సారథి నామినేషన్‌పై హైడ్రామా
- బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం
- పార్థసారథి నామినేషన్ ఆమోదం
- వైఎస్సార్ సీపీని లక్ష్యంగా చేసుకుని టీడీపీ హంగామా
- సారథిపై కేసులు ఉన్నాయంటూ అభ్యంతరం
- ఫెరా కేసులో సుప్రీం, హైకోర్టు స్టే ఉండటంతో నామినేషన్‌కు ఆమోదం
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో గెలుపోటముల మాట ఎలా ఉన్నా నామినేషన్ల పరిశీలన దశలోనే వైఎస్సార్ సీపీని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించేలా తెలుగుదేశం పార్టీ పన్నిన వ్యూహం బెడిసికొట్టింది. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కొలుసు పార్థసారథిపై ఫెరా కేసు ఉందంటూ టీడీపీ అభ్యంతరం లేవనెత్తి సాయంత్రం వరకు హైడ్రామా నడిపి చివరకు అభాసుపాలైంది.
ఫెరా కేసులో మాజీ మంత్రి సారథికి ఊరట కల్పిస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను మచిలీపట్నం లోక్‌సభ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎం రఘునందన్‌రావుకు అందజేయటంతో నామినేషన్‌ను ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగుదేశం పార్టీ నేతలు నడిపిన హైడ్రామాకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్ణయంతో ఈ హైడ్రామాకు తెరపడింది. వివరాలివీ..
మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథికి ఫెరా కేసులో హైకోర్టు శిక్ష, జరిమానా విధించిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానం ఎలాంటి స్టే ఇవ్వనందున ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని కోరుతూ టీడీపీ శాసనసభ వ్యవహారాలు నిర్వహించే కోనేరు వెంకటసురేష్, మచిలీపట్నం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య కలెక్టర్ ఎం రఘునందన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తరఫు న్యాయవాదులు రంగంలోకి దిగారు.
ఫెరా కేసులో వాస్తవ విషయాలను హైకోర్టు న్యాయవాది వెంకటేశ్వరరావు, స్థానిక న్యాయవాది జె.భానుప్రకాష్ రిటర్నింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్‌కు వివరించారు. మధ్యాహ్నం వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఫెరా కేసులో శిక్ష పడిన సారథి నామినేషన్‌ను తిరస్కరించాలని టీడీపీకి చెందిన న్యాయవాదులు.. ఈ కేసుపై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాపీలు తమ వద్ద ఉన్నాయని, వాటిని చూపుతామని వైఎస్సార్ సీపీ తరఫు న్యాయవాదులు కలెక్టర్‌కు వివరించారు.
దీంతో సోమవారం సాయంత్రం 5.30ల్లోపు సంబంధిత పత్రాలను చూపాలని కలెక్టర్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి తరఫు న్యాయవాదులకు సూచించారు. దీంతో వారు స్టే పత్రాలను కటెక్టర్‌కు చూపడంతో అవన్నీ సక్రమంగా ఉన్నందున సారథి నామినేషన్‌ను ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో మచిలీపట్నం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు, ఆయన తరఫు న్యాయవాదులు వెనుదిరిగారు.
హైడ్రామా సాగిందిలా...
టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు, ఆయన తరఫు న్యాయవాది కోగంటి సాయిమోహన్, సైకం భాస్కరరావు, టీడీపీ శాసనసభ వ్యవహారాల ప్రతినిధి కోనేరు వెంకటసురేష్ సోమవారం కలెక్టరేట్‌లో హైడ్రామా నడిపారు. కొనకళ్ల, ఆయన తరఫు న్యాయవాదులు కలెక్టర్‌తో మాట్లాడుతుండగా హైదరాబాదు నుంచి వచ్చిన కోనేరు వెంకటసురేష్ కలెక్టరేట్‌లో విడతలు విడతలుగా మీడియాకు సమాచారం ఇస్తూ హడావుడి చేశారు.
సాయంత్రం 5.30 సమయంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ తరఫు న్యాయవాదులు, టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు మరోసారి కలెక్టర్‌తో సమావేశమవగా ఆ సమయంలోనూ కలెక్టరేట్ వద్దే ఉన్న వెంకటసురేష్ మీడియా ప్రతినిధులకు తనదైన శైలిలో సమాచారమిస్తూ గడిపారు. చివరికి కలెక్టర్ నామినేషన్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించటంతో అంతా మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తరఫు న్యాయవాది భానుప్రకాష్ విలేకరులతో మాట్లాడుతూ ఫెరా కేసులో సారథికి సుప్రీంకోర్టు, హైకోర్టు స్టేలు ఇచ్చాయని, ఈ విషయాన్నే కలెక్టర్‌కు ఆధారాలతో చూపామని వివరించారు.