నిజామాబాద్ రూరల్, న్యూస్‌లైన్ :
కారుకు సారథి దొరికారు. మూ డు నెలలకుపైగా ఖాళీగా ఉన్న జిల్లా అధ్యక్షుడి స్థానంలో ఈగ గంగారెడ్డిని నియమిస్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆ ర్ ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు పార్టీ జిల్లా అధ్యక్షుడి గా పనిచేసిన ఆలూరు గంగారెడ్డి మూడు నెలల క్రితం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. నిజామాబాద్ మండలంలోని బోర్గాం(పి) గ్రామానికి చెందిన ఈగ గంగారెడ్డి గతంలో టీడీపీ నాయకుడిగా పనిచేశారు. ఆ పార్టీ తరపున 1987లో బోర్గాం(పి) ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచి ఎంపీపీ అయ్యారు. 2002లో టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తెలంగాణ కోసం చేపట్టిన ఆందోళనల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆయన ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన అనంతరం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. అందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. అన్ని మండలాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తానని, కార్యకర్తల్లో ఐక్యత కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై విశ్వాసంతో పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయానికి 12 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలని, వ్యవసాయ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హర్షం : పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈగ గంగారెడ్డి నియామకం కావడంపై టీఆర్‌ఎస్ అర్బన్ నియోజకవర్గ ఇన్‌చార్జి బస్వ లక్ష్మీనర్సయ్య హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ ఈగ గంగారెడ్డికి కేసీఆర్ కీలక బాధ్యత అప్పగించారని పేర్కొన్నారు.
‘కారు’ డ్రైవర్‌గా ఈగ
Published Mon, Nov 18 2013 7:07 AM | Last Updated on Thu, Jul 11 2019 5:38 PM
Advertisement