ఏలూరు సెంట్రల్ (పశ్చిమగోదావరి) : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సినీ హీరోలు పవన్‌కల్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య జరిగిన ఫ్లెక్సీల రగడ సమసిపోకముందే శనివారం ఏలూరులో బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ అభిమానుల మధ్య ఫ్లెక్సీల ధ్వంసం కలకలం రేపింది. పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు నాలుగు రోజుల క్రితం ఏలూరు సీఆర్ రెడ్డి డిగ్రీ కాలేజీ గేటు ఎదురుగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు శుక్రవారం రాత్రి ఈ ఫ్లెక్సీ పక్కనే భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కాగా శనివారం ఉదయానికి పవన్‌కల్యాణ్ ఫ్లెక్సీ పూర్తిగా చించివేసి ఉండగా, పక్కనే ఉన్న బాలకృష్ణ ఫ్లెక్సీ స్వల్పంగా ధ్వంసమైంది.
దీంతో విషయం తెలుసుకున్న అభిమాన సంఘాల నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయా హీరోలకు మద్దతుగా నినాదాలు చేశారు. ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ఇరు హీరోల అభిమాన సంఘాలతో మాట్లాడి ఎటువంటి గొడవల జోలికి పోవద్దని సూచించారు. ముందుజాగ్రత్తగా కాలేజీ వద్ద త్రీటౌన్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా మూడురోజుల క్రితం భీమవరంలో పవన్‌కల్యాణ్ ఫ్లెక్సీ ధ్వంసం నేపథ్యంలో ఆయన అభిమానులు ప్రభాస్ సామాజికవర్గానికి చెందిన వారి ఇళ్లపై దాడులు చేయడం వంటి వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికీ భీమవరంలో 144 సెక్షన్ అమల్లో ఉంది.
ఫ్లెక్సీల రగడ : భీమవరం టూ ఏలూరు
Published Sun, Sep 6 2015 7:58 AM | Last Updated on Tue, Oct 2 2018 7:32 PM
Advertisement
Advertisement