జిల్లాలో 491 వాహనాలు సమకూర్చిన అధికారులు
అప్పుగా డీజిల్ పోయిస్తున్న యంత్రాంగం
పేరుకున్న రూ.40 లక్షల బకాయిలు
చిత్తూరు (అర్బన్): రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ప్రోటోకాల్ కోసం కాన్వాయ్ వాహనాలు.. బస్సులు, ఇతర వాహనాలు సమకూర్చలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు ఈ సారి చంద్రబాబు పర్యటనకు పాఠశాలల బస్సులు సైతం తీసేసుకోవాలని జిల్లా అధికారి ఒకరు ఆదేశాలు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.
నీరు-మీరు పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాకు వస్తున్నారు. సీఎం బహిరంగ సభకు జనాన్ని తరలించడానికి జిల్లా యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల రాష్ట్రంలో పాఠశాలల బస్సులు వరుసగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. పలువురు చిన్నారులు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై బాహటంగానే స్పందించిన ప్రభుత్వం పాఠశాలల బస్సులు పిల్లల రవాణాకు తప్ప మరే పనికి ఉపయోగించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ బాబు పర్యటనలో ఈ నిబంధనల్ని పూర్తీగా తుంగలో తొక్కిన యంత్రాంగం జిల్లాలో 491 బస్సుల్ని సీఎం పర్యటనకు సిద్ధం చేసింది. వీటిలో వంద ప్రైవేటు బస్సులు, 300 వరకు పాఠశాలలకు చెందిన బస్సులు తీసుకున్నారు. నిబంధనల్ని పాటించాల్సిన అధికారులే పిల్లల బస్సుల్ని ఇలా బలవంతంగా లాక్కుంటూ పెద్దల సభలకు ఉపయోగించడం ఎంత వరకు సమంజసమని బస్సుల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.
డబ్బులేవీ...?
సీఎం పర్యటనకు సమకూర్చిన బస్సులకు ముందుగా అడ్వాన్సులు ఇవ్వాలి. ఇందు కోసం కలెక్టర్ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కో బస్సుకు కనీసం వంద లీటర్ల డీజి లు, బస్సుకు అద్దె, డ్రైవర్ బత్తాతో పాటు కిలో మీటరకు కొంత చొప్పున డబ్బులు ఇవ్వాలి. కానీ గత రెండుసార్లు జిల్లాలో జరిగి న సీఎం పర్యటనకు డీజిల్ కోసం ఎలాంటి అడ్వాన్సులు ఇవ్వలేదు. రవాణాశాఖ అధికారులు పెట్రోలు బంకు యజమానుల్ని బతిమిలాడుకుని అప్పు కింద డీజిలు పోయించారు. జిల్లా యం త్రాంగం ఆర్నెళ్ల తరువాత డీజిల్ బిల్లు విడుదల చేస్తే అప్పుడు బకాయిలు చెల్లించారు. తాజాగా సీఎం పర్యటనకు స్వాధీనం చేసుకున్న ఏ ఒక్క వాహనానికి లీటర్ డీజిల్ పోయించడం తమవల్ల కాదని, రవాణాశాఖ అధికారులు చేతులెత్తేశారు.
దీంతో జిల్లా పౌరసరఫరాల శాఖ కల్పించుకుని అప్పుగా డీజిల్ పోయిం చడానికి ముందుకు వచ్చింది. ఇక గత ఏడాది కాలంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్ కోసం అద్దెకు ఇచ్చిన వాహనాలకు, ప్రస్తుత ముఖ్యమంత్రి పర్యటనకు కేటాయించిన కాన్వాయ్‌ల అద్దెల బకాయిలు మొత్తం వెరసి రూ.40 లక్షలకు చేరుకుంది. ఫలితంగా ముఖ్యంత్రి, వీఐపీ కార్యక్రమాలకు వాహనాలివ్వాలంటేనే ట్రావెల్స్ నిర్వాహకులు భయపడుతున్నారు. వాహనాలను ఇష్టానుసారంగా వాడుకోవడంతో పాటు వాటిని గుల్ల చేసి చేతికివ్వడం, అద్దెలు చెల్లించకపోవడం, డ్రైవర్‌లకు వేతనాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘బాబు’ పర్యటనకు స్కూల్ బస్సులు
Published Thu, Feb 19 2015 2:18 AM | Last Updated on Sat, Jul 28 2018 7:54 PM
Advertisement