హైదరాబాద్: పోలవరంపై శ్వేతపత్రం ప్రకటించాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు బుకాయించడం పలు అనుమానాలకు తావిస్తున‍్నదని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. పోలవరంపై హైకోర్టులో తాను దాఖలు చేసిన వ్యాజ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన సీఎంకు బుధవారం ఒక లేఖ రాశారు. పోలవరం నిధుల కోసం తరచూ నాగపూర్, ఢిల్లీకి పరుగులు మానుకుని ఈ విషయంలో విభజన చట్టం ప్రకారం కేంద్ర బాధ్యతలను వివరిస్తూ కేంద్రం వివక్ష వైఖరిని తెలియజేస్తూ ఉన్నత న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాలని సూచించారు. జాతీయ ప్రాజెక్టులు ఏవీ సకాలంలో పూర్తికావడంలేదనే సాకుతో కేంద్రం ఆంక్షలకు ఒప్పుకుంటూ జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణాన్ని మీ చేతుల్లోకి తీసుకుని అంచనాలను నచ్చిన రీతిలో పెంచుకుంటూ ప్రాజెక్టును గందరగోళ స్థితికి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై శ్వేతపత్రం అవసరమని రాష్ట్ర ప్రజానీకం భావిస్తున్నా అందుకు నిరాకరించడం తగదన్నారు. ఎలాంటి నిబంధనలు పెట్టకుండా ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరించేలా ఆదేశాలు ఇవ్వాలని తాను ఉమ్మడి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశానని రామచంద్రరావు గుర్తు చేశారు. దీన్ని విచారించిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలుకు నాలుగు వారాల సమయం ఇస్తూ విచారణను ఈనెల 19కు వాయిదా వేసినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయలేదని తెలుస్తోందన్నారు. కేంద్రం తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘిస్తుంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలిల్సిన మీరు కేంద్రం అడుగులకు మడుగులొత్తడం చూస్తుంటే మీ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కూడా వెనుకాడడంలేదని స్పష్టమవుతోందని చంద్రబాబుపై కేవీపీ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment