ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : సార్లు జరభద్రం.. అవినీతికి పాల్పడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. ఒకవేళ బాధితుడు మిమ్మల్ని ఏసీబీకి పట్టించాడనుకోండి అంతే సంగతులు. పట్టుబడ్డ చోటు నుంచి మీరు వెళ్లేది చెరసాలకే. బెయిల్ దొరికితేనే మళ్లీ బయటకు వచ్చేది. అయితే పరిస్థితులు ఇది వరకటిలా లేవు. నెలరోజులకు పైబడి బెయిల్ గగనమై జైలు గోడలను చూస్తూ ఆ కూడు రుచికి మరగాల్సిందే.
నెల రోజులు జైలులో ఉండాల్సిందే..
నవంబర్ 25న బెల్లంపల్లిలో రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ గురువయ్య, నవంబర్ 26న రూ.4 వేలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన ఆదిలాబాద్ సబ్‌రిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులు మురళికృష్ణ, సాయివివేక్, శ్రీనివాస్‌లు 15 రోజులు పైబడిన ఇంకా బయటకు రాలేదు. హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో ఉన్న వారికి ఏసీబీ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. మళ్లీ బెయిల్ కోసం వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది మొదటి కేసు కాసిపేట తహశీల్దార్ అల్గునూరి రోశయ్యకు 30 రోజులకు, ఫిబ్రవరిలో పట్టుబడ్డ వాంకిడి సీఐ లచ్చన్నకు 45 రోజులకు, మార్చిలో చిక్కిన ఏపీ ఖాదీబోర్డు డిప్యూటి డెరైక్టర్ రాయప్పకు నెల రోజులకు బెయిల్ లభించింది. ఇలా చూస్తే ఏసీబీ కేసుల్లో నెల రోజులు పైబడిన తర్వాత బెయిల్ వచ్చే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. సాధారణంగా జడ్జీలు కేసు తీవ్రత, అధికారి హోదా తదితర విషయాలను పరిశీలన చే సి బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది.
మారిన మార్గదర్శకాలు
1993 వరకు ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారులకు తక్షణమే బెయిల్ మంజూరయ్యేది. ఆ తర్వాత హైకోర్టు ఈ విషయంలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని నేరాల మాదిరిగానే అవినీతి కేసులను కూడా క్రైంగా పరిగణించాలని దీనికి కూడా 3 నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఉన్నందున తక్షణమే బెయిల్ ఇవ్వరాదని స్పష్టం చేసింది. కిందిస్థాయి ఉద్యోగులకు ఆదర్శంగా నిలవాల్సిన జిల్లా అధికారి అవినీతికి పాల్పడితే మిగతా ఉద్యోగులపై కూడా ప్రభావం చూపుతుందని, ఓ సీనియర్ అధికారై ఉండి బాధ్యతగా మెలగాల్సింది పోయి దాన్ని విస్మరించి అడ్డదారులు తొక్కడం వంటి అంశాలు బెయిల్ మంజూరు పరంగా న్యాయమూర్తులు పరిగణలోకి తీసుకుంటారని పేర్కొంటున్నారు. అదే సమయంలో అవినీతికి పాల్పడి పట్టుబడ్డ ఉద్యోగికి తక్షణం బెయిల్ వచ్చిన పక్షంలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ వాదనను వినిపిస్తుంది. ఒక ఉద్యోగి పట్టుబడిన తర్వాత కేసు పూర్వపరాలు, ప్రాసిక్యుషన్ తర్వాత చార్జీషీటు దాఖలు చేయడం జరుగుతుంది. విచారణ అనంతరం అవినీతి నేరం రుజువైన పక్షంలో శిక్ష పడుతుంది. అంతకుముందు జరిగే ఈ తతంగంలోనూ అధికారులు జైలు ఊచలను లెక్కించక తప్పదు.
అవినీతి అధికారులు జరభద్రం!
Published Sat, Dec 14 2013 6:37 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement