ఫేస్.. బుక్కయ్యారు!
సామాజిక అనుసంధాన వేదిక అయిన ఫేస్‌బుక్‌ను కొందరు బ్లాక్‌మెయిలింగ్‌కు వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖుల పేరిట నకిలీ అకౌంట్లను తెరిచి దుర్వినియోగం చేస్తున్నారు. అశ్లీల చిత్రాలు, రాతలతో వెగటు పుట్టిస్తూ పరువును బజారుకీడుస్తున్నారు. ఇలాంటి వాటిపై ఇప్పటికే ఎందరో వీఐపీలు వివరణలు ఇచ్చుకున్న సందర్భాలున్నాయి. ఇదే పరంపరలో ఫేస్‌బుక్ మాయాజాలం కోరుట్లలో కలకలం రేపింది.
పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల అశ్లీల చిత్రాలు సోమవారం రాత్రి కోరుట్లకు చెందిన ఓ మహిళ పేరిట ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్‌లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం కొందరు ప్రముఖ నాయకులకు దడ పుట్టిస్తోంది. ఈ విషయమై పోలీసులు పూర్తి స్థాయిలో ఆరాలు తీస్తున్న క్రమంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
కోరుట్ల, న్యూస్‌లైన్ : నెల క్రితం కోరుట్ల పట్టణానికి చెందిన ఓ యువకుడు ఓ మహిళతో అశ్లీలంగా ఉన్న చిత్రాలు పట్టణానికి చెందిన ఓ మహిళ ఫేస్‌బుక్ అకౌంట్లలో ప్రత్యక్షమయ్యాయి. ఈ యువకునితోపాటు మరికొందరు స్థానికులకు సంబంధించిన అసభ్యకరమైన చిత్రాలు, వీడియో క్లిప్పింగ్‌లు అదే ఫేస్‌బుక్ అకౌంట్లలో కనిపించాయి. సదరు ఫేస్‌బుక్ అకౌంట్‌లో మహిళగా చెప్పుకున్న వ్యక్తి చాటింగ్ పేరిట ఎరవేసి కొందరి అశ్లీల చిత్రాలు సంపాదించి అవే చిత్రాల ఆసరాతో వారిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు లాగుతున్నట్లు వెల్లడైంది. దీంతో సదరు బాధితులు తమకు జరిగిన మోసంపై పోలీసులకు పిర్యాదు చేశారు. వెంటనే సదరు ఫేస్‌బుక్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.
రూ.లక్షల్లో గుంజారు..
నెల క్రితం బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు స్థానికులు ఒకరిద్దరిని పోలీసు ఠాణాకు పిలిపించి విచారించారు. ఆ సమయంలో కల్లూర్ రోడ్‌లో నివాసముండే ఓ యువకునితో చాటింగ్ చేసిన ఫేస్‌బుక్ మహిళ.. అతని అశ్లీల చిత్రాలు సంపాదించి అనంతరం అవే ఫొటోలతో బెదిరించి తన అకౌంట్‌లో రూ.24వేలు వేయించుకున్నట్లు తేలింది. ఇదేరీతిలో మహిళ పేరిట ఫేస్‌బుక్ అకౌంట్‌నిర్వహిస్తున్న వ్యక్తి పట్టణానికి చెందిన వివిధ పార్టీల ప్రముఖులతో చాటింగ్ చేస్తూ వారి అశ్లీల ఫొటోలు సంపాదించి మళ్లీ వాటిని అందరికి పంపుతామని బెదిరింపులు మొదలెట్టారు.
అంతా ప్రముఖులు కావడంతో తమ పరువు పోతుందన్న భయంతో గుట్టుచప్పుడు కాకుండా సదరు ఫేస్‌బుక్ మహిళ చెప్పిన అకౌంట్‌లో రూ.లక్షల్లో డబ్బులు వేసి మిన్నకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు లోతుగా విచారణ జరపగా ఆ అకౌంట్ నల్గొండ జిల్లా కోదాడకు చెందిన ఓ మహిళ పేరిట ఉన్నట్లు వెల్లైడె ంది. పోలీసులు మరింత లోతుకు వెళ్లగా సదరు బ్యాంకు అకౌంట్‌తో సంబంధం ఉన్న వ్యక్తి పరారైనట్లు సమాచారం. తర్వాత కొద్దిరోజులు పోలీసుల విచారణకు బ్రేక్ పడింది.
కొత్త అకౌంట్‌తో మళ్లీ బ్లాక్‌మెయిల్
పోలీసుల విచారణతో మహిళ పేరిట ఫేస్‌బుక్ అకౌంట్ నిర్వహిస్తున్నట్లు తేలిన వ్యక్తి జాగ్రత్తపడి దుబాయ్‌కి పరారైనట్లు సమాచారం. దుబాయ్ వెళ్లిన సదరు వ్యక్తి మళ్లీ కోరుట్లకు చెందిన మరో మహిళ పేరిట బోగస్ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి మళ్లీ ప్రముఖులతో చాటింగ్ మొదలెట్టినట్లు తెలిసింది. నెల రోజుల క్రితం పట్టణానికి చెందిన పలువురు ఇదే రీతిలో మోసపోయిన విషయాన్ని పెద్దగా పట్టించుకోని మరికొన్ని పార్టీల నాయకులు కొందరు మళ్లీ సదరు ఫేస్‌బుక్ అకౌంట్ వ్యక్తితో చాటింగ్ మొదలెట్టారు.
ఈ క్రమంలో చాటింగ్ చేస్తున్న నాయకులు అశ్లీల ఫొటోలు సంపాదించిన ఫేస్‌బుక్ అకౌంట్ నిర్వహిస్తున్న వ్యక్తి మళ్లీ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఈ బెదిరింపులను కొందరు నాయకులు పట్టించుకోకపోవడంతో వారి అశ్లీల ఫొటోలను సోమవారం ఫేస్‌బుక్‌లో పెట్టినట్లు తెలిసింది. దీంతో ఉలిక్కిపడ్డ సదరు నాయకులు సోమవారం సీఐ మహేష్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మళ్లీ కూపీ లాగి నల్గొండ జిల్లా కోదాడకు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
బోగస్ ఫేస్‌బుక్ అకౌంట్ కథ ఏమిటి?
పోలీసుల విచారణలో మహిళల పేరిట బోగస్ అకౌంట్ నిర్వహిస్తున్న వ్యక్తి కథలాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వాడని తేలింది. ఆ వ్యక్తిగతంలో తనకు ప్రియురాలిగా ఉన్న కోరుట్లకు చెందిన ఓ యువతి ఫొటోలను సంపాదించి వాటినే ఫేస్‌బుక్‌లో పెట్టి ప్రముఖులతో చాటింగ్ చేస్తూ వారికి అశ్లీల మెసేజ్‌లు, చిత్రాలు పంపుతూ వలవేసి చివరికి వారి అశ్లీల ఫొటోలను సేకరించినట్లు తెలుస్తోంది. బోగస్ అకౌంట్ నిర్వహిస్తున్న వ్యక్తి కోదాడకు చెందిన మహిళతో సంబంధాలు నెరుపుతూ ఆమె అకౌంట్‌లో డబ్బులు వేయించి ఆమె సాయంతోనే డ్రా చేసుకున్నట్లు సమాచారం.
నెలరోజలు క్రితం ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో సదరు వ్యక్తి అక్కడ నుంచి పరారై దుబాయ్‌కి చేరుకుని, అక్కడనుంచే మళ్లీ బోగస్ ఫేస్‌బుక్‌ల పేరిట మాయ చేస్తున్నట్లు తెలిసింది. ఇదంతా నడుపుతున్నది ఒక్కరేనా.. ఇంకా ఎవరికైనా పాత్ర ఉందా.. ఈ వ్యవహారంలో మహిళలు ఎవరైనా ఉన్నారా.. కోరుట్ల వాసుల వివరాలు స్థానికులకు సంబంధం లేకుండా ఎలా తెలుస్తున్నాయి.. అన్న అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. పోలీసులు మరింత పకడ్బందీగా విచారణ సాగిస్తే పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.