సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో మూడేళ్లకుపైగా పనిచేస్తోన్న సీఐలను సరిహద్దులు దాటించాలని ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులతో పోలీసు అధికారులకు బదిలీల జ్వరం పట్టుకుంది. ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమాల మేరకు 31 మంది సీఐలను జిల్లా సరిహద్దులు దాటించడానికి పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. పనిలో పనిగా ఒకే ప్రాంతంలో వేళ్లూనుకుపోయిన 45 మంది ఎస్సైలకూ స్థాన చలనం కల్పించాలని నిర్ణయించారు.
కొత్త ఎస్పీ విధుల్లో చేరిన రెండు మూడు రోజుల్లోగానే బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయని పోలీసువర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే.. లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. ప్రాథమిక నిబంధనల అమలుకు అప్పుడే శ్రీకారం చుట్టింది. ఆ క్రమంలోనే జిల్లాలో మూడేళ్లకుపైగా పని చేస్తోన్న సీఐలను సరిహద్దులు దాటించాలని ఆదేశించింది. ఒకే ప్రాంతంలో వేళ్లూనుకుపోయిన ఎస్సైలను సైతం బదిలీ చేయాలని సూచించింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో అనంతపురం, కర్నూలు రేంజ్ డీఐజీలతో రాయలసీమ ఐజీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ జిల్లాల్లో మూడేళ్లకుపైగా పనిచేస్తోన్న సీఐలు.. ఒకే ప్రాంతంలో వేళ్లూనుకుపోయిన ఎస్సైల జాబితా తయారు చేయాలని ఆదేశించారు. ఆ మేరకు అనంతపురం జిల్లాలో 31 మంది సీఐలు మూడేళ్లకుపైగా పనిచేస్తున్నట్లు డీఐజీ బాలకృష్ణ గుర్తించారు. ఒకే నియోజకవర్గంలోని మండలాల్లో ఏళ్లుగా పనిచేస్తున్న ఎస్సైలు 45 మంది ఉన్నట్లు అంచనా వేశారు. ఈ జాబితాను రాయలసీమ ఐజీకి డీఐజీ బాలకృష్ణ అందించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వీరందరినీ బదిలీ చేయాలని రాయలసీమ ఐజీ ఆదేశించారు. జిల్లా ఎస్పీగా నియమితులైన ఎం.రమేష్‌రెడ్డి ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. జిల్లాలో బాధ్యతలు స్వీకరించడానికి ఆయన ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించేలా ఆయనపై ఒత్తిడి తేవడంగానీ.. మరొకరిని నియమించడంగానీ సర్కారు చేయడం లేదు.
కొత్త ఎస్పీ విధుల్లోకి చేరగానే.. ఆయన అభిప్రాయం కూడా స్వీకరించి, బదిలీల ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇదే అదునుగా తీసుకున్న మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో తమ చెప్పుచేతల్లో పనిచేసే వారినే తమ నియోజకవర్గాల్లో నియమించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మంత్రుల సిపార్సు లేఖలతో వివిధ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లు కూడా పోలీసు ఉన్నతాధికారులను కలుస్తూ ఒత్తిడి తెస్తున్నారు.