జెడ్పీ సీఈఓ కైలాష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చైర్మన్ ఈదర హరిబాబు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు, సీఈఓ కైలాష్ మధ్య వివాదం ముదిరిపోయింది. అదికాస్తా బుధవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రసాభాసగా మారింది. ఇద్దరూ నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ సవాళ్లు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలకు దిగారు. నిన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తానంటూ చైర్మన్ హెచ్చరించారు. ఓటింగ్ పెట్టి చేతనైంది చేసుకోమంటూ సీఈఓ ఎదురుదాడికి దిగారు. వేదికపై పక్కపక్కనే కూర్చున్న ఇద్దరి గొడవ తీవ్రస్థాయికి చేరడంతో సభ్యులు సైతం రెండు వర్గాలుగా విడిపోయి ఆందోళనకు దిగగా జెడ్పీ సమావేశం రచ్చరచ్చగా మారింది.
జెడ్పీ సీఈఓ కైలాష్‌కి వేదికపై కూర్చునే అర్హత లేదని, వెళ్లి కింద గ్యాలరీలో కూర్చోవాలని జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ఆదిలోనే సీఈఓకు అడ్డుతగిలారు. నేను వేదిక మీద కూర్చోకూడదన్న నిబంధనలేమీ లేవంటూ చైర్మన్ మాటలను తోసిపుచ్చిన సీఈఓ.. వేదికపై చైర్మన్ పక్కనే కూర్చున్నారు. దీంతో వారిద్దరి మధ్య వేదికపై ఎవరు కూర్చోవాలన్న అంశంపై వాగ్వివాదం చోటుచేసుకుంది. ఒక దశలో పనోడు యజమాని వద్ద కాకుండా కింద కూర్చోవాలంటూ సీఈఓను ఉద్దేశించి జెడ్పీ చైర్మన్ పేర్కొన్నారు. పనోడు యజమానిని ధిక్కరిస్తే తొలగించినట్లుగానే ఇక్కడ యాజమాన్యాన్ని ధిక్కరించిన సీఈఓను ప్రభుత్వానికి సరెండర్ చేస్తామంటూ సీఈఓపై తీవ్ర స్థాయిలో హరిబాబు ధ్వజమెత్తారు.
ఇద్దరి గొడవ తీవ్రస్థాయికి చేరడంతో జోక్యం చేసుకున్న ఎంపీపీ వీరయ్యతో పాటు మరికొందరు సభ్యులు ఆరోపణలు పక్కనపెట్టి అజెండాకు వెళ్లాలంటూ అటు సీఈఓ, జెడ్పీ చైర్మన్లను కోరారు. దీంతో జెడ్పీ చైర్మన్ తొలిపలుకులు మొదలుపెడుతూ తిరిగి సీఈఓపై ఆరోపణలకు దిగారు. దీంతో సమావేశానికి వచ్చిన జెడ్పీ వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ అజెండా కాకుండా వ్యక్తిగత ఆరోపణలు ఏమిటంటూ చైర్మన్‌తో గొడవకు దిగారు. నాకు అడ్డుతగిలేందుకు నువ్వెవరంటూ చైర్మన్ ఎదురుదాడికి దిగారు. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన సభ్యులు నూకసాని బాలాజీపై కూడా ఎదురుదాడికి దిగారు. ఆ తర్వాత కొందరు సభ్యుల జోక్యంతో సమావేశం ప్రారంభమైంది. ప్రారంభంలోనే మద్దిపాడు ఎంపీపీ నారా విజయలక్ష్మి మాట్లాడుతూ మండలంలో ఎంపీడీఓ జనరల్‌బాడీ సమావేశాలను తనను పిలవకుండానే నిర్వహిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ రుణాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాల ఎంపికను కూడా అదే తరహాలో చేస్తున్నారని మండిపడ్డారు.
ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ధ్వజమెత్తారు. ఆమెకు నాగులుప్పలపాడు ఎంపీపీ వీరయ్యతో పాటు జరుగుమల్లి ఎంపీపీ పద్మావతి, పలువురు సభ్యులు మద్దతు పలికారు. సీఈఓ తీరును తప్పుబట్టారు. కామేపల్లి పాఠశాలకు పేరు పెట్టేందుకు సంబంధించి పాఠశాలకు తొలుత స్థలమిచ్చిన దాతలకు తెలియకుండా కొత్త వారికి అవకాశమివ్వకూడదంటూ జెడ్పీ చేసిన తీర్మానం కాపీని ఇవ్వాలని అడిగినా.. సీఈఓ ఇవ్వలేదని జరుగుమల్లి ఎంపీపీ పద్మావతి ఆరోపించారు. తీర్మానం కాపీలు ఇచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఫ్రైజ్‌ఫిక్స్ చేయకపోవడం వల్లే తీర్మానం కాపీలు ఇవ్వలేకపోయామని సీఈఓ చెప్పడంతో.. అందరూ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే సమయంలో సభ్యులు అడిగిన వివరాలకు సంబంధించి తాను 20 సార్లు మెసేజ్‌లు పెట్టినా సీఈఓ స్పందించడం లేదంటూ ఏకంగా జెడ్పీ చైర్మన్ ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా సభ్యులందరూ సీఈఓ తీరును తప్పుబడుతూ పోడియంను ముట్టడించారు. సీఈఓను చుట్టుముట్టారు. పోడియం వద్దే ఆందోళన చేపట్టారు. సభ్యుల ఆరోపణలు విన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్.. సీఈఓ కైలాష్ గిరీశ్వర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనాధికారిగా కాకుండా ప్రజాప్రతినిధులపై పెత్తనం చేయాలన్న ఆలోచన సరికాదని ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. ఎంతో మంది సీనియర్ సభ్యులున్న జిల్లా పరిషత్‌ను ఇష్టానుసారంగా నడిపించాలని చూడటం సరికాదని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఇదే సమయంలో కొందరు సభ్యులు సీఈఓకు మద్దతుగా నిలిచినప్పటికీ మౌనంగానే ఉండిపోయారు.
చైర్మన్, సీఈఓలు సర్దుకుపోవాలని, పరస్పర ఆరోపణలు కట్టిపెట్టి సభను సజావుగా నడిపించాలని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చైర్మన్ సీఈఓ గొడవ నేపథ్యంలో మధ్యాహ్నం వరకు జెడ్పీ సమావేశం రచ్చరచ్చగానే సాగింది. ఈ గొడవల మధ్య ప్రత్యేక హోదా తీర్మానంతో పాటు ట్రిపుల్ ఐటీకి వెంటనే స్థలం చూసి భవనాలు నిర్మించాలని, జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్మించాలని ప్రవేశపెట్టిన తీర్మానాలను సభ్యులు ఆమోదించారు. సభ ప్రారంభం నుంచే జెడ్పీ చైర్మన్, సీఈఓ గొడవతో ఒక్క ప్రత్యేక హోదా అంశం తప్ప జిల్లాలోని వరుస కరువుల అంశంగానీ, కరువు రైతులకు పరిహారంగానీ, పశుగ్రాసం కొరత విషయంగానీ, తాగునీటి సమస్య, శనగలు, కందుల కొనుగోళ్లు లాంటి ప్రధాన సమస్యలు చర్చకు రాలేదు.
ఇదీ.. గొడవ నేపథ్యం...
జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు, సీఈఓ కైలాష్ గిరీశ్వర్‌ల మధ్య గొడవలు పతాకస్థాయికి చేరిన కారణంగానే బుధవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చగా మారింది. సమన్వయంతో పనిచేయాల్సిన వీరిద్దరి మధ్య పలు అంశాలకు సంబంధించి విభేదాలు తలెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని తాగునీటి సరఫరాకు సంబంధించిన 45 సీపీడబ్ల్యూఎస్ స్కీములకు మెయింటెనెన్స్ వర్క్‌లను ఒకే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాలని జెడ్పీ చైర్మన్ ప్రతిపాదించగా, విడివిడిగా కట్టబెట్టాలని సీఈఓ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
ఇక కారుణ్య నియామకాలకు సంబంధించి జెడ్పీ చైర్మన్ జోక్యంతో పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, చైర్మన్‌ను పక్కనపెట్టి సీఈఓ అన్నీ తానై నడిపించినట్లు ప్రచారం ఉంది. మరోవైపు తాగునీటి సరఫరా కోసం మీటర్లు ఏర్పాటు చేయాలని చైర్మన్ ప్రతిపాదించగా, ఏటా తాగునీటి సరఫరాకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తుండగా మీటర్ల ఏర్పాటుకు రూ.5 కోట్లు ఖర్చుపెట్టాల్సి వస్తోందంటూ సీఈఓ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్‌లో సభ్యుల అనుమతి మేరకు చైర్మన్ ఆధ్వర్యంలో తీర్మానాలు జరగడం ఆనవాయితీ. సీఈఓ పరిపాలన వ్యవహారాలను చూడాల్సి ఉంది. అయితే సీఈఓ మితిమీరిన జోక్యం చేసుకుని అన్ని పనులకు అడ్డు తగులుతున్నారని చైర్మన్‌తో పాటు పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి గొడవ నేపథ్యంలో బుధవారం సమావేశం రసాభాసగా మారింది.
చైర్మన్‌పై అవిశ్వాసానికి టీడీపీ ఎత్తుగడ...
జెడ్పీ చైర్మన్‌గా ఉన్న ఈదర హరిబాబును పదవి నుంచి దించేందుకు టీడీపీ వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. బుధవారం సర్వసభ్య సమావేశం నాటికే వ్యవహారం చక్కబెట్టాలని తొలుత జిల్లా టీడీపీ నేతలు భావించినా ప్రత్యేక హోదా ఉద్యమాలు, బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవడం నేపథ్యంలో ఆ వ్యవహారాల్లో తలమునకలుగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు జెడ్పీ చైర్మన్ అవిశ్వాస అంశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈదర హరి బాబు టీడీపీ సభ్యుడైన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ తర్వాత అధికార పార్టీ జెడ్పీ చైర్మన్‌పై సస్పెన్షన్ వేటు వేయడంతో చైర్మన్ పదవి కోల్పోయిన హరిబాబు కోర్టు ద్వారా తిరిగి పదవిని పొం దారు.
అప్పటి నుంచి హరిబాబుపై టీడీపీ అక్కసుతో ఉంది. అదును కోసం ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితులు చక్కబడితే హరిబాబును దించేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బుధవారం సర్వసభ్య సమావేశానికి హాజరైన అధికార పార్టీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డేవిడ్‌రాజుతో పాటు వైస్ చైర్మన్ నూకసాని బాలాజీలు చైర్మన్‌కు వ్యతిరేకంగానే సీఈఓను రెచ్చగొట్టడమే కాక కొందరు సభ్యులను సైతం సమాయత్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బాలాజీ ఏకంగా చైర్మన్‌పైనే ధ్వజ మెత్తడం తెలిసిందే. మొత్తంగా అవిశ్వాసం పెట్టి జెడ్పీ చైర్మన్‌ను పదవి నుంచి దింపేం దుకు టీడీపీ ఏకంగా పావులు కదుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment