నేడు డీసీఎంఎస్ చైర్మన్ ఎన్నిక | dcms Chairman elections are today | Sakshi
Sakshi News home page

నేడు డీసీఎంఎస్ చైర్మన్ ఎన్నిక

Published Sat, Aug 31 2013 1:11 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

dcms Chairman elections are today

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) చైర్మన్ ఎవరో శనివారం తేలనుంది. అత్తాపూర్ కార్యాలయంలో జరిగే ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక జరుగనుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నామినేషన్ల  స్వీకరణ, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య పోలింగ్ జరుగనుంది. ఇదివరకే గెలుపొందిన పది మంది డెరైక్టర్లు ఓటు హక్కును వినియోగించుకోన్నారు. ఆర్నెళ్ల క్రితం దాఖలైన ఒక నామినేషన్‌ను చివరి నిమిషంలో విత్‌డ్రా చేసుకోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముఖ్యంగా అధికారపార్టీలో పెనుదుమారం రేపిన సహకార ఎన్నికలు మాజీ మంత్రి సబిత, ప్రస్తుత మంత్రి ప్రసాద్‌కుమార్‌కు సవాల్‌గా మారాయి. గతంలోను ఇరువురు తమ ప్యానెళ్లను గెలిపించుకునేందుకు సర్వశక్తులొడ్డారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పీఠాలను తమవర్గాలకు ఇప్పించుకోవాలనే పట్టుదలతో ఇరువురు పోటీపడ్డారు. డీసీసీబీ అధ్యక్ష పదవిని తన అనుచరుడు లక్ష్మారెడ్డికి దక్కడంలో కృతకృత్యురాలయిన సబిత.. డీసీఎంఎస్‌ను తమ మద్దతుదారుడికే కట్టబెట్టేలా చక్రం తిప్పారు.
 
 రెండు పదవులు వైరివర్గం కైవసం చేసుకోవడాన్ని మింగుడుపడని ప్రసాద్.. తన అనుయాయుడు దారాసింగ్ అభ్యర్థిత్వానికే ఓటేయాలని పట్టుబట్టారు. అయితే, అప్పటికే డీసీఎంఎస్ చైర్మన్ పదవికి శ్రవణ్‌కుమార్ నామినేషన్ వేయడం.. మెజార్టీ డెరైక్టర్లు ఆయన పక్షానే నిలవడంతో సబిత కూడా వారికే అండగా నిలిచారు. దీంతో తీవ్ర అసంతృప్తికిలోనైన ప్రసాద్ సామాజిక న్యాయాన్ని తెరమీదకు తెచ్చారు. తన మద్దతుదారుకు గాకుండా... సబిత మరొకరిని తెరమీదకు తేవడం ద్వారా ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశాన్ని పీసీసీ చీఫ్ బొత్స, సీఎం కిరణ్ ముందు పంచాయితీ పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం పెద్దలు.. శ్రవణ్‌కుమార్ చేత నామినేషన్ ఉపసంహరింపజేయాలని సూచించారు. సీఎం, పీసీసీ సూచనలతో వెనక్కి తగ్గడమేగాకుండాశ్రవన్‌తో నామినేషన్ విత్‌డ్రా చేయించారు. దాఖలైన ఒక నామినేషన్ కూడా విత్ డ్రా చేసుకోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో శనివారం డీసీఎంఎస్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి.
 
 అదే పట్టు..!
 సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ప్రసాద్, సబిత మాత్రం తమ పంతం నెగ్గించుకునేందుకు వ్యూహరచన చేశారు. శ్రవణ్‌కుమార్‌ను గెలిపించుకునేందుకు అవసరమైన డెరైక్టర్లను సబిత కూడగట్టారు. వారం రోజులుగా తీర్థయాత్రలు తిరిగొచ్చిన డెరైక్టర్లు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. మరోవైపు గతంలో తాను ప్రతిపాదించిన దారాసింగ్‌కు డీసీఎంఎస్ చైర్మన్‌గిరి కట్టబెట్టేందుకు ప్రసాద్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మెజార్జీ సభ్యులు శ్రవణ్ గూటిలో ఉన్నప్పటికీ, అధిష్టానం ద్వారా సబితపై ఒత్తిడి పెంచేందుకు పావులు కదుపుతున్నారు. అందులోభాగంగా అవసరమైతే మరోసారి ఎన్నిక లు వాయిదాపడేలా చేసేందుకు మంత్రి వ్యూహం రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement