అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ‘ఐరన్’ మాత్రలు వేసుకున్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడం అనంతపురంలో కలకలం రేపింది. మోతాదు(డోస్) ఎక్కువ ఉన్న మాత్రలను సరఫరా చేయడం.. వాటిని వేసుకునే ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడంలో నిర్లక్ష్యం వల్ల 76 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలు కావాల్సి వచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సర్వజనాస్పత్రి దద్దరిల్లింది.
‘సార్ నాకు కళ్లు తిరుగుతున్నాయి.. కడుపు నొప్పిస్తోంది’ అంటూ విద్యార్థులు పడుతున్న బాధ అందరినీ కలచివేసింది. జవహర్ బాల ఆరోగ్య రక్ష కార్యక్రమంలో భాగంగా నగరంలోని పంతులకాలనీ ప్రాథమికోన్నత పాఠశాల, చంద్రబాబునాయుడు కొట్టాలలోని ప్రాథమిక పాఠశాలతోపాటు ఎస్‌ఎస్‌బీఎన్ ఉన్నత పాఠశాలలో రక్తహీనతతో బాధపడే చిన్నారులకు ఫెర్రాస్ అండ్ సల్ఫేట్ ఫోలిక్ యాసిడ్ (ఐరన్) మాత్రలను ఉపాధ్యాయులు పంపిణీ చేశారు.
ఉపాధ్యాయుల సూచన మేరకు మధ్యాహ్నం భోజనం చేసిన అరగంట తర్వాత విద్యార్థులు మాత్రలు మింగారు. ఆ తర్వాత అరగంట వ్యవధిలోనే విద్యార్థులు తల తిరగడం, వాంతులు కావడం, కడుపునొప్పితో విలవిలలాడారు. కొందరు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో బెంబేలెత్తిన ఉపాధ్యాయులు విద్యార్థులను అంబులెన్‌స, ఆటోల్లో సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే చిన్న పిల్లల వార్డు పేషెంట్లతో నిండిపోయింది. ఒక్కసారిగా 76 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై రావడంతో వారికి పడకల కొరత ఏర్పడింది. దీంతో ఆ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ మల్లీశ్వరి, డ్యూటీ డాక్టర్ హేమలత పిల్లలను చిన్నపిల్లల వార్డులోని మరో యూనిట్ కు మార్చారు. బెడ్లు తక్కువగా ఉండటంతో ఒక్కో దానిపై ముగ్గురిని పడుకోబెట్టి చికిత్స చేశారు. మరికొంత మందిని పీఐసీయూ వార్డులోకి షిఫ్ట్ చేశారు. ఒక స్టాండ్‌తోనే నలుగురు చిన్నారులకు సెలైన్ ఎక్కించాల్సి వచ్చింది. రాత్రికి కోలుకున్న 30 మంది విద్యార్థులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ గాయిత్రి, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ వైవీ రావు, ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.
వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యమే..
ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఐరన్ మాత్రలు పంపిణీ చేయడం వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమక్షంలో మాత్రలు వేయాలి. ఐదో తరగతి లోపు పిల్లలకు 45 ఎంజీ, ఆరో తరగతి పైన పిల్లలకు 100 ఎంజీ మోతాదు గల మాత్రలు పంపిణీ చేశామని జవహర్ బాల ఆరోగ్యరక్ష జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ విజయమ్మ పేర్కొన్నారు. పిల్లలు మింగిన మాత్రల స్ట్రిప్‌ను పరిశీలించగా.. 335 ఎంజీ అని ఉంది. ఆరోగ్య సిబ్బంది ఉదయం వచ్చి మాత్రలు ఇచ్చి వెళ్లిపోయారని ఎస్‌ఎస్‌బీఎన్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు ఒకరు చెప్పారు. అన్నం తిన్న తర్వాత మాత్రలు వేసుకున్న 30 మంది అస్వస్థతకు గురి కావడంతో అంబులెన్‌సలో ఆస్పత్రికి తీసుకొచ్చామన్నారు.
ఒక్క పూట వార్డు కేటాయించలేరా?
వార్డంతా పిల్లలతో నిండిపోయింది.. కేసులు అధిక సంఖ్యలో వస్తున్నాయి.. పోస్టు నేటల్ వార్డు ఒక్క పూట ఇవ్వండని సూపరింటెండెంట్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావును చిన్నపిల్లల వార్డు హెచ్‌ఓడీ డాక్టర్ మల్లేశ్వరి అడిగారు. అందులో గర్భిణులు ఉన్నారని, కావాలంటే స్వైన్‌ఫ్లూ వార్డుకు మార్చుకోండి అని సూపరింటెండెంట్ తెలిపారు. ఆ వార్డు చాలా దూరంలో ఉందని, డ్యూటీ డాక్టర్ ఒక్కరే ఉన్నారని, అంత దూరం ఎలా వెళ్లేది అంటూ హెచ్‌ఓడీ అన్నారు. ఎటువంటి వసతులు లేని స్వైన్‌ఫ్లూ వార్డులో ఏ విధంగా వైద్యం చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
టూటౌన్ పోలీసుల దురుసు ప్రవర్తన
అస్వస్థతకు గురైన పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులపై టూటౌన్ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వారిని వార్డులోకి వెళ్లకుండా అడ్డుకుని, పక్కకు లాగి పడేశారు. మొదట అందరూ బయటకెళ్లండంటూ హూంకరించారు. వార్డులో పిల్లల కన్నా పోలీసులే అధిక సంఖ్యలో ఉన్నారని. తమను మాత్రం ఎందుకు బయటకు పంపుతున్నారని తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. పిల్లలను చూడాలనే తాపత్రయంతో లోనికి దూసుకొచ్చిన తల్లిదండ్రులపై లాఠీలతో వెనక్కు నెట్టారు. సీఐ మన్సూరుద్దీన్, ఎస్‌ఐ రెడ్డప్ప సమక్షంలోనే ఇలా జరిగినా వారు జోక్యం చేసుకోలేదు.
ప్రముఖుల పరామర్శ
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను అదనపు జేసీ వెంకటేశం, తహశీల్దార్ లక్ష్మినారాయణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి, సీపీఎం నగర కార్యదర్శి రాంభూపాల్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పరామర్శించారు.
పాపం.. పిల్లోళ్లు..
Published Fri, Jan 24 2014 2:38 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement