వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
జగన్ దీక్షకు సహకరించండి
వ్యాపార, వాణిజ్య సంఘ నేతల సమావేశంలో పిలుపు
పట్నంబజారు(గుంటూరు) రాజకీయాలకతీతంగా, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేపడుతున్న దీక్షకు అన్ని వర్గాలు సంపూర్ణ సంఘీభావం ప్రకటించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. గుంటూరు అరండల్‌పేటలోని వైన్ డీలర్స్ అసోసియేషన్ హాలులో మంగళవారం వర్తక, వాణిజ్య సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. సమావేశానికి వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కావాలంటే రాజ్యాంగాన్ని సవరించాలంటూ కేంద్ర, రాష్ట్ర పాలకులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే చాలని, సవరణ అవసరం లేదన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.
వ్యాపారులు మద్దతిస్తే విజయం తథ్యం
పార్టీ రాష్ట్ర నాయకుడు, జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వ్యాపార వర్గాలు మద్దతు ఇస్తే ఎంతటి పోరాటం అయినా విజయవంతం అయి తీరుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వ్యాపారస్తుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాలక పక్షంలో సరిగా స్పందన లేకపోవడం కారణంగానే హోదా అంశం నీరుగారిపోతోందన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాజధాని పేరిట జేబులు నింపుకునే కార్యక్రమాలు తప్ప ఒక్క ప్రజాహిత కార్యక్రమాన్నైనా చంద్రబాబు చేపట్టారా అని ప్రశ్నించారు. పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ ప్యాకేజీల పాట పాడుతున్న టీడీపీ నేతలు లబ్ధి చేకూరేది ఎవరికో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రాణాలు పణంగా పెట్టి...
నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన ప్రాణాలు పణంగా పెట్టి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారన్నారు. గుంటూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ కొత్తమాసు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా పోరులో పాల్గొనడం ద్వారా అందరూ జగన్‌కు అండగా నిలవాలన్నారు. సభాధ్యక్షత వహించిన ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ దీక్షకు వ్యాపార వర్గాలు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేసి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స, ఎమ్మెల్సీగా ఎన్నికైన ఉమ్మారెడ్డిలను ఆతుకూరి దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అప్పిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నేతల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం విజయసాయిరెడ్డి పార్టీ నేతలను సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎం.డి.నసీర్ అహ్మద్, పలు విభాగాల నేతలు కావటి, కర్నూమా, కిలారి రోశయ్య, నూనె ఉమామహేశ్వరరెడ్డి, ఆతుకూరి నాగేశ్వరరావు, పోలూరి వెంకటరెడ్డి, తిప్పారెడ్డి, పల్లపు రాఘవ, ఎలికా శ్రీకాంత్ యాదవ్, పానుగంటి చైతన్య, మేరువ నర్సిరెడ్డి, వ్యాపార సంఘ నేతలు గౌరీశంకర్, కాశీవిశ్వనాథ్, జుజ్జూరి కోటేశ్వరరావు, గజివల్లి పూర్ణచంద్రరావు, ప్రకాశరావు, వెంకటనారాయణ, ఉమామహేశ్వరరావు, దేవరశెట్టి చిన్ని, వెచ్చా కృష్ణమూర్తి, జి.పూర్ణచంద్రరావు, ఎ.నగేష్, మురళీకృష్ణ, చింతా కృష్ణారావు, తూనుగుంట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కలసి నడుద్దాం...
Published Wed, Oct 7 2015 1:25 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement