విలాసాల కోసమే చోరీ | Due to the theft of luxury | Sakshi
Sakshi News home page

విలాసాల కోసమే చోరీ

Published Mon, Sep 8 2014 1:33 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Due to the theft of luxury

  • గుడివాడలో సీఎంఎస్ నగదు అపహరణ కేసును ఛేదించిన పోలీసులు
  •  నలుగురు నిందితుల అరెస్ట్
  • గుడివాడ అర్బన్ : పట్టణంలో గతనెలలో జరిగిన రూ.11 లక్షల నగదు అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులు మహ్మద్ ఉమర్ అలియాస్ ఉమర్‌ఖాన్(సీఎంఎస్ గార్డు, ఉయ్యూ రు), మహ్మద్ నయీం అలియాస్ చోటు బాబు(ఉయ్యూరు), కడారి శివవరప్రసాద్(భవానీపురం, విజయవాడ), షేక్ చాంద్‌బాషా(పాత రాజరాజేశ్వరిపేట, విజయవాడ)లను డీఎస్పీ జి.నాగన్న నేతృత్వంలో వన్‌టౌన్ ఎస్‌హెవో ఎ.బి.జె.తిలక్, ఎస్సై రాము, సీసీఎస్ ఏఎస్సై స్వామిదాసు ఆదివారం అరెస్ట్ చేశారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగన్న ఈ వివరాలు వెల్లడించారు.  విలాసాల కోస మే ఈ నలుగురూ చోరీకి పాల్పడ్డారన్నారు.

    ఆయన తెలిపిన సమాచారం ప్రకారం..

    పట్టణంలో యాక్సిస్ బ్యాంకులో కస్టోడియన్ గా పనిచేస్తున్న లక్కరాజు రాంప్రసాద్ గతనెల 21న బ్యాంకు నుంచి రూ.17 లక్షల నగదును ఏటీఎంల లో డిపాజిట్ చేసేందుకు సీఎంఎస్ వాహనంలో తీసుకెళ్లాడు. బంటుమిల్లి రోడ్డులోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో రూ.6 లక్షలు డిపాజిట్ చేశాడు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా సీంఎఎస్ వాహనంతో రాజేంద్రనగర్‌లోని తన ఇంటికి నగదుతో చేరుకున్నాడు. మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో భోజనం చేసి టీవీ చూస్తున్నాడు.

    అదే సమయంలో సీఎంఎస్ వాహనం సెక్యురిటీ గార్డు మహ్మద్ ఉమర్‌కు బావమరిది అయిన మహ్మద్ నయీం వచ్చి, ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. బ్యాచిలర్స్‌కు ఇల్లు ఇవ్వమని రాంప్రసాద్ బదులిచ్చాడు. నయీం  తనతో తెచ్చుకున్న కారం పొట్లాం తీసి రాంప్రసాద్ ముఖంపై చల్లి పక్కనే ఉన్న నగదు బ్యాగును పట్టుకుని పారిపోయాడు. అప్పటికే బయట బైక్‌పై సిద్ధంగా ఉన్న కడారి శివ వరప్రసాద్‌తో కలిసి గన్నవరం వైపు పరారయ్యాడు.
     
    మూడు నెలలుగా పథకం
     
    కస్టోడియన్ రాంప్రసాద్ మూడు నెలల నుంచి తన ఇంటికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు తీసుకెళ్తున్నాడు. ఈ విషయాన్ని సీఎంఎస్ వాహనం లో గార్డుగా పనిచేస్తున్న మహ్మద్ ఉమర్ కనిపెట్టా డు. తన బావమరిది మహ్మద్ నయీంకు ఈ విషయాన్ని వివరించాడు. నగదు అపహరిస్తే బాగా బతకవచ్చని నమ్మించాడు. దీంతో నయీం తన స్నేహితులైన కడారి శివవరప్రసాద్,  చాన్‌బాషాలకు విష యం తెలిపి తనతో కలుపుకున్నాడు.

    ఈ ఘటనకు ముందు మూడు నెలల నుంచి మహ్మద్ నయీం పట్టణంలోని యాక్సిస్ బ్యాంకు వద్ద సైకిల్ షాపును నిర్వహిస్తూ రాంప్రసాద్ కదలికలను ఎప్పటికప్పు డు గమనిస్తున్నాడు. దొంగతనం ఘటనకు మూడు రోజుల ముందు నుంచి ఇల్లు అద్దెకు కావాలంటూ నయీం, శివవరప్రసాద్‌లు రాంప్రసాద్ ఇంటికి వ చ్చి వెళ్తున్నారు. గతనెల 21న మరోసారి వచ్చారు. నయీం అతడి ఇంట్లోకి వెళ్లి పరిస్థితి అనుకూలంగా ఉండటంతో కళ్లలో కారం చల్లి రూ.11 లక్షల నగదు దొంగిలించాడు.
     
    రెండు ద్విచక్ర వాహనాలతో సిద్ధంగా..
     
    ముఠా సభ్యులు ముందుగా రూపొందించుకు న్న పథకం ప్రకారం రాంప్రసాద్ ఇంటివద్ద ద్విచక్రవాహనంతో శివవరప్రసాద్ సిద్ధంగా ఉన్నాడు. చాన్‌బాషా నెహ్రూ చౌక్ వైపు మరో ద్విచక్రవాహనంతో సిద్ధంగా ఉన్నాడు. నయీం నగదు బ్యాగ్‌ను దొంగిలించి బయటకు వచ్చి శివవరప్రసాద్ బైక్ ఎక్కాడు. ఇద్దరూ గన్నవరం వైపు పారిపోయారు.
     
    ప్రధాన నిందితుడు ఉమర్..
     
    ఉయ్యూరుకు చెందిన మహ్మద్ ఉమర్ మూడు నెలల క్రితం సీఎంఎస్ వాహనానికి గార్డుగా ఉద్యోగంలో చేరాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. వేరే పనిచేయలేక తన బావమరిది నయీంను దొంగతనానికి ఉసిగొలిపాడు. రాంప్రసాద్ కదలికలను నయీంకు ఫోన్ ద్వారా ఉమర్ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ దొంగతనం చేయడానికి సహకరించాడని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందన్నారు. దీనిపై ముమ్మరంగా దర్యాప్తు జరిపి, నిందితులను పట్టుకున్నామని ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి 10,46,800 రూపాయల నగదు, మూడు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు, రిఫ్రిజేటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
     
    సిబ్బందికి అభినందనలు
     
    ఈ కేసులో మొదటి నుండి చాకచక్యంగా ఉంటూ నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన వన్‌టౌన్ సీఐ తిలక్, ఎస్సై రాము, సీసీఎస్ ఏఎస్సై ఎస్.స్వామిదాసు, హెడ్ కానిస్టేబుళ్లు కె.బలరాం, వి.వెంకట్రావు, ఆకుల శ్రీను, రాంబాబు, కానిస్టేబుళ్లు కొ లు సు శ్రీనివాసరావు, బాబూరావు, జి.శ్రీనివాసరావులను డీఎస్పీ నాగన్న అభినందించారు. త్వరలో వీరికి రివార్డులు అందజేస్తామని పేర్కొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement