యువనేత భూముల కోసం నిర్మిస్తున్న రోడ్డు
నరసరావుపేటరూరల్: నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు వేళ్లే రోడ్లు అధ్వానంగా ఉంటే కేఎం అగ్రహారానికి మాత్రం కోట్లాది రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఉపాధి హామీ నిధులతో నియోజకవర్గంలోని శ్మశాన వాటికలను అభివృద్ధి జరుగుతుంటే కేఎం అగ్రహారానికి మాత్రం అధికార గ్రహణం పట్టింది. దీనికి కారణం టీడీపీ నేతకు చెందిన భూములు శ్మశాన వాటిక పక్కన ఉండటమే.
శ్మశాన అభివృద్ధి అటకెక్కింది
కేఎం అగ్రహారంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ శ్మశాన వాటికల పనులను కొంతకాలం క్రితం ప్రారంభించారు. దాదాపు 90 సెంట్లలో ఉన్న శ్మశాన వాటికలోని పిచ్చిమొక్కలను తొలగించారు. శ్మశాన వాటికలోకి వచ్చేందుకు డ్రెయిన్‌పై బ్రిడ్జి కూడా నిర్మించారు. చుట్టూ ప్రహరీ పిల్లర్లు వేశారు. ఆ పనులను గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ అర్ధంతరంగా నిలిపివేశారు. కొద్ది నెలలుగా ఈ పనులు ముందుకు కదలటం లేదు.
పనులకు టీడీపీ నేత బ్రేక్
గ్రామంలోని శ్మశాన వాటికల అభివృద్ధి పనులు నిలిచిపోవడానికి టీడీపీ నేత కారణమని తెలుస్తోంది. శ్మశానవాటిక పక్కనే అధికార పార్టీ నేతకు చెందిన సుమారు 40 ఎకరాల భూమి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేత ఈ భూములను కొనుగోలు చేశారు. శ్మశాన వాటిక అభివృద్ధి చేస్తే తన భూముల విలువకు నష్టం వస్తుందని భావించిన టీడీపీ నేత పనులను నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ పనులను ఆపేశాడు.
అధికార పార్టీ నేత భూముల కోసం రోడ్లు
టీడీపీ నేత కేఎం అగ్రహారంలో భూములు కొనుగోలు చేసిన తరువాత గ్రామానికి వచ్చే రోడ్లకు మహర్దశ పట్టింది. సాతులూరు నుంచి నకరికల్లు వరకు ఉన్న లింక్ రోడ్డును నకరికల్లు, నరసరావుపేట మండలంలోని పలు గ్రామాలకు కలుపుతూ ప్రధానిగా వాజ్‌పేయ్ ఉన్న కాలంలో నిర్మించారు. ఈ రోడ్డు విస్తరణ పనులకు 2016లో రూ.20 కోట్లతో చేపట్టారు. పమిడిపాడు మీదగా వెళ్లే ఈ రోడ్డును టీడీపీ నేత భూములు కొనుగోలు చేసిన కేఎం అగ్రహారానికి మళ్లించారు.
భూములు పక్కగా మరో రోడ్డు
టీడీపీ నేత భూములు పక్కన మరో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేఎం అగ్రహారం నుంచి ఇస్సప్పాలెం పంట పొలాల మధ్య నుంచి వెళ్లే డొంక రోడ్డును బీటీ రోడ్డుగా మార్చుతున్నారు. నాలుగు కి.మీ వరకు ఉండే ఈ రోడ్డు కోసం రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం కల్వర్టుల నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
సర్వత్రా విమర్శలు
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేత తన ఆర్థిక వనరులు పెంచుకునేందుకు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నారు. గోతులమయంగా మారిన రోడ్లతో తాము ఇబ్బందులు పడుతుంటే తన భూముల కోసం నూతనంగా రోడ్లు నిర్మించుకోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని శ్మశాన వాటికకు మోక్షం కలిగిందని నరసరావుపేట మండలం కేఎం అగ్రహారం గ్రామస్తులు సంబరపడ్డారు. ముళ్ల చెట్లు తొలగించి, బ్రిడ్జి నిర్మించి, పిల్లర్లు వేస్తే ఎన్నాళ్లకెళ్లాకని ఆనందించారు. వీరి సంబరం ఎక్కువ కాలం నిలవలేదు. చేస్తున్న పనులను అధికారులు అర్ధంతంగా ఆపేశారు. అనుమతులొచ్చినా.. నిధులున్నా పనులు ఎందుకు ఆపారా ? అని ఆరా తీస్తే.. టీడీపీ నేత భూములు శ్మశాన వాటిక పక్కన ఉండడమే కారణమని తెలిసి కంగుతిన్నారు. శ్మశానం అభివృద్ధి చెందితే భూముల ధరలు పడిపోతాయని ఇలా చేసినట్లు గుర్తించారు. ఇదే సమయంలో టీడీపీ నేత పొలాలకు వెళ్లేందుకు రోడ్లు నిర్మిస్తున్న అధికారుల తీరు చూసి ఇదెక్కడి న్యాయమంటూ మండి పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment