అంతర్జాతీయ స్థాయిలో శంకుస్థాపన ఏర్పాట్లు
మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి
తాడికొండ: అమరావతి నూతన రాజధాని నిర్మాణానికి ఈనెల 22న జరగునున్న శంకుస్థాపన కార్యక్రమానికి అంతర్జాతీయస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు పురపాలకశాఖ, వ్యవసాయ శాఖ మంత్రులు పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండ్రాయినిపాలెంలో శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై కలెక్టర్ కాంతిలాల్ దండేను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రాంగణంలో వీఐపీలకు ఒకటి, ఎంఐపీలకు ఒకటి, ప్రధాన వేదిక ఒకటి.. మొత్తం మూడు వేదికలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రధానంగా ఈ కార్యక్రమంలో రైతులకు వీఐపీ హోదా కల్పించనున్నట్లు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి రావటానికి సుముఖత చూపిన ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు. ఇది సీఎం చ్రందబాబు కృషి ఫలితమేనని చెప్పారు. దీన్ని బట్టి రానున్న రోజుల్లో రాజధాని నిర్మాణానికి మంచి రోజులు రానున్నట్లు పేర్కొన్నారు. త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శంకుస్థాపన వేదిక ఉద్దండ్రాయినిపాలెం ఎస్సీ కాలనీకి సమీపంలో ఈశాన్య ముఖ దిశగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జేసీ చెరుకూరి శ్రీధర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.