విజయవాడ బ్యూరో : రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మెగా వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మాతా అమృతానందమయి ట్రస్ట్ ఆధ్వర్యంలోని అమృత యూనివర్సిటీ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం ఇక్కడి క్యాంపు కార్యాలయంలో కలసిన వర్సిటీ ప్రతినిధులు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేస్తూ.. ఇందుకు సంబంధించిన సవివరమైన ప్రాజెక్టు రిపోర్టును అందజేశారు. రూ.2,500 కోట్ల అంచనాతో విశ్వవిద్యాలయంతోపాటు 2,250 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పుతామని తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నెలకొల్పే ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రీసెర్చ్-హెల్త్‌కేర్ క్యాంపస్‌ను సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అమరావతిలో అమృత వర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు.. మాతా అమృతానందమయిదేవిని కోరిన మీదట ఈ వర్సిటీని నెలకొల్పనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న తమ వర్సిటీ కేరళ, కర్ణాటకల్లోనూ వర్సిటీలను నెలకొల్పిందన్నారు. అమెరికాలోని ఐవీ యూనివర్సిటీ, మరికొన్ని ప్రఖ్యాత యూరోపియన్ వర్సిటీలతో ‘స్టూడెంట్స్ ఎక్చేంజ్’ ప్రోగ్రాములు నడుపుతూ విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నట్లు చెప్పారు. సీఎంను కలసిన వారిలో విశ్వవిద్యాలయం ప్రో చాన్సలర్ డాక్టర్ ప్రేమ్‌నాయర్, అమ్మాజీ ల్యాబ్స్ డెరైక్టర్ భవానీ బిజ్‌లాని, కాలిఫోర్నియాకు చెందిన అమృత ఇంటర్నేషనల్ ప్రతినిధి శ్రీనివాస్ పోలిశెట్టి, భూలక్ష్మి సత్యసాయి, రఘు ఉన్నారు. కాగా రాజధానిలో నవ నగరాల కూర్పులో భాగంగా ఇప్పటికే పలు ప్రఖ్యాత సంస్థలు తమ విద్యాకేంద్రాల్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయని ఈ సందర్భంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో సీఎం కార్యాలయం తెలిపింది. కేంద్రప్రభుత్వ సహకారంతో బ్రిటన్‌కు చెందిన ఒక సంస్థ మెడికల్ వర్సిటీ ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందం చేసుకుందని పేర్కొంది.
అమరావతిలో ‘అమృత’ వైద్య విశ్వవిద్యాలయం
Published Sat, Feb 20 2016 12:22 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement