అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు చిత్తశుద్ధి కొరవడుతోంది. విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరమైన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కీమ్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షకు దరఖాస్తు చేయించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
దీనివల్ల విద్యార్థులు నష్టపోనున్నారు. ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు అర్హులైన విద్యార్థులు జిల్లాలో 22,500 మంది ఉన్నారు. వీరిలో 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటిదాకా 650 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు నెల రోజులుగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. శనివారం (నేడు) గడువు ముగియనుంది. చివరి రోజు ఎంత మంది దరఖాస్తు చేసుకుంటారో ప్రశ్నార్థకమే. అసలు ఈ పరీక్ష గురించి పూర్తిగా అవగాహన లేని ఉపాధ్యాయులు చాలా మంది ఉండడం బాధాకరం.
ఎంపికైతే ఏడాదికి రూ.6 వేలు
ఎన్‌ఎంఎంఎస్ పరీక్షను ఎనిమిదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు. ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏటా రూ.6 వేల ప్రకారం నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్పు అందుతుంది. అంటే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం దాకా స్కాలర్‌షిప్పు వస్తుందన్న మాట. మన జిల్లాకు సంబంధించి సగటున 320-330 మందికి ప్రతియేటా అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది నవంబరు రెండున ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరు అర్హులంటే..
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, ఎయిడెడ్ యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. వీరిలో కూడా వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు అనర్హులు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.
హెచ్‌ఎం ద్వారా దరఖాస్తులు
విద్యార్థులు ప్రధానోపాధ్యాయుల(హెచ్‌ఎంలు) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను హెచ్‌ఎంలు డీఈఓ కార్యాలయంలో అందజేస్తారు. వాటిని రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయానికి పంపుతారు. అక్కడ పరిశీలించి అర్హులైన వారి పేర్లతో జాబితాను తిరిగి జిల్లా విద్యాశాఖకు పంపుతారు. ఈ జాబితా ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. జవాబు పత్రాలను రాష్ర్ట కార్యాలయంలో మూల్యాంకనం చేసి.. రిజర్వేషన్ ఆధారంగా మెరిట్ జాబితాను జిల్లాకు పంపుతారు. ఎంపికైన విద్యార్థుల వివరాలను ఆయా పాఠశాలలకు పంపి.. వారి ఉమ్మడి (తల్లి లేక తండ్రితో కలిసి) బ్యాంకు ఖాతాలు తెప్పించుని కేంద్రానికి పంపుతారు. తర్వాత ప్రతియేటా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో స్కాలర్‌షిప్పు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారిలో ఎక్కువ మంది పేద విద్యార్థులే. వారికి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన హెచ్‌ఎంలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. విస్తృతంగా అవగాహన కల్పిస్తే ప్రతిభ ఉన్నవారికే స్కాలర్‌షిప్పు అందే అవకాశం ఉంటుంది. ఈ విషయం తెలీని కారణంగా అత్యంత ప్రతిభ ఉన్న పేద పిల్లలు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ప్రతియేటా ఇదేతంతు కొనసాగుతోంది. దీని గురించి విద్యా శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఈ పరీక్ష గురించి తెలుసుకున్న ఓ విద్యార్థి తండ్రి గుంతకల్లు పట్టణంలోని ఓ స్కూల్ హెచ్‌ఎం వద్దకు వెళ్లి ఆరా తీస్తే ‘అదేందో నాకు తెలీదు. వెళ్లి డీఈఓ ఆఫీసులో కలువు’ అంటూ ఉచిత సలహా ఇచ్చారట. దరఖాస్తు మీకే ఇవ్వాలని చెబుతున్నారంటే తనకు తెలీదంటూ అసహనం వ్యక్తం చేశారని విద్యార్థి తండ్రి వాపోయారు. దీంతో ఆయన డీఈఓ కార్యాలయానికి వచ్చి అధికారులకు విన్నవించారు.
వెంట పడుతున్నా ఫలితం లేదు
ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, వీలైనంత ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చూడాలని హెచ్‌ఎంల వెంటపడుతున్నా లాభం లేదు. ప్రతిభ లేని వాళ్లను ఎంత మందిని మిస్ చేసినా పర్వాలేదు. ప్రతిభ ఉన్న ఒక్క విద్యార్థికిఅన్యాయం జరిగడం భావ్యం కాదు.
- గోవిందు నాయక్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్
650/22500
Published Sat, Sep 6 2014 3:17 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement