సీసా పెంకులతో పొడుచుకుని నడిరోడ్డుపై వ్యక్తి వీరంగం
భీమవరం క్రైం:భీమవరం మండలం కొవ్వాడపుంత ప్రాం తంలో ఓ వ్యక్తి బుధవారం సీసా పెంకులతో పొట్ట, గుండెలపై పొడుచుకుని అరుస్తూ హడావుడి చేశాడు. భయబ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. రూరల్ ఏఎస్సై ఎం.లక్ష్మణకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసాపురం సమీపంలోని పీచుపాలెం గ్రామానికి చెందిన మోటూరి గంగాధర్ (30) వడ్రంగి పని చేస్తుంటాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కొంతకాలంపాటు హైదరాబాద్ ఉన్న అతడు ఇటీవల తన అత్తగారి ఊరైన శివదేవుని చిక్కాల వచ్చి నివాసం ఉంటున్నాడు. గంగాధర్‌తో ఘర్షణ తలెత్తడంతో అతని భార్య పిల్లలను తీసుకుని గణపవరంలో ఉంటున్న సోదరుడి వద్దకు వెళ్లిపోయింది. దీంతో గంగాధర్ మంగళవారం గణపవరం వెళ్లి వారితో గొడవపడ్డాడు. బుధవారం ఉదయం భీమవరం మండలం కొవ్వాడ పుంత సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద సీసా పెంకులతో పొడుచుకొని, అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేశాడు.
రోడ్డుపై వచ్చీపోయే వాహనాలకు అడ్డంగా నడుస్తూ హడావుడి చేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న టూటౌన్ పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించగా, డాక్టర్ రామాంజనేయులు చికిత్స అందించారు. సీసా పెంకులు పొట్ట లోపలకు వెళ్లిపోవడంతో పేగులు బయటకు వచ్చాయి. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. ఇంతలోనే అతను ప్రాణాలు విడిచాడు. గంగాధర్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్సై లక్ష్మణకుమార్ తెలిపారు. గురువారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తారని చెప్పారు.
శాడిస్ట్‌లా వ్యవహరించేవాడు
గంగాధర్ గతంలో కూడా శాడిస్ట్‌లా వ్యవహరించేవాడని అతని భార్య తెలిపింది. మద్యానికి బానిసై భయబ్రాంతులకు గురిచేసేవాడని, తన పిల్లలను సిగరెట్లతో కాల్చడం, తన చేతులపై బ్లేడుతో కోసుకోవడం చేసేవాడని వివరించింది. కొవ్వాడపుంతలో బంధువులు ఎవరూ లేరని, తన భర్త అక్కడకు వచ్చి సీసా పెంకులతో ఎందుకు పొడుచుకున్నాడో అర్థం కావడం లేదని తెలిపింది.