పోలవరం  పనుల ప్రక్షాళన! | AP Government is Going to Reverse Tendering in the Polavaram Project Contracts | Sakshi
Sakshi News home page

పోలవరం  పనుల ప్రక్షాళన!

Published Fri, Aug 16 2019 3:21 AM | Last Updated on Fri, Aug 16 2019 9:23 AM

AP Government is Going to Reverse Tendering in the Polavaram Project Contracts - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం పనులను సమూలంగా ప్రక్షాళన చేసి అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసి వాటికి ఒకే ప్యాకేజీ కింద ఈనెల 17న రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా ఎడమ, కుడి కాలువలు, కనెక్టివిటీస్‌(అనుసంధానాల) పనుల కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసి  రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. అంచనాలు భారీగా పెంచేసి నామినేషన్‌ పద్ధతిలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు  తక్షణం వైదొలగాలంటూ నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. పోలవరం పనుల్లో రూ.3,128.31 కోట్ల మేర అవినీతి జరిగిందని నిర్ధారించిన నిపుణుల కమిటీ గత సర్కారు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన సొమ్మును రికవరీ చేయడంతోపాటు మిగిలిన పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని సిఫార్సు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు అనుమతి తీసుకుంది. 

యనమల వియ్యంకుడికి నోటీసులు..
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ కాంట్రాక్టు ఒప్పందం విలువ రూ.181.6 కోట్లు కాగా రూ.71.04 కోట్ల పనులను పాత కాంట్రాక్టర్‌ 2014 నాటికే పూర్తి చేశారు. అనంతరం 60 సీ నిబంధన కింద తొలగించిన రూ.93.74 కోట్ల పనుల అంచనా వ్యయాన్ని రూ.142.88 కోట్లకు పెంచేసి అప్పటి ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు చెందిన పీఎస్‌కే–హెచ్‌ఈఎస్‌(జేవీ)కి నామినేషన్‌ పద్ధతిలో టీడీపీ సర్కారు కట్టబెట్టింది. ఇందులో రూ.26.20 కోట్ల మట్టి పని వ్యయాన్ని రూ.77.82 కోట్లకు పెంచేసి పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు నిబంధనలకు విరుద్ధంగా రూ.51.62 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. దీన్ని రికవరీ చేసి మిగిలిన పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు ఒప్పందం నుంచి వైదొలగాలంటూ పుట్టా సుధాకర్‌యాదవ్‌కు చెందిన సంస్థకు పోలవరం ఎడమ కాలువ ఎస్‌ఈ ఒకటి రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నారు.

నామా, బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాలపై వేటు..
పోలవరం ఎడమ కాలువ ఆరో ప్యాకేజీ పనుల కాంట్రాక్టు ఒప్పంద విలువ రూ.196.20 కోట్లు కాగా నామా సంస్థ రూ.112.48 కోట్ల విలువైన పనులు చేసింది. 60సీ కింద రూ.70.29 కోట్ల విలువైన పనులు తొలగించారు. దీంతో నామా చేతిలో రూ.13.43 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. ఆ తర్వాత ఆరో ప్యాకేజీ పనుల కాంట్రాక్టు ఒప్పంద విలువను రూ.399.18 కోట్లకు పెంచేయించారు. ఇందులో 60సీ కింద తొలగించిన రూ.70.29 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.153.46 కోట్లకు పెంచేసి చంద్రబాబు తన సన్నిహితునికి చెందిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు. నామా చేతిలో మిగిలిన రూ.13.43 కోట్ల పనుల విలువను రూ.119.81 కోట్లకు పెంచేశారు. నిబంధనల ప్రకారం నామాకు పెరిగిన అంచనా వ్యయంలో 95 శాతం(రూ.192.31 కోట్లు) జరిమానాగా వసూలు చేయాల్సిందిపోయి రూ.116.38 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చడాన్ని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. వీటికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని సిఫార్సు చేసింది. నామా, బీఎస్సార్‌లపై ఒకట్రెండు రోజుల్లో పోలవరం ఎడమ కాలువ ఎస్‌ఈ వేటు వేయనున్నారు. ఈ పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించనున్నారు. ఇదే రీతిలో పోలవరం ఎడమ, కుడి కాలువలో మిగిలిన పనుల కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసుకుని రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా సెప్టెంబర్‌ నాటికి కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేయనున్నారు.

కనెక్టివిటీస్‌పై ప్రత్యేక దృష్టి..
మరోవైపు పోలవరం నుంచి కుడి, ఎడమ కాలువలకు నీటిని సరఫరా చేసే అనుసంధానాల (కనెక్టివిటీస్‌) పనులను శరవేగంగా పూర్తి చేయటంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్లకు గత సర్కార్‌ దోచిపెట్టిన సొమ్మును తిరిగి వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించడంపై కసరత్తు చేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement