బాబుగారి ‘విదేశీ’ విన్యాసాలు!
‘ఆంధ్రప్రదేశ్‌కు మైక్రోసాఫ్ట్, ఆపిల్!
రాజధానికి సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్‌ప్లాన్ రూపకల్పన!!
డ్వాక్రాకు ‘వాల్‌మార్ట్’ సొబగులు... కోనసీమ కొబ్బరి నీళ్లకు ‘పెప్పికో’ హంగులు!!!
43వేల కోట్లతో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు... రూ.10 వేల కోట్లతో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం..
బంగారం రిఫైనరీ కేంద్రం ఏర్పాటుకు ఇండానీ గ్లోబల్ ఆసక్తి.. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అన్‌స్టీల్ సంసిద్ధత
సింగపూర్, న్యూయార్క్, లండన్, బీజింగ్, టోక్యో...... తరహాలో అమరావతి నిర్మాణం’
విదేశీ పర్యటనలకు ముందు, ముగిసిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలివి. అయితే వీటిలో ఏ ఒక్కటీ ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. కోట్ల రూపాయల ప్రజాధనంతో గత మూడేళ్లలో 12 సార్లు విదేశీ పర్యటనలు చేసిన చంద్రబాబు.. వివిధ కంపెనీలతో లెక్కలేనన్ని అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రూ.వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని,లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు. అయితే అవి ఎంతవరకూ కార్యరూపం దాల్చాయి అంటే ప్రభుత్వమే సమాధానం చెప్పలేని పరిస్థితి!
సాక్షి, అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి దాదాపు మూడేళ్లవుతోంది. ఈ మూడేళ్లలో ఆయన 12 సార్లు విదేశాల్లో పర్యటించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తానంటూ సగటున మూడు నెలలకోసారి తన బృందాన్ని వెంటేసుకుని ప్రత్యేక విమానాల్లో విదేశాలను చుట్టి వస్తున్నారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రతియేటా వెళ్లి వస్తున్నారు. ఆయా దేశాల్లో అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. లెక్కలేనన్ని అవగాహనా ఒప్పందాలు(ఎంఓయూ) కుదుర్చుకున్నారు. అయితే ఒప్పందాలు కాగితాలపై కనిపిస్తున్నాయే తప్ప, ఒక్కటంటే ఒక్కటీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. మరోవైపు ఏ దేశ పర్యటనకు వెళ్లినా ఆయా దేశాల రాజధానులుగా అమరావతిని మారుస్తానని చంద్రబాబు ప్రకటిస్తుండటం మరో విశేషం.
1.25 లక్షల మందికి ఉద్యోగాలట!
సీఎం చంద్రబాబు తాజాగా అమెరికాలో ఏడు రోజులపాటు పర్యటించారు. 15 నగరాలను సందర్శించారు. 30కి పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. 90కిపైగా కంపెనీల ప్రతినిధులు, పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. అమెరికాలోని మూడు రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. డెల్, యాపిల్, సిస్కో, గూగుల్, క్వాల్‌కమ్, మోసెర్, జోహో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించానని చంద్రబాబు వెల్ల్లడించారు. ఈ పర్యటన వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని, తద్వారా కనీసం 1.25 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ట్వీటర్‌లో పేర్కొన్నారు.
అద్భుతాలు కానరావేమి?
విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ రాష్ట్రంలో ఇక అద్భుతాలే జరగబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించడం పరిపాటిగా మారింది. అనుకూల మీడియా ఆయనకు వంతపాడుతోంది. ఆయన చేస్తున్న విదేశీ పర్యటనలను ఆకాశానికెత్తేస్తోంది. ఒప్పందాలు, పెట్టుబడులు, పరిశ్రమల రాకతో రాష్ట్రంలో ఊహించని స్థాయిలో అభివృద్ధి జరిగిపోతోందంటూ ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతోంది. నిజానికి ఈ మూడేళ్లలో ఒక్క అద్భుతాన్నైనా చూసే భాగ్యం రాష్ట్ర ప్రజలకు ఇంకా దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని, సంస్థల స్థాపనకు అవసరమైన ప్రోత్సాహకాలు అందజేస్తామని చంద్రబాబు ప్రతి విదేశీ పర్యటనలో చెబుతున్నారు. అయినా పరిశ్రమలు ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకొచ్చే సాహసం చేయలేకపోతున్నారు.
‘పరిశీలన’ తప్ప ప్రతిపాదనేది?
సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనల్లో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 99 శాతం ఆచరణలోకి రాలేదని, అంతా డొల్లేనని సాక్షాత్తూ అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల్లో చేసుకున్న ఒప్పందాలపై తదుపరి చర్యల కోసం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ఆయా కంపెనీల ప్రతినిధులతో ఈ–మెయిళ్ల ద్వారా సంప్రదింపులు జరుపుతోందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి విదేశీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి ఆర్థికాభివృద్ధి మండలి ఇప్పటిదాకా 870 మెయిళ్లను పంపించిందని, వాటిని 400 మంది చూసినప్పటికీ అందులో కేవలం 60 మందే స్పందించారని చెప్పారు. స్పందించిన 60 మంది కూడా ‘పరిశీలిస్తున్నాం’ అని సమాధానం చెబుతున్నారే తప్ప నిర్దిష్టంగా ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి.
చంద్రబాబు విదేశీ పర్యటనలు...
సింగపూర్ (నాలుగు సార్లు)
2014 నవంబర్ 11 నుంచి 14 వరకు సింగపూర్‌లో పర్యటించారు. సీఎంగా చంద్రబాబు తొలి విదేశీ పర్యటన ఇదే. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రూపొందిస్తుందని చెప్పారు. అనంతరం మరో మూడుసార్లు చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న 1,691 ఎకరాలను సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అప్పగించేలా ఆ పర్యటనల్లో ‘అవగాహన’ కుదుర్చుకున్నారు.
జరిగిందిదీ..
సింగపూర్ ప్రభుత్వం సుర్బానా అనే కంపెనీకి మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతను అప్పగించింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు చెల్లించింది.
ప్రపంచ ఆర్థిక సదస్సు (3 సార్లు)
2015 జనవరిలో దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. డ్వాక్రా ఉత్పత్తులకు వాల్‌మార్ట్ సొబగులు, కోనసీమ కొబ్బరి నీళ్లకు పెప్సికో హంగులు, విప్రో సాయంతో డిజిటల్ నగరంగా విశాఖ అంటూ ఊదరగొట్టారు. బిల్‌గేట్స్‌తో సమావేశమైన బాబు ఏపీకి మైక్రోసాఫ్ట్ సంస్థ వచ్చేస్తోందని ప్రకటించారు. 2016 జనవరిలోనూ ఈ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. రూ.2 వేల కోట్లతో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు, విశాఖపట్నం, రాజమండ్రిలో సౌరఫలకాల ఉత్పత్తి కేంద్రం, బంగారం రిఫైనరీ కేంద్రం ఏర్పాటుకు ఇండానీ గ్లోబల్ సంస్థ ఆసక్తి కనపరిచినట్లు ప్రకటించారు. 2017 జనవరిలోనూ దావోస్ సదస్సుకు సీఎం హాజరయ్యారు. ఏపీకి చమురు శుద్ధి కర్మాగారం వస్తోందని చెప్పారు.
ప్రస్తుత స్థితి: ఇప్పటికీ ఒక్క సంస్థా రాలేదు.
జపాన్ (రెండు సార్లు)
2014 నవంబర్ 25 నుంచి 29 వరకు జపాన్‌లో ముఖ్యమంత్రి పర్యటించారు. ఏపీలో టోక్యో, క్యోటో నగరాలను నిర్మి స్తామని జపాన్ కంపెనీలు ప్రకటించాయి. 15 పారిశ్రామిక కేం ద్రాలు ఏర్పాటు చేయడానికి భూములు కేటాయించామని చంద్రబాబు తెలిపారు. పలు ప్రైవేట్ కంపెనీలతో పెట్టుబడులకు సంబంధించి ఆరు కీలక ఒప్పందాలను చేసుకున్నారు.
ప్రస్తుత స్థితి
వీటిలో ఏవీ కార్యరూపం
దాల్చలేదు.
2015 జూలై 7 నుంచి 10 వరకు రెండోసారి జపాన్‌లో చంద్రబాబు పర్యటించారు. ఫ్యూజీ ఎలక్ట్రానిక్స్. జైకా, సుమితోమో, మిత్సుబి కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సాఫ్ట్‌బ్యాంకు ముందుకొచ్చిందని చెప్పారు. అమరావతిలో మిజుహో బ్యాంకు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లS్లడించారు. జపాన్‌కు చెందిన నేషనల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్నారు.
ప్రస్తుత స్థితి
10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్న సాఫ్ట్ బ్యాంకు కేవలం 350 మెగావాట్ల విద్యుత్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇంకా ఆ యూనిట్ ఉత్పత్తిలోకి రాలేదని అధికార
వర్గాలు పేర్కొన్నాయి.
బ్రిటన్
2016 మార్చి 10 నుంచి 14 వరకు ముఖ్యమంత్రి లండన్‌లో పర్యటించారు. 22 అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. లండన్ తరహాలో ఏపీలో ఫైనాన్షి యల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు లండన్‌లో అమరావతి కార్యాలయాన్ని నెలకొల్పుతామన్నారు. బ్రిటన్‌లోని అతిపెద్ద బోధనాసుపత్రుల్లో ఒకటైన కింగ్స్ కాలేజీ హాస్పిటల్ ఏపీ రాజధాని అమరావతిలో తక్షణమే 1,000 పడకల ఆసుపత్రిని నెలకొల్పేందుకు అంగీకరించిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 11 ఆసుపత్రులను ఏర్పాటు చేస్తుందన్నారు.
ప్రస్తుత స్థితి:
ఏవీ కార్యరూపం దాల్చలేదు.
చైనా
2016 జూన్ 26 నుంచి 29 వరకు చైనాలో పర్యటించారు. మొత్తం 29 ఎంఓయూలు చేసుకున్నారు. కృష్ణపట్నంలో రూ. 10,183 కోట్ల పెట్టుబడులతో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో రూ.43,120 కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో రూ.3,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు.
ప్రస్తుత స్థితి: ఈ ఒప్పందాల్లో
ఇప్పటిదాకా ఒక్కటి కూడా
ముందడుగు పడలేదు.
రష్యా
2016 జూలై 9 నుంచి 14 వరకు రష్యాలో పర్యటించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి రష్యా, కజికిస్తాన్‌తో రెండు ఎంఓయూలు చేసుకున్నారు.
ప్రస్తుత స్థితి: ఏవీ కార్యరూపం దాల్చలేదు.
అమెరికా
2017 మే 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో వేలాది ఉద్యోగావకాశాలు లభించే మూడు ఎంఓయూలు చేసుకున్నట్లు సీఎం కార్యాలయం పేర్కొంది. ఆపిల్ కంపెనీ సీఈఓతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏపీలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారని, అలాగే బెల్ హెలికాప్టర్ తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో నెలకొల్పాలని చంద్రబాబు కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అమెరికా పర్యటనలో ప్రవాసాంధ్రులతో పలు సమావేశాలను సీఎం నిర్వహించారు. 28 ఐటీ సంస్థలు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.