రెండు రోజులు వరుసగా కురిసిన వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. సీజన్ ఆరంభంలోనే విస్తారంగా వర్షాలు కురవడంతో కోటి ఆశలతో పత్తి, మొక్కజొన్న సాగు చేపట్టిన రైతులను మళ్లీ ఇప్పుడు వర్షాలు దెబ్బతీశాయి. చేన్లలో పత్తి కాత దశలో ఉండగా వర్షాలతో నీళ్లు చేరి ఎండురోగం ప్రబలుతోంది.
పూత రాలుతోంది. కాయలు మురిగిపోతుండగా ఇప్పటికే పగిలిన పత్తి బురదపాలైంది. మొక్కజొన్నలను అమ్ముకునేందుకు జమ్మికుంట వచ్చిన రైతులకు బుధ, గురువారాల్లో వర్షాలతో పంట కళ్లెదుటే కొట్టుకుపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చేదంటూ బోరుమన్నారు.
జమ్మికుంట, న్యూస్‌లైన్ : జిల్లాలోనే పెద్ద వ్యవసాయ మార్కెటది. ఆదాయం కూడా ఘనంగానే ఉంటుంది. నిత్యం లక్షల్లో కొనుగోళ్లు. అయినా సరిపడా వసతులుండవు. వర్షం పడితే రైతుల పంట ఉత్పత్తులన్నీ నీళ్లపాలు కావాల్సిందే. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో సదుపాయాలు కరువయ్యాయి. రైతులు పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకువచ్చినందుకు నరకం చూడాల్సి వస్తోంది.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మక్కలన్నీ తడిసిపోగా వాటిని ఎండబెట్టేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. తడిసిన మక్కలను ఆరబోస్తూ... మబ్బులను చూసి మళ్లీ కుప్పగా పోస్తూ కుటుంబమంతా ఇక్కడే ఉంటున్నారు. డబ్బులు ఇస్తామంటున్నా కూలీలు ఎవరూ రావడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధ, గురువారాల్లో మార్కెట్‌కు 2 వేల క్వింటాళ్ల మక్కలు వచ్చాయి. తేమశాతం అధికంగా ఉందని వ్యాపారులు సూచించడంతో రైతులు యార్డులో ఎండబెట్టగా రెండు రోజులు కురిసిన వర్షం వారిని కుదేలు చేసింది. మార్కెట్లో మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.1400 పలుకుతుండగా... ఇదే అదనుగా వ్యాపారులు దోచుకునే ప్రయత్నం మొదలెట్టారు. తడిసిన మక్కలను క్వింటాల్‌కు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తామంటూ చెబుతున్నారు. ఎంతో కష్టపడి పంట పండించి అమ్ముకునే సమయంలో నోటికాడ ముద్ద లాక్కున్నట్లుగా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మక్కలను అవసరమైతే మట్టిపాలు చేస్తామని, వ్యాపారులకు మాత్రం మద్దతు ధరకు తక్కువకు అమ్మే ప్రసక్తే లేదని ఓ రైతు మండిపడ్డాడు. నాణ్యమైన సరుకులు తీసుకొచ్చినా తేమ పేరుతో సతాయిస్తున్నారని వాపోయారు. వర్షమొస్తే సరుకులు రక్షించుకునేందుకు కవర్లు లేవని, కొందరికి చినిగిన కవర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఇదేం మార్కెటని మండిపడ్డారు. మూడు రోజులుగా ఇక్కడే ఉన్నా పట్టించుకునే నాథుడే లేడని పేర్కొన్నారు.
మరో మూడు
రోజులు ఇక్కడే...
శుక్రవారం అమావాస్య కావడంతో మార్కెట్‌కు సెలవు. శని, ఆదివారాలు సాధరణ సెలవు రావడంతో రైతులు మరో మూడు రోజులు ఇక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ మూడు రోజుల నుంచి ఉంటుండగా మరో మూడు రోజుల్లో వర్షాలు పడితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తినడానికి రోజుకు రూ.200 వరకు ఖర్చవుతోందని, పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు వస్తే ఇవేం బాధలని ఆక్రోశం వెళ్లగక్కారు.
రైతన్న కష్టం వర్షార్పణం
Published Sat, Oct 5 2013 4:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM
Advertisement
Advertisement