సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
మనుబోలు: రుణమాఫీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తూ గందరగోళం సృష్టిస్తుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మనుబోలు మండల పరిషత్ కార్యాలయం విశ్రాంత మందిరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి షరతులూ పెట్టకుండా రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేశారన్నారు. ఇప్పుడేమో కుటుంబానికి రూ.ఒకటిన్నర లక్ష అని, రీషెడ్యూల్ అని, కమిటీలని ఇలా రోజుకోరకంగా మాట్లాడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నా ఇంత వరకూ రుణమాఫీపై ఎవరికీ స్పష్టత లేదన్నారు.
ఓవైపు రూ.ఒకటిన్నర లక్ష వరకూ రుణాలు మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు రుణాలిచ్చిన బ్యాంకులు రైతులకు వెంటనే చెల్లించాలంటూ నోటీసులు ఇస్తున్నాయన్నారు. మండలంలోని వీరంపల్లికి చెందిన ఎద్దలపూడి ఏడుకొండలు అనే రైతుకు ఇలాగే అతను తీసుకున్న రూ.72 వేల రుణాన్ని వడ్డీతో సహా రెండు వారాల్లో చెల్లించాలని, లేకుంటే బంగారం వేలం వేస్తామంటూ ఎస్‌బీఐ ఇచ్చిన నోటీసును విలేకరులకు చూపించారు.
ఇలాంటి విషయాలను వ్యవసాయమంత్రి దృష్టికి తీసుకెళితే ప్రస్తుతానికి రుణం చెల్లించండి, తరువాత తిరిగి ఇస్తామంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా రుణమాఫీపై బ్యాంకుల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అజయ్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, శేషురెడ్డి, ధనుంజయరెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీపై రైతుల్లో ఆందోళన
Published Tue, Aug 5 2014 4:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement