క్రీడాభివృద్ధికి పెద్దపీట | developing the sports | Sakshi
Sakshi News home page

క్రీడాభివృద్ధికి పెద్దపీట

Published Sun, Nov 30 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

క్రీడాభివృద్ధికి పెద్దపీట

క్రీడాభివృద్ధికి పెద్దపీట

గ్రామ స్థాయి నుంచి శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా క్రీడలు అభివృద్ధి చెందాలంటే జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో) పాత్ర కీలకం. జిల్లాలో డీఎస్‌డీవోగా మూడేళ్ల క్రితం బాధ్యతలు స్వీకరించిన ప్రత్తిపాటి రామకృష్ణ అందరితో కలిసి క్రీడాభివృద్ధికి కృషిచేస్తున్నారని పేరుపొందారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి మరింత కృషి చేయాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొంటున్న క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, కోచ్‌లు, ఇతర అఫిషియల్స్ అభిప్రాయాలు, అనుభవాలు తెలుసుకునేందుకు శనివారం ఆయన ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా మారారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని.. ప్రాధాన్యత క్రమంలో వాటిని అమలుచేయడం ద్వారా జిల్లాలో క్రీడాభివృద్ధికి  పాటుపడతానని చెప్పారు.
 
 డీఎస్‌డీవో : మీరు ఎక్కడ నుంచి వచ్చారు.. ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి?
 
క్రీడాకారిణులు : చాలా బాగున్నాయండి. ట్రాక్, స్టేడియం బాగున్నాయి. ఈ స్థాయి పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పలు రాష్ట్రాల క్రీడాకారుల శక్తి సామర్థ్యాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. భోజనాలు, వసతి బాగున్నాయి.
 
డీఎస్‌డీవో : ఏ జిల్లా నుంచి వచ్చావమ్మా.. పతకాలు సాధించావా.. మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది?

 
ఆర్.కుసుమ : మా సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం. హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ స్టేడియం చాలా బాగుంది. జంపింగ్ పిట్‌లు బాగున్నాయి. సింథటిక్ ట్రాక్ కూడా ఉంటే బాగుంటుంది సార్. మా నాన్నగారు లేరు. అమ్మ నన్ను చాలా ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు రాష్ట్రానికి మెడల్ సాధించాను. చాలా సంతోషపడుతుంది. జాతీయ స్థాయిలో పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం అమ్మాయి మెడల్ సాధించిందని పేపర్‌లో వేస్తారు. మా ఊరు, జిల్లా వాళ్లంతా సంతోషిస్తారు.
 
డీఎస్‌డీవో : నీ పేరు ఏమిటమ్మా.. ఎక్కడి నుంచి వచ్చావు.. పోటీలు ఎలా ఉన్నాయి?
 
హారిక : సార్ నా పేరు హారిక. నేను 100 మీటర్ల రన్నింగ్ చేస్తాను. మట్టి ట్రాక్ బాగుంది. సింథటిక్ ట్రాక్ ఉంటే మరింత బాగుండేది. ప్రస్తుతం రాష్ట్ర స్ప్రింటర్లం 6 నుంచి 8వ స్థానంలో ఉన్నాం. అదే సింథటిక్ ట్రాక్ వేస్తే మొదటి మూడు స్థానాల్లో నిలుస్తాం సార్.
 
డీ ఎస్‌డీవో : కోచ్‌లుగా మీరు పడుతున్న కష్టాలేంటి?
 
శాప్ కోచ్ వంశీధర్ : ప్రభుత్వం కోచ్‌లకు సముచిత గౌరవం ఇవ్వాలి. రాష్ట్రంలో కోచ్‌లు లేరు. చాలా తక్కువ మంది ఉన్నారు. జిల్లాకు ఇద్దరు కోచ్‌లు ఉండాలి. విజయవాడ రాజధాని కాబట్టి నలుగురు కన్నా ఎక్కువ ఉన్నా మంచిదే. ఉన్న కోచ్‌లను పర్మినెంట్ చేయలేదు. టార్గెట్ పెట్టి ఇచ్చే ఫలితాలను బట్టి గ్రేడింగ్ ప్రకారం కోచ్‌లకు వేతనాలు ఇవ్వాలి. మంచి జీతాలు ఇచ్చి కోచ్‌లను కూడా ప్రోత్సహించాలి.  అప్పుడే కొత్త రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం ట్రాక్ బాగుంది. చాలా తక్కువ సమయంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంచి ఫాస్ట్ ట్రాక్ తయారు చేశారు. దీనితోనే సరిపెట్టుకుంటే కుదరదు. భవిష్యత్తులో దీనిమీదే ప్రాక్టీస్ చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీకి తట్టుకోలేం. సింథటిక్ ట్రాక్ తప్పనిసరి.
 
డీఎస్‌డీవో : మీరు పోటీలను చాలా ఆసక్తిగా చూస్తున్నట్లు ఉన్నారు... మరి మీ పిల్లల్ని కూడా ఆటల్లో చేర్పిస్తారా?


జె.అంజనేయులు, వాణి దంపతులు : ఆటలంటే ఎవరికైనా ఇష్టమే కదండీ!. ఈ స్థాయి పోటీలను టీవీలో చూస్తాం.  ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. చాలా బాగుంది. మా పిల్లలు చాలా చిన్నవారు. ఆటల్లో తప్పకుండా చేర్పిస్తాం. ఆటలాడితే ఆరోగ్యంగా ఉంటారు. రాణిస్తే మాకు, ఊరికి, రాష్ట్రానికి పేరొస్తుందని ఇక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతోంది.
 
డీఎస్‌డీవో : ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు.. మీ సమస్యలేంటి?


 భారతి : ఇంత పెద్ద పోటీల్లో పనిచేయడం సంతోషంగా ఉంది. ఇబ్బందులు ఏమీ లేవు.

పనికి తగ్గట్టుగా జీతాలు ఇస్తే మరింత బాగుంటుంది సార్?
 
వెంకటేశ్వర్లు : పనిచేస్తూనే జాతీయ స్థాయి పోటీలు చూస్తున్నాం. నగర వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా చూస్తున్నారు. నగర ఖ్యాతి పెరుగుతోంది. జాతీయ స్థాయి పోటీలు కాబట్టి ఆ స్థాయిలో పనిచేయాల్సి ఉంది. కాకపోతే జీతాలు నెలనెలా ఇస్తే మా జీవితాలు బాగుంటాయి సార్.
 
డీఎస్‌డీవో : ఏ రాష్ట్రం నుంచి వచ్చారు.. ఇక్కడ వసతులు, స్టేడియం ఎలా ఉన్నాయి?
 
గౌతమ్ గుప్తా : యూపీ నుంచి వచ్చాం. స్టేడియం బాగుంది. సింథటిక్ ట్రాక్ ఉంటే మరింత బాగుంటుంది. ఉండడానికి వసతి అంతగా బాగుండలేదు. భోజనం చాలా బాగుంది.
 డీఎస్‌డీవో : శాయ్ కోచ్‌గా మీరు చెప్పండి. స్టేడియం ఎలా ఉంది. క్రీడాకారులకు ఏమి కావాలి. స్పోర్‌‌ట్స కోటా ఎంత ఉండాలి.

క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి?.
 
డీవీవీ వినాయక ప్రసాద్ :  కలెక్టర్, కమిషనర్, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సహకారంతో ఉన్నంతలో మంచి ట్రాక్ ఏర్పడింది. విభజన విషయంలో క్రీడాకారులు సంతోషపడ్డారు. కానీ మౌలిక సదుపాయాలన్నీ తెలంగాణకే వెళ్లిపోయాయి. ఒక్క క్రీడా సామగ్రి లేదు. రాష్ట్రంలో కోచ్‌లు లేరు. అథ్లెట్లకు మౌలిక సదుపాయాలు లేవు. సింథటిక్ ట్రాక్‌లు లేవు. కేరళలో 11, కర్ణాటకలో 11, తమిళనాడులో 20 సింథటిక్ ట్రాక్‌లు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఒక్కటీ లేదు. రాష్ట్రం నలువైపులా సింథటిక్ ట్రాక్‌లు, పల్లెపల్లెకు క్రీడా మైదానాలు కావాలి. శాయ్ హాస్టల్స్ లేవు. కోచింగ్ అకాడమీలు లేవు. వాటిని వెంటనే ఏర్పాటుచేయాలి. జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తేనే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వస్తాయి. మన వద్ద జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు లేక అధికారులు పక్క రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. 100 బెడ్‌లు ఉన్న స్పోర్ట్స్ హాస్టల్స్ ఉండాలి. అప్పుడే క్రీడలు మరింత అభివృద్ధి చెందుతాయి.
 
ప్రెజెంటర్ : ఆలూరి రాజకుమార్,
విజయవాడ స్పోర్ట్స్
ఫొటోలు :  వీర భగవాన్ తెలగరెడ్డి,
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
 
 అందరి సహకారం ఉంటే వేగంగా క్రీడాభివృద్ధి

 ‘ఖోఖో, కబడ్డీ ఆటగాడిగా, కోచ్‌గా క్రీడాకారుల సమస్యలపై నాకు అనుభవం ఉంది. క్రీడాకారులకు ఏమి కావాలి. కోచ్‌లకు ఏరకమైన వాతావరణం కల్పించాలి. నూతన రాష్ట్రం, అందులోనూ రాజధాని కావడంతో బాధ్యతలు మరింత పెరిగాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇందిరాగాంధీ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. స్పోర్ట్స్ అకాడమీలు, హాస్టల్స్ ఏర్పాటుచేయాల్సి ఉంది. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సెక్టార్ నుంచి కూడా సహకారం అందితే క్రీడాభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.’                                                                         

- డీఎస్‌డీవో ప్రత్తిపాటి రామకృష్ణ
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement