పశువుకు ఆధార్ మాదిరిగా యూనిక్ నెంబరు
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలోని ప్రతి పాడిపశువుకూ ఆధార్‌కార్డు మాదిరిగా యూనిక్ నంబరు కేటాయించి ట్యాగ్ చేస్తామని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ–డీఎల్‌డీఏ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) డాక్టర్ ఎన్.తిరుపాలరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇన్‌ఫర్మేషన్ నెట్‌వర్క్ ఫర్ ఎనిమల్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్ (ఇనాఫ్) కింద చేపట్టిన ‘పశుసంజీవని’ కార్యక్రమాన్ని గోపాలమిత్రల ద్వారా అమలు చేస్తున్నామన్నారు. పశువులకు యూనిక్ నంబర్ కేటాయించడం వల్ల కచ్చితమైన పశుసంపద గణాంకాలు తెలుస్తాయన్నారు. దీంతో పాటు వాటి ఆరోగ్యం, వైద్య చికిత్సలు, ఎలాంటి టీకాలు ఇవ్వాలో తెలుస్తుందన్నారు. అందువల్ల రైతులు సహకరించాలని సూచించారు.
మార్చి చివరి నాటికి పశువులన్నింటికీ ‘ఆధార్’
రానున్న మార్చి నాటికి జిల్లాలోని ఆవులు, గేదెలకు ఆధార్ కేటాయించే కార్యక్రమం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తిరుపాలరెడ్డి తెలిపారు. జనవరిలో 35 శాతం, ఫిబ్రవరి 35 శాతం, మార్చిలో 30 శాతం లక్ష్యం సాధించాలని గోపాలమిత్రలకు లక్ష్యం ఇచ్చామని ఆయన తెలిపారు.
నంబర్ కేటాయింపు ఇలా...
గోపాలమిత్రల పరిధిలో ఉన్న ఆవులు, గేదెలను గుర్తించి వాటికి యూనిక్ నంబరు ట్యాగ్ తగిలిస్తారు. అలాగే పశువుల ఆరోగ్య వివరాలతో కూడిన డేటా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇందులో పశువులకు ఇచ్చే మేత వివరాలు, టీకాలు, వైద్య చికిత్సలు, పశువులను అమ్మినా, కొన్నా వాటి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
యూనిక్ నంబర్ ఎందుకంటే...
పశువులు ఎన్ని ఉన్నాయనే దానిపై పక్కా గణాంకాలు అందుబాటులోకి రావడం వల్ల పశు పథకాలు, బడ్జెట్ కేటాయింపులు చేయడానికి సులభమవుతుందనే ఆలోచనతోనే ప్రభుత్వం పశుసంజీవని అమలు చేస్తోందని తిరుపాలరెడ్డి తెలిపారు. మేలు జాతి పశుసంపదను అభివృద్ధి చేయడం, అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులను అదుపులో ఉంచడం, ఎప్పటికపుడు ముందస్తు చర్యలు చేట్టేందుకు పశువులకు యూనిక్ నంబర్ కేటాయిస్తున్నారు. అలాగే వైద్య చికిత్సా విధానంలో మార్పులు తీసుకువచ్చి ప్రాణాంతక వ్యాధులను నివారించడం, పాల ఉత్పత్తి రెట్టింపు చేయడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని వైద్య సదుపాయం మెరుపరచడం, ఈ–మార్కెటింగ్‌ను ప్రోత్సహించే వీలుంటుంది.
గోపాలమిత్రలకు అలవెన్సులు
మార్చిలోగా లక్ష్య సాధన కోసం గోపాలమిత్రలకు అలవెన్సులు ప్రకటించాము. గోపాలమిత్రలు కూడా తమవంతు బాధ్యతగా మార్చి నెలాఖరులోగా వంద శాతం లక్ష్యం సాధించడానికి చర్యలు తీసుకోవాలి. రైతులు కూడా పశుసంపదకు సంబంధించి సరైన వివరాలు ఇచ్చి గోపాలమిత్రలకు సహకరించాలని తిరుపాలరెడ్డి కోరారు. ప్రస్తుత 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2.60 లక్షల పశువులకు కృత్రిమ గర్భోత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా... డిసెంబర్ నెలాఖరుకు 1.95 లక్షలు పూర్తయిందన్నారు. అలాగే 65,400 దూడలకు లేగ దూడల సంరక్షణ పథకం అమలు చేస్తున్నామనీ, గోపాలమిత్రలు, సూపర్‌వైజర్లను సంప్రదించి కృత్రిమ గర్భోత్పత్తి, లేగదూడల సంరక్షణ కార్యక్రమాలకు రైతులు ఉపయోగించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment