వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డి
అమలాపురం టౌన్/మామిడికుదురు: ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి సమకూరే ప్రయోజనాలతోనే నేటి విద్యార్థులకు బంగారు భవిత ఉంటుందని.. వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వృద్ధి చెందుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధనపై విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకే పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జిల్లాల వారీగా ‘యువభేరి’ సదస్సులు నిర్వహిస్తున్నారని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బుధవారం పార్టీ నిర్వహించే యువభేరిని విజయవంతం చేసే క్రమంలో ఆయన మంగళవారం జిల్లావ్యాప్తంగా పర్యటించారు. యువభేరి విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. అమలాపురంలో పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి నివాసంలో యువభేరి ఏర్పాట్లపై చిట్టబ్బాయి, మరో సీజీసీ సభ్యుడు పినిపే విశ్వరూప్ తదితరులతో భేటీ అయ్యారు. అనంతరం విజయసాయిరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. గతంలో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీజేపీలు రాష్ట్రాన్ని దారుణంగా విడదీసి చారిత్రాత్మక తప్పిదం చేశాయన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ కూడా ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవడంలో విఫలమవుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయకుండా స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం మడమ తిప్పని పోరాటాలు చేస్తున్నారని గుర్తు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నిరాహార దీక్ష.. గుంటూరులో నిరవధిక దీక్ష చేశారన్నారు. ఇప్పుడు విద్యార్థులను, యువతను ప్రత్యేకహోదా పోరులో భాగస్వాములను చేస్తూ జిల్లాల వారీగా యువభేరి సదస్సులు నిర్వహిస్తున్నారని చెప్పారు. 13 జిల్లాల్లో వరుసగా యువభేరిలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. కాకినాడలో జరిగే యువభేరికి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, యువత, నిరుద్యోగులు తరలిరావాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.
క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు నివాసం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల కమిటీల నియామకం అనంతరం సభ్యత్వాల నమోదుపై దృష్టిసారిస్తామన్నారు. 13 జిల్లాల్లో 670 మండలాలుండగా ఇంతవరకూ 80 శాతం మండల కమిటీల నియామకం పూర్తి చేశామన్నారు. మరో రెండు నెలల్లో మిగిలిన కమిటీల నియామకం కూడా పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రత్యేక హోదాతోనే బంగారు భవిత
Published Wed, Jan 27 2016 3:36 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement