వెనుక 'బడి'
వెనుక 'బడి'
Published Sat, Oct 15 2016 3:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
పదో తరగతి బోధించే టీచర్లలో చదివి అర్థం చేసుకున్న వారు 20 శాతం మాత్రమే. మిగిలిన వారు పాఠ్యపుస్తకాల గురించి అవగాహన లేకుండా యాంత్రికంగానే బోధిస్తున్నారు. 6 నుంచి 10 తరగతి వరకు విద్యార్థుల్లో తెలుగు చదివి అర్థం చేసుకోగలిగిన వారు 55 శాతం మందే ఉన్నారు. ఇదీ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పరిస్థితి. సర్వశిక్షా అభియాన్ అధికారులు గత నెలలో జిలాలోని 60 పాఠశాలల్లో చేసిన సర్వేలో వెల్లడైన విషయాలను పరిశీలిస్తే.. సర్కారు చదువుల దుస్థితి ఇట్టే తెలిసిపోతుంది.
కరీంనగర్ ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ స్థాయి వరకు ఉచిత విద్యను అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల బోధనా విధానం, విద్యార్థుల్లో చతుర్విద ప్రక్రియలు తెలుసుకోవడం, వారికి అక్కడ కల్పించిన వసతులు వంటి అంశాలను పరిశీలించేందుకు ఎస్‌ఎస్‌ఏకు చెందిన మూడు బృందాలు గతనెల 20 నుంచి 26వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, ఎమ్మార్సీ కేంద్రాలు కలిపి దాదాపు 60 విద్యాసంస్థల్లో పరిశీలన జరిపాయి. వారి పరిశీలన మేరకు చాలా పాఠశాలల్లో పాఠ్యాంశాలను సగం సగమే నేర్పుతున్నట్లు వెల్లడైంది. సాంఘికశాస్త్రంలో చిత్రపటాలు, సైన్స్ చిత్రాలు, గ్లోబ్, అట్లాసు వంటివి అందుబాటులో ఉన్నా వినియోగించడం లేదని తేలింది. పాఠశాలల్లో ప్రయోగపరికరాలు నామమాత్రంగానే వాడుతున్నట్లు పరిశీలన బృందాలు గుర్తించాయి. బోధనలో ఉపాధ్యాయులు, చతుర్విధ ప్రక్రియల్లో విద్యార్థులు వెనుకబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా అనేక విషయాలు ఎస్‌ఎస్‌ఏ బృందాల పరిశీలనలో తేలాయి.
తరగతి గది పరిశీలన...
పాఠశాలల్లో చేరిన విద్యార్థులు తప్పనిసరిగా చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు చేసేలా చూడడం అత్యవసరం. దీని గురించి తక్షణ చర్యలు చేపట్టాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయుల బాధ్యతలు, విధుల నిర్వహణను పరిశీలించేందుకు పర్యవేక్షణ వ్యవస్థను మార్చాలి.
పాఠశాలలను విషయ నిపుణుల సహకారంతో సందర్శించి ఉపాధ్యాయుల సందేహాలను నివృత్తి చేయాలి.
ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా మారింది. వీరు పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించాలి. అనే పలు సూచనలను రాష్ట్ర బృందం జిల్లా విద్యాశాఖకు తెలిపినట్లు సమాచారం. అలాగే జిల్లాలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పేరుకపోయిన సమస్యలు, మౌలిక వసతుల లేమి వివరాలను పూర్తిస్థాయిలో సమాచారం త్వరలో అందజేయాలని కోరినట్లు సమాచారం.
తరగతి గది విద్యార్థుల స్థాయి...
6 నుంచి 10 తరగతి వరకు విద్యార్థుల్లో తెలుగు చదివి అర్థం చేసుకోగలిగిన వారు 55 శాతం మందే ఉన్నారు.
తమకు తెలిసిన విషయాన్ని సొంత మాటల్లో రాయగలిగిన వారు 50 శాతమే ఉన్నట్లు గుర్తించారు.
చదవడం, రాయడం కూడా చేయలేని వారు 30 శాతం మంది ఉన్నారు.
6-10వ తరగతిలో ఆంగ్లంలో చదివి అర్థం చేసుకోగల విద్యార్థులు 40 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది.
గణితంలో గుణకారం, భాగహారం, సంకలనం, వ్యవకలనం చేయగలిగిన విద్యార్థులు 50 శాతం మందే.
పదో తరగతిలో 40శాతం మంది విద్యార్థులు చతుర్విద ప్రక్రియలు చేయలేకపోయారు.
పరిశీలించిన అంశాల్లో కొన్ని...
పదో తరగతి బోధించే టీచర్లలో చదివి అర్థం చేసుకున్న వారు 20 శాతం మాత్రమే. మిగిలిన వారు పాఠ్యపుస్తకాల గురించి అవగాహన లేకుండా యాంత్రికంగానే బోధిస్తున్నారు.
ఒక పాఠంలోని విషయాన్ని, పాఠం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాల గురించి ఇచ్చిన అభ్యాసాలను నిర్వహించేందుకు తరగతులు కేటాయించినా సరిగా స్పందించలేకపోయారు. ఏ పీరియడ్‌లో ఏం బోధించాలో తెలిసినవారు 20 శాతం మాత్రమే ఉన్నారు.
సమగ్ర నిరంతర మూల్యాంకనం పాక్షికంగా 50 శాతం పాఠశాలల్లోనే అమలు చేస్తున్నారు. వాటికి సంబంధించిన నివేదికలు మాత్రం పరిశీలన జరిపిన పాఠశాలల్లో లేవు.
ఉపాధ్యాయులు పాఠం మధ్యలో.. ఇచ్చిన ప్రశ్నల గురించి అడగడం, చర్చ నిర్వహించడం చేస్తున్నారని సగం మంది మాత్రమే చెప్పారు.
Advertisement
Advertisement