అనంతపురం ఎడ్యుకేషన్ : అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 600 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ పాఠశాలమొత్తానికి ఉన్న మూత్రశాలలు ఐదు మాత్రమే. ఇంటర్వెల్ సమయంలో విద్యార్థులందరూ వాటినే ఉపయోగించుకోవాలి. దీంతో అక్కడ పెద్ద క్యూ ఉంటుంది. ఇంటర్వెల్ సమయం ముగిసి బెల్ కొడితే.. విద్యార్థులు మూత్రవిసర్జన చేయకుండానే తరగతి గదుల వైపు పరుగులు తీస్తుంటారు.
ఈ ఒక్క పాఠశాలలోనే కాదు... అనంతపురం నగరంతో పాటు రాయదుర్గం, గుంతకల్లు, హిందూపురం, తాడిపత్రి, ధర్మవరం, కదిరి తదితర ప్రాంతాల్లోని అత్యధిక కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇదే పరిస్థితి.
ప్రైవేటు/కార్పొరేట్ పాఠశాలల్లో ఎల్‌కేజీకే వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే.. వాటిలో కనీస వసతులు మాత్రం కల్పించడం లేదు. ఎంతమంది పిల్లలను చేర్పించాం...ఎంత మొత్తంలో ఫీజులు వచ్చాయనే ధోరణి తప్ప పిల్లల బాగోగులను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. చాలా విద్యాసంస్థలను ఇరుకు భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంది. కమలానగర్‌లో ఉన్న ఓ కార్పొరేట్ కళాశాల, టవర్‌క్లాక్, ఆర్టీసీ బస్టాండు సమీపంలోని రెండు కార్పొరేట్ పాఠశాలలు, కొత్తూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ ఇరుకైన భవనాల్లో నిర్వహిస్తుండటంతో పాటు విద్యార్థుల సంఖ్యకు సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. ఐదారు వందల మంది విద్యార్థులు చదువుతున్న చోట 3-8 మూత్రశాలలు మాత్రమే ఉంటున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ముఖ్యంగా అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అబ్బాయిలైతే బయట ప్రదేశాలకు వెళుతున్నారు. చాలామంది పిల్లలు... స్కూళ్లలో ఎదుర్కొంటున్న వ్యక్తిగత ఇబ్బందులను ఇళ్లలో చెబుతున్నారు. ‘ఆ స్కూల్ లోనైతేనే పిల్లలు బాగా చదువుకుంటార’నే ఒకే ఒక్క నమ్మకంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించలేకపోతున్నారు. గట్టిగా మాట్లాడితే తమ పిల్లలను ఎక్కడ స్కూల్‌కు వద్దంటారనే ఆందోళన వారిలో నెలకొంది. చాలా కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో కనీస వసతులు లేవనే విషయం విద్యాశాఖాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం దాదాపు ఏ ఒక్క పాఠశాల నడుచుకోవడం లేదంటే అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. కొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలను ప్రశ్నించే పరిస్థితుల్లో అధికారులు కూడా లేరు.
ప్రతి పాఠశాలను పరిశీలిస్తాం
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ఉండాలి. ముఖ్యంగా పిల్లలు ఇబ్బందులు పడకుండా సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉండాలి. ప్రతి పాఠశాలను పరిశీలిస్తాం. విద్యార్థులకు సౌకర్యాలు లేకపోతే నోటీసులు జారీ చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- మధుసూదన్‌రావు, డీఈఓ
కార్పొరేట్ మాయాలోకం!
Published Mon, Jun 16 2014 2:27 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement