విద్యారంగంలో కార్పొరేట్ విజృంభిస్తున్న కాలమిది. ఫలితాల్లో వాటితో పోటీపడాల్సిన తరుణమిది. భావిభారత విద్యా వేత్తలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనది. దేశానికి మేధావులను అందించాల్సిన కనీస ధర్మం మనది. కానీ మౌలిక వసతుల్లోనే వెనుకబడుతున్నాం. సనాతన విధానాల్లోనే బోధనసాగిస్తున్నాం. అవసరమైన మేరకు నిధులు వెచ్చించలేకపోతున్నాం. పిల్లలను తీర్చిదిద్దే విధానంలోనే విఫలమవుతన్నాం. నేలవిడిచి సాము చేయమంటున్నాం. ఇలా అయితే ఎలా...
వీరఘట్టం : సర్కారు పాఠశాలల్లో సైన్సు విద్యకు గడ్డురోజులు దాపురించాయి. ఆసక్తి ఉండే విద్యార్థులకు కనీసం ప్రయోగాలు నేర్పే అవకాశమూ లేకపోతోంది. ప్రయోగశాలలో రసాయనాలు, పరికరాలు బీరువాలకే పరిమితమవుతున్నాయి. మూసధోరణిలో పిల్లలు చదువులు పూర్తి చేస్తున్నారు. మరోవైపు సైన్సు బోధించే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ఇతర ఉపాధ్యాయులతోనే ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్నారు. నైపుణ్యాలకు పాతరేస్తున్నారు.
జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, రెసిడెన్షియల్, ఎయిడెడ్, పురపాలక, కస్తూర్బాగాంధీ వంటి 470 ఉన్నత పాఠశాలల్లో 1,50,528 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో పదోతరగతి చదువుతున్నవారు 25,254 మంది. సగానికి పైగా పాఠశాలలకు ప్రయోగశాలలు లేవు. కొన్నింటిలో ఉన్నా.. పరికరాలు, రసాయనాలు, ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అధిక మార్కులు సాధించి ఇంటర్‌లో సైన్సు గ్రూపులు తీసుకొని చదవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు నిరాశే ఎదురవుతోంది.
నిధులున్నా ప్రయోజనం అంతంతే
జిల్లాలోని 424 ఉన్నత పాఠశాలలకు సైన్సు పరికరాలు, రసాయనాల కోసం ఒక్కో పాఠశాలకు 2013-14 విద్యాసంవత్సరంలో రూ.50 వేలు, 2014-15 విద్యా సంవత్సరంలో రూ.45 వేలు వచ్చినట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. 382 పాఠశాలలకు సంబంధించిన సైన్సు పరికరాల కింద ఒక్కో పాఠశాలకు రూ.లక్ష మంజూరు చే శారు. అయితే పలు పాఠశాలల్లో నేటికీ పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రయోగశాలల్లో ప్రదర్శన బల్లలు, అలమరాలు లేవు. అప్‌గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలల్లో కూడా ప్రయోగ బోధన అంతంత మాత్రమే. 1970, 1995లో మాత్రం ప్రభుత్వం పరికరాలు, రసాయనాలను అందించి ఆ తర్వాత విస్మరించింది.
నామమాత్రంగా వైజ్ఞానిక ప్రదర్శనలు
విద్యార్థుల్లో శాస్త్రీయ, సాంకేతిక దృక్పథాన్ని పెంపొందించేందుకు జిల్లా విద్య వైజ్ఞానిక ప్రదర్శనలు, జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్ తదితర వాటిని నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్నారు. ఏటా ఇన్ స్ఫైర్ కింద సైన్సు ఎగ్జిబిట్స్ కోసం ప్రభుత్వం రూ.5వేల నుంచి రూ.10 వేలు వరకు ఇస్తోంది. విద్యార్థులు రూపొందించిన నమూనాలను సైన్సుఫేర్‌లో ప్రదర్శించాలి.చాలా పాఠశాలలు తక్కువ ఖర్చుతో చేయించి మొక్కుబడిగా చేతులు దులుపుకుంటున్నాయి. ఎక్కువ శాతం నమూనాలు రాష్ట్ర, జాతీయ స్థాయికి వెళ్ళలేకపోతున్నాయి.
ప్రయోగ బోధనేది....
సామాన్య శాస్త్రంలో జీవ, రసాయన, భౌతిక శాస్త్రాలు ఉన్నాయి. వీటిలో భౌతిక, రసాయన శాస్త్రాలను కలిపి భౌతికరసాయన శాస్త్రంగా. జీవశాస్త్రంగా పేర్కొంటారు.ప్రస్తుతం మారిన పాఠ్యాంశాలను సమగ్ర మూల్యాంకన పద్ధతిలో బోధించాలి. అంటే మొదట ప్రయోగం ద్వారా వివరించి తద్వారా బోధన చేయాలి. జిల్లాలో చాలా పాఠశాలల్లో సైన్సు ఉపాధ్యాయుల కొరత ఉంది. రెండు శాస్త్రాల్లోనూ పాఠాలే తప్పా ప్రయోగపరంగా బోధించేది కొంతమంది మాత్రమే. ఉపాధ్యాయులు ప్రయోగాలు చేసి చూపడం లేదనే విమర్శలు లేకపోలేదు.
క్షేత్రపర్యటనలకు కాలం చెల్లింది
క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రత్యక్ష అనుభూతిని పొందడంతో పాటు పరిశీలనా నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. సామాన్యశాస్త్రానికి సంబంధించి క్షేత్రస్థాయి పర్యటనల ఊసే లేకుండా పోయింది. వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు పండిస్తున్న పంటలు, ఉత్పత్తులు, పెట్టుబడులు, దిగుబడులు తంపర సేద్యం పద్ధతి తదితర వాటిని చూసి వాటి అనుభూతిని పొందడానికి ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులను ఎక్కడికీ తీసుకువెళ్ళ కుండా గది నాలుగు గోడల మధ్య బోధనకే పరిమితం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి వద్ద సాక్షి ప్రస్తావించగా సీసీఈ విధానంలోనే పాఠ్యాంశాల బోధన చేపడుతున్నామని అన్నారు. ప్రయోగశాలలు లేని పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు.
ప్రయోగమేదీ?
Published Tue, Aug 4 2015 3:25 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement