- ఉగాది వేడుకల్లో సుదీర్ఘ రాజకీయ ప్రసంగం
సాక్షి, విజయవాడ బ్యూరో: ఉగాది వేడుకల సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కోడ్‌కు తూట్లు పొడిచారు. ఎన్నికల కమిషన్ సూచనలను కూడా లెక్క చేయకుండా వేడుకల్లో రాజకీయ ప్రసంగం చేశారు. ప్రభుత్వం ఉగాది వేడుకలు నిర్వహించిన తుళ్లూరు మండలం అనంతవరంలో కోడ్ అమల్లో ఉంది. కష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇది అమల్లోకి వచ్చింది.
దీని ప్రకారం అనంతవరంలో ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ఉత్సవాలు నిర్వహించకూడదు. రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడే ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే రాజకీయ ప్రసంగాలు లేకుండా కేవలం వేడుకలు నిర్వహించాలని ఈసీ సూచించింది. దీన్ని చంద్రబాబు పరిగణనలోకి తీసుకోకుండా గంటన్నరసేపు సుదీర్ఘ రాజకీయ ఉపన్యాసం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు రాజధాని, రుణమాఫీ, డ్వాక్రారుణాల మాఫీతోసహా అనేక అంశాల గురించి ప్రకటనలు చేశారు. ఎన్నికలు నిర్వహించే జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలోనే ఆయన రాజకీ య ప్రసంగం చేసినా వారు మిన్నకుండిపోయారు. మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ సైతం కోడ్‌ను పట్టించుకోకుండా మాట్లాడారు.