ఒకటి నుంచి ‘స్వచ్ఛ’ పక్షోత్సవాలు
Published Wed, Sep 28 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
జిల్లాపరిషత్ :
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీవరకు స్వచ్ఛ పక్షోత్సవాలు నిర్వహించాలని జెడ్పీ సీఈవో మోహన్‌లాల్ సూచించారు. బుధవారం నగరంలోని సుభాష్‌నగర్‌లోగల జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో డీఎల్పీవోలు, ఈవో పీఆర్డీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ అన్ని గ్రామపంచాయతీల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అందుకు సరిపడా మెటీరియల్‌కు జీపీ నిధుల్లో నుంచి సమకూర్చుకోవాలన్నారు. బ్లీచింగ్ ఫౌడర్, సున్నం, ఫినాయిల్, ఆయిల్ బాల్స్ తదితర వాటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
వర్షాలు, వరదలతో అనేక ఇళ్లు కూలిపోయాయని జెడ్పీ సీఈవో పేర్కొన్నారు. బాధితులకు ప్రత్యామ్నాయం చూడాలన్నారు. పైప్‌లైన్ లీకేజీలను అరికట్టాలని, క్లోరినేషన్ చేసిన నీటినే ప్రజలకు సరఫరా చేయాలని సూచించారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడాలని, డ్రెయినేజీలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. వరదలు, వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో తీసుకున్న సహాయక చర్యలను వివరించారు. పంచాయతీలు, డివిజన్ కార్యాలయాలు, జిల్లా పంచాయతీ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అక్టోబర్ 3 నుంచి 10వ తేదీవరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి సూచించారు. సమావేశంలో డీఎల్పీవోలు రాములు, అనూక్, డీపీవో కార్యాలయ ఏవో మహ్మద్ గౌస్, ఈవో పీఆర్డీలు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement