ఆటాడుకోవడాల్లేవ్!
అనంతపురం ఎడ్యుకేషన్ : నేటి బాలలే రేపటి పౌరులు. పిల్లలు బాగా చదువుకోవాలంటే ముందుగా ఆరోగ్యం బాగుండాలి. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. ఇందుకోసం ప్రతి ఉన్నత పాఠశాలలోనూ 6-10 తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం ‘వ్యాయామ విద్య’ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు రోజూ వివిధ క్రీడలపై శిక్షణ ఇవ్వాలి. దానివల్ల వారి ఆరోగ్యం బాగుండటమే కాకుండా చదువులోనూ రాణిస్తారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. వ్యాయామ విద్య ఆచరణలో మాత్రం మిథ్యగా మారింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం, సహకారం లేకపోవడమే ఇందుకు కారణం.
వేధిస్తున్న నిధుల కొరత
వ్యాయామ విద్యలో భాగంగా క్రీడా పరికరాల కొనుగోలుకు పైసా నిధులు కేటాయించడం లేదు. గతంలో ఆరో తరగతి విద్యార్థుల నుంచి రూ.10, ఏడో తరగతి నుంచి రూ.11, ఎనిమిదో తరగతి రూ.12, తొమ్మిదో తరగతి రూ.13, పదో తరగతి విద్యార్థుల నుంచి రూ.15 చొప్పున వ సూలు చేసి ఆయా పాఠశాలల యాజమాన్యాలే క్రీడా పరికరాలు కొనుగోలు చేసేవి.
ప్రస్తుతం విద్యాహక్కు చట్టం రావడంతో ఎనిమిదో తరగతి వరకు ఎలాంటి ఫీజులూ వసూలు చేయడం లేదు. కేవలం 9, 10 తరగతుల విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న మొత్తం ఎందుకూ అక్కరకురావడం లేదని, దీంతో మెటీరియల్ కొనడమే మానేశామని పీఈటీలు చెబుతున్నారు. ఆసక్తి ఉన్న కొందరు పీఈటీలు మాత్రం దాతల సహకారంతో తమ పాఠశాలల పిల్లలకు వ్యాయామ విద్య నేర్పుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో వారిని వివిధ స్పోర్ట్స్ మీట్లకు తీసుకెళ్తున్నారు. రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం) ద్వారా పాఠశాలల అభివృద్ధి పేరుతో లైబ్రరీ, సైన్స్‌ల్యాబ్‌లు తదితర వాటికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. వ్యాయామ విద్యకు మాత్రం పైసా విదిల్చడం లేదు.
కన్పించని డ్రిల్
దాదాపు ఏ పాఠశాలలోనూ డ్రిల్ తరగతులు కనిపించడం లేదు. స్పోర్ట్స్ మెటీరియల్ లేకపోవడంతో ఖర్చు లేని ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ లాంటి క్రీడలను మాత్రమే ఆడిస్తున్నారు. ఇవి కూడా కొన్ని పాఠశాలల్లోనే కన్పిస్తున్నాయి. ఖర్చుతో కూడుకున్న క్రికెట్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, సాఫ్ట్‌బాల్ లాంటి క్రీడల జోలికి వెళ్లడం లేదు. చాలా పాఠశాలల్లో పీఈటీలు ఖాళీగా కూర్చుంటున్నారు. ఉదయం పాఠశాలకు రాగానే విద్యార్థులతో ప్రార్థన చేయించడం.. ఆవరణలోని చిత్తు పేపర్లను ఏరివేయించడం.. అటెండరు రాకపోతే బడిగంట కొట్టించడం.. ఏదైనా సబ్జెక్టుకు ఉపాధ్యాయుడు రాకపోతే ఆ తరగతిలో కూర్చోవడం... ఇదీ పీఈటీలు చేస్తున్న పని.
పీఈటీలకు శిక్షణ ఏదీ?
పీఈటీలకు శిక్షణ తరగతులు అసలే ఉండటం లేదు. మిగిలిన అన్ని సబ్జెక్టులకు సంబంధించి బోధనపై తరచూ శిక్షణ ఇచ్చే ప్రభుత్వం పీఈటీలకు వచ్చేసరికి ఆ ఊసేలేదు. దీంతో ఏళ్లనాటి ప్రమాణాలనే నేటికీ పాటిస్తున్నారు. దీనికితోడు తల్లిదండ్రులు, పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయుల నుంచి వ్యాయామ విద్యకు సహకారం కొరవడింది. చదువులో పోటీ విపరీతంగా పెరిగిపోవడం, పిల్లలకు ఆరోగ్యం కంటే ఉత్తీర్ణత ముఖ్యమనే ధోరణి ఎక్కువవడంతో వ్యాయామ విద్య రోజురోజుకూ దూరమవుతోంది.
కన్పించని మైదానాలు
జిల్లాలో 118 పాఠశాలలకు మైదానాలులేవు. అనంతపురం నగరంతో పాటు, మునిసిపాలిటీల్లోని పాఠశాలలకు కూడా మైదానాలు లేవంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమాత్రం ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో మొత్తం 388 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 106 పాఠశాలలకు మైదానాలు లేవు. అలాగే 29 మునిసిపల్ స్కూళ్లకు గాను 11 స్కూళ్లకు మైదానాలు లేవు. గుత్తి, రాయదుర్గంలోని ఎయిడెడ్ పాఠశాలలదీ ఇదే పరిస్థితి.