు -
'పాతాళ్ లోక్'తో ట్రెండ్ అవుతున్న నగేశ్ కుకునూర్ ఎవరో తెలుసా..?
పాతాళ్ లోక్-2 (Paatal Lok-2) వెబ్ సిరీస్ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ సిరీస్‌కు ఫిదా అవుతున్నారు. 2020లో వచ్చిన మొదటి సీజన్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. జనవరి 17న రెండో సీజన్ విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ టెన్‌లో ఈ సిరీస్ కొనసాగుతోంది. అనుష్క శర్మ నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌లో ఓ కేసును దర్యాప్తు చేసే పోలీసు అధికారి హాథీరామ్ చౌదరి పాత్రకు మంచి పేరొచ్చింది. మన తెలుగు దర్శకుడు, నటుడు నగేష్ కుకునూర్ (Nagesh Kukunoor) కూడా ఇందులో ఓ బిజినెస్ మ్యాన్‌గా కనిపించాడు. ఆయన పాత్రకు కూడా మంచి గుర్తింపు దక్కుతోంది. దీంతో ఆయన గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.హైదరాబాద్‌లో జన్మించిన నగేశ్ కుకునూర్.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత విద్యనభ్యసించేందుకు యునైటెడ్ స్టేట్స్‌లోని అట్లాంటా వెళ్లి తన చదువు పూర్తి అయిన తర్వాత కొన్నాళ్లు అక్కడే ఉద్యోగం చేశారు. తనకు ఉద్యోగం కంటే సినిమాలపై ఉన్న ఆసక్తితో అక్కడే నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ తీసుకున్నారు. అక్కడే ఉంటూ ఉద్యోగం ద్వారా సంపాధించిన డబ్బుతో 1998లోనే 'హైదరాబాద్ బ్లూస్' అనే ఆంగ్ల చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయుల గురించి అట్లాంటాలో వ్రాసిన స్క్రిప్ట్ ఆధారంగా రూపొందించబడింది.హైదరాబాద్ బ్లూస్ (1998), రాక్‌ఫోర్డ్ (1999), ఇక్బాల్ (2005), దోర్ (2006), ఆశేయిన్ (2010), లక్ష్మి (2014), ధనక్ (2016) చిత్రాలకు గాను ఏడు అంతర్జాతీయ అవార్డులతో పాటు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో ‘గుడ్‌లక్ సఖి’ అనే తెలుగు చిత్రాన్ని కూడా ఆయన డైరెక్ట్ చేశారు. నగేశ్ ఇప్పటికే అక్షయ్ కుమార్, అయేషా టాకియా,జాన్ అబ్రహం, సోనాల్ సెహగల్ వంటి బాలీవుడ్ స్టార్స్‌ను డైరెక్ట్ చేశారు.‘పాతాళ్ లోక్-2’లో నగేశ్ వ్యాపారవేత్త పాత్రలో మెప్పించారు. అనుష్క శర్మ మొదటిసారి నిర్మాతగా ఈ వెబ్ సిరీస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఫస్ట్ సీజన్‌కు వచ్చిన రెస్పాన్స్ రెండో సీజన్‌కు కూడా వచ్చింది. ఇందులో జైదీప్ అహ్లావత్, నగేశ్ కుకునూర్, గుల్ పనాగ్, ఇశ్వక్ సింగ్ ముఖ్యపాత్రలు పోషించారు. అనివాష్ అరుణ్ దర్శకత్వం వహించారు.చదవండి: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. అసలైన నిందితుడి అరెస్టు -
బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వంటగది ఇంటీరియర్ డిజైన్..!
రోజులో సగకాలం గడిచేది వంటింట్లోనే! అది ఎంత శుచిగా.. ఆహ్లాదంగా ఉంటే వంటలు అంత రుచిగా చవులూరిస్తూంటాయి. అలాంటి వంటల్లో.. ఆ వంటగది ఇంటీరియర్‌లో ఇండియన్ స్టయిలే వేరు! ఆ అలంకరణను మీ కిచెన్‌లో సెట్చేసుకోవడానికి లక్షలు ఖర్చుపెట్టాలేమో అనుకునేరు.. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఆ గ్రేస్‌ను తీసుకురావచ్చు!కుండలు, టెర్రకోట వస్తువులు, బుట్టలు, ఇత్తడి పాత్రలతో కిచెన్‌కు సంప్రదాయ, ఆధునికతల ఫ్యూజన్‌ను అద్దవచ్చు. మన ఇళ్లల్లోని తరతరాల పాత్రల వైభవాన్నీ కొలువుదీర్చవచ్చు.ఉపయోగంలో లేని పాత్రలకు పెయింట్ వేసి వాటిల్లో మొక్కల తొట్లను పెట్టి.. వంటిగదికి ప్రకృతి శోభతో గార్నిష్ చేయవచ్చు.కిచెన్‌లోనూ, డైనింగ్ టేబుల్‌పైనా చక్కటి డిజైన్ల హ్యాండ్లూమ్ క్లాత్స్‌ను పరచి కొత్త కళతో మెరిపించవచ్చు. సంప్రదాయ మండల డిజైన్లు, ప్రకృతి దృశ్యాల కళాకృతులతో డెకరేట్ చేయవచ్చు.గాజు జాడీలతో ఉన్న ఓపెన్ షెల్ఫ్‌లు అందంగానే కాదు.. వంటకు కావల్సిన దినుసులు అందుకోవడానికీ అనువుగా ఉంటాయి.– ఎన్.ఆర్ (చదవండి: అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే కంగుతింటారు..!) -
తమకు తామే పిండం పెట్టుకుని.. నాగ సాధువులుగా మారిన 1,500 మంది సన్యానులు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు లెక్కలేనంతమంది నాగ సాధువులు తరలివచ్చారు. వీరు చేసే కఠోర సాధన వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాజాగా ప్రయాగ్‌రాజ్‌లో 1500 మంది నాగ సాధువులుగా మారారు. వీరు జునా అఖాడా నుంచి దీక్ష తీసుకున్నారు.నాగ సాధువుగా మారడానికి అనేక రకాల పరీక్షలు ఎదుర్కోవాలి. ఈ ప్రక్రియకు ఆరు నెలల నుండి ఒక ఏడాది వరకూ పడుతుంది. ఈ కఠిన పరీక్షల్లో విజయం సాధించాలంటే, సాధకుడు ఐదుగురు గురువుల నుండి దీక్ష పొందాలి. ఈ దీక్ష ఇచ్చేవారిని పంచ దేవ్ అని అంటారు.నాగ సాధువుగా మారాలంటే, ఆ వ్యక్తి ప్రాపంచిక జీవితాన్ని పూర్తిగా త్యజించాలి. తనకు తాను పిండప్రదానాన్ని చేసుకోవాలి. భిక్షాటన ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తినాల్సి ఉంటుంది. ఏ రోజైనా ఆహారం లభించకపోతే, ఆకలితోనే ఉండాలి.తాజాగా జునా అఖాడాలో నాగ సాధువులుగా చేరిన 1,500 మంది, వారి తల్లిదండ్రులతో సహా ఏడు తరాల వారికి పిండప్రదానాన్ని చేశారు. దీంతో అతనికి ఇకపై తన కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఈ నాగ సాధువులు తమ జీవితాంతం సనాతన ధర్మ పరిరక్షణకు, వేద సంప్రదాయ పరిరక్షణకు, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉండాలి.ఇది కూడా చదవండి: సంధ్యావేళ.. మహా కుంభమేళా -
టి20 ప్రపంచకప్‌లో నేడు (జనవరి 19) భారత్, వెస్టిండీస్ మ్యాచ్
కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు శుభారంభం చేశాయి. మలేసియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కు తొలి రోజు వర్షం ఆటంకం కలిగించింది. శనివారం మొత్తం 6 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా... అందులో మూడింట మాత్రమే ఫలితం వచ్చింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో స్కాట్లండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 15.1 ఓవర్లలో 48 పరుగులకే ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేమీ బ్రే 1 పరుగే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ఎలెనార్ లరోసా 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం ఆ్రస్టేలియా 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసి గెలిచింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 5 వికెట్ల తేడాతో నేపాల్‌పై నెగ్గింది. మొదట నేపాల్ 18.2 ఓవర్లలో 52 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో బంగ్లాదేశ్ 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.గ్రూప్ ‘సి’లో భాగంగా దక్షిణాఫ్రికా 22 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా... మొదట దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 69 పరుగులకు పరిమితమైంది.పాకిస్తాన్, అమెరికా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘బి’ మ్యాచ్... నైజీరియా, సమోవా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు కాగా... ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లోనూ ఫలితం తేలలేదు.మన అమ్మాయిలకు తొలి పరీక్ష డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అండర్–19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్... గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమ తొలి పోరులో ఆదివారం వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 2023లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలవగా... ఇప్పుడు అదే ప్రదర్శన పునరావృతం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టులో గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్ రూపంలో ఇద్దరు తెలుగమ్మాయిలు ఉన్నారు. ఈ ఇద్దరూ రెండేళ్ల క్రితం జరిగిన అండర్–19 వరల్డ్‌కప్‌లోనూ భాగస్వాములు కావడం భారత జట్టుకు కలిసిరానుంది. సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న యంగ్ ప్లేయర్లకు ఇది చక్కటి అవకాశం కానుంది. మరోవైపు టి20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా గుర్తింపు ఉన్న వెస్టిండీస్ అమ్మాయిలు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనుకుంటున్నారు. -
గాడిద పందేలు
పండుగలు, జాతరలు భక్తితోనే కాదు సరదా సంబరాలతోనూ మైమరపిస్తాయి!కోడి పందేలు, ఎడ్ల పందేలు వంటి వాటికి అవే వేదికలు! ఇప్పుడు గాడిదల పోటీలూ మొదలయ్యాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం, కడపజిల్లాల్లో! ఆ వివరాలు..మోటారు వాహనాలు పెరగడంతో రవాణా మొదలు చాలా విషయాల్లో పశువుల మీద ఆధారపడే పరిస్థితి దాదాపుగా కనుమరుగైందనే చెప్పొచ్చు. ఆ క్రమంలో రజకులకు గార్దభాల అవసరమూ లేకుండా పోయింది. కానీ కొన్ని కుటుంబాలు మాత్రం ఇంకా వాటి ఆధారంగానే జీవనం సాగిస్తున్నాయి. ఆ జంతువులను సంరక్షిస్తున్నాయి. పండుగల వేళ వీటితో కలసి సంబరాలు చేసుకునే ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి. ఆయా పర్వదినాల్లో వాళ్లు వాటిని చక్కగా అలంకరించి, పూజలు చేసి, ఊరేగించి వాటి ప్రత్యేకతను చాటుతున్నారు. వాటి మధ్య పందేలు నిర్వహిస్తున్నారు. ఫలానా ప్రాంతంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు కరపత్రాలను ముద్రిస్తారు. ఆ సమాచారాన్ని ముందుగా అందుకున్నవారు మిగిలిన పోటీదారులందరికీ వాట్సాప్ చేస్తారు. ఈ పోటీలను కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా కొన్ని మగ గార్దభాలను సిద్ధం చేస్తారు. ప్రతిరోజూ వీటిపై ఇసుక మూటలను వేసి నేల మీదే కాదు నీటిలోనూపరుగెత్తుతూ శిక్షణనిస్తారు. వీటికి మొక్కజొన్న పిండి, మినప పొట్టు, సజ్జలు తదితరాలను ఆహారంగా పెడతారు.పోటీ పదినిమిషాలే.. బరువును లాగే ఈ గాడిదల పోటీల వ్యవధి కేవలం పదినిమిషాలే! 80 పల్ల ఇసుక (రెండు క్వింటాళ్ల పది కిలోలు)తో పోటీలు నిర్వహిస్తారు. ఆ బరువుతో నిర్దేశించిన పది నిమిషాల్లో ఏ గాడిదైతే ఎక్కువ దూరం వెళ్తుందో దానినే విజేతగా నిర్ణయిస్తారు. విజేతకు నగదు, లేదా వెండిని బహుమతిగా అందిస్తారు. నగదు రూ. 5వేలు మొదలుకొని రూ. 20వేలకు పైనే ఉంటుంది. ఈ పోటీల కోసం అనంతపురం, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లి మరీ గాడిదలను కొంటున్నారు. బ్రీడ్ ఆధారంగా తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లోని గాడిదలను కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీటి ధర రూ. 50వేలు మొదలుకొని రూ.లక్షకు పైనే ఉంటుంది. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. అయితే పోటీల్లో పాల్గొనే గాడిదలకు వయసుతో సంబంధం ఉండదు. మోసే బరువే ప్రామాణికం. లీటరు పాలు రూ.7వేలకు పైనేగాడిద పాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. లీటరు పాల ధర రూ.7వేలకు పైగా పలుకుతోంది. అనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో డెయిరీలు సైతం ఏర్పాటయ్యాయి. రోజుకు ఓ గాడిద నుంచి 200 మి.లీ. పాలను సేకరిస్తారు. వీటిని పలు వ్యాధులను నయం చేసేందుకు వినియోగిస్తున్నారు. ఇతర జిల్లాల్లో గాడిద మాంసానికీ డిమాండ్ ఉంటోంది. అందుకే రాత్రివేళల్లో ఆయా ప్రాంతాల వాళ్లు వచ్చి వీటిని ఎత్తుకుపోతున్నట్లు యజమానులు ఆందోళన చెందుతున్నారు.బురదనీటిలో సంబరంఉగాది రోజున కర్నూలు పట్టణంలోని కల్లూరులో కొలువైన చౌడేశ్వరీ మాత దేవాలయ ప్రాంగణాన్ని బురదతో చిక్కగా అలికేస్తారు. గార్దభాలను ముస్తాబు చేసి బండ్లు కడతారు. ఆ బురదలో వీటికి పోటీ నిర్వహిస్తారు. దీన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. గుర్తింపు ఉంటోందిపండుగలు, జాతరల సమయంలో మా జీవితాల్లో భాగమైన గార్దభాలతో సరదాగా బరువులను లాగించే పోటీలను నిర్వహిస్తున్నాం. పోటీల్లో బహుమతి సాధిస్తే గ్రామంలో మంచి గుర్తింపు ఉంటోంది. ఎక్కడ పోటీలు నిర్వహించినా వీటిని తీసుకెళ్తున్నాం.– చాకలి నాగ మద్దిలేటి, ముక్కమల్లఓ సరదా ఆరు సంవత్సరాలుగా గాడిదను పోటీలకు తీసుకెళ్తున్నా. అది ఇప్పటి వరకు 60 పందేల్లో పాల్గొంది. పోయిన ప్రతిచోటా మొదటి లేదా రెండోస్థానాన్ని గెలుచుకుంటోంది. అలా వచ్చిన డబ్బు రాకపోకలకే సరిపోతోంది. అయినా పోటీల్లో పాల్గొనడం ఓ సరదా. ఆ గెలుపుతో మాకు, మా ఊరికి పేరొస్తే చాలు! – చాకలి సుబ్బరాయుడు, వేల్పనూరు · పి.ఎస్.శ్రీనివాసులు నాయుడు, కర్నూలు -
సైఫ్‌పై దాడి.. నిందితుడు బంగ్లాదేశీ: ముంబై పోలీసులు
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించారు. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడి పేరు విజయ్ దాస్ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్‌గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్‌లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించాం. అతడిని నిన్న(శనివారం) అరెస్ట్ చేశాం. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అతడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడు. అతడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరుతాం. దీనికి సంబంధించిన తదుపరి విచారణ చేపడతాం. ప్రాథమిక విచారణలో అతడిని బంగ్లాదేశీయుడిగా గుర్తించాం. నిందితుడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడు. భారత్ వచ్చాక విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడు. ఆరు నెలల క్రితం ముంబయి వచ్చాడు. భారతీయుడని చెప్పడానికి అతడి వద్ద సరైన ఆధారాలు లేవు’’ అని తెలిపారు.#WATCH | Saif Ali Khan Attack case | Mumbai: DCP Zone 9 Dixit Gedam says, "There is primary evidence to anticipate that the accused is a Bangladeshi. He does not have valid Indian documents. There are some seizures that indicate that he is a Bangladeshi national...As of now, we… pic.twitter.com/aV22IhKF30— ANI (@ANI) January 19, 2025ఇదిలా ఉంటే.. బాంద్రాలోని సైఫ్ నివాసంలో గురువారం (జనవరి 16) తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లాడు. దుండగుడిని చూసిన జేహ్ కేర్‌టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకొన్న సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలో సైఫ్ గాయపడ్డారు. ఆరుచోట్ల కత్తి గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆస్పత్రిలోనే ఉన్నారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు దాదాపు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. దాదాపు మూడు రోజుల తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. -
Kho Kho World Cup 2025: తుది పోరుకు భారత జట్లు
న్యూఢిల్లీ: మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌లో భారత జట్ల హవా కొనసాగుతోంది. గ్రామీణ క్రీడలో మన పురుషుల, మహిళల జట్ల గర్జన ఫైనల్స్‌కు చేర్చింది. శనివారం ఇక్కడి ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఆతిథ్య జట్ల జోరుకు దక్షిణాఫ్రికా జట్లు తోక ముడిచాయి. భారత మహిళల బృందం 66–16 స్కోరు తేడాతో సఫారీ జట్టుపై ఏకపక్ష విజయాన్ని సాధించింది. నిర్మలా భాటి, వైష్ణవి అదరగొట్టారు. తొలి క్వార్టర్లో చైత్ర 5 పాయింట్లతో చక్కని ఆరంభమిచ్చింది. నజియా బీబీ, నిర్మల అవుటైనప్పటికీ ఆమె జట్టుకు కీలక పాయింట్లు తెచ్చిపెట్టింది.రెండో క్వార్టర్లో రేష్మ జోరుతో భారత్ స్కోరు శాసించే స్థితికి చేరింది. దీంతో 33–10తో భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. మూడో క్వార్టర్లో వైష్ణవి పొవార్, నస్రీన్ షేక్, బిలార్దేవిల సమన్వయంతో పాయింట్లు కూడగట్టగా, ఆఖరి క్వార్టర్లో నస్రీన్ షేక్, రేష్మ రాథోడ్‌లు రాణించడంతో భారత్ భారీతేడాతో జయకేతనం ఎగరవేసింది. మరో సెమీస్‌లో నేపాల్ జట్టు 89–18తో ఉగాండాపై ఏకపక్ష విజయం నమోదు చేసింది.అమ్మాయిల విభాగంలో చేతులెత్తేసిన సఫారీ జట్టు పురుషుల ఈవెంట్లో పోరాడింది. దీంతో భారత్ గెలిచేందుకు చెమటోడ్చింది. చివరకు భారత పురుషుల జట్టు 62–42 స్కోరు తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచి ఫైనల్ చేరింది. ఆతిథ్య జట్టులో ప్రతీక్ వాయ్‌కర్, ఆదిత్య, నిఖిల్, గౌతమ్, రామ్‌జీ కశ్యప్, పబని సబర్, సుయశ్ రాణించారు. రెండో సెమీఫైనల్లో నేపాల్ 72–29తో ఇరాన్‌ను ఓడించి ఆతిథ్య జట్టుతో టైటిల్ సమరానికి సై అంటోంది. ఆదివారం జరిగే ఫైనల్స్‌తో ఈ ప్రపంచకప్‌కు తెరపడుతుంది.