అసలే ఆధార్.. ఆపై ఆన్ లైన్ !
పేదోడి స్కాలర్‌షిప్, ట్యూషన్ ఫీజుకు ఎన్ని ఆంక్షలో?
లక్షల మంది విద్యార్థులకు ఇక్కట్లు
ఇకపై ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే
చిన్న పొరపాటుతో ఫీజులు గోవిందా!
అడుగడుగునా ఆంక్షల చట్రంలో బిగిస్తున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సురేష్ ఆధార్ నంబరు కోసం 2013 జూలైలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇంతవరకు ఆధార్ నంబరే జనరేట్ కాలేదు. ఇప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరంలో ఆధార్ నంబర్ లేక స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి నెలకొంది.
- విశాఖపట్టణానికి చెందిన అనిల్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు ఫారం సంబంధిత కాలేజీకే వెళ్లలేదు. కానీ వెబ్‌సైట్‌లో మాత్రం ఆ విద్యార్థి దరఖాస్తు కాలేజీ స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతోంది. కాలేజీ యాజమాన్యం తమ వద్ద పెండింగ్ లేదని చెబుతోంది.
ఇలాంటి కారణాలతో ఒక్కరిద్దరు కాదు లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ అందక తిప్పలు పడుతున్నారు. ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్నా రాని వారు, ఆధార్ దరఖాస్తు తిరస్కరణకు గురైనవారు, స్కాలర్‌షిప్ దరఖాస్తులు కాలేజీ స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతున్న విద్యార్థులంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రాష్ట్రంలో 100 శాతం ఆధార్ నమోదు కాలేదు. 85 శాతం మాత్రమే రిజిస్ట్రేషన్ అయినట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. అందులోనూ 15 శాతం మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ ఆన్‌లైన్‌లో చూపిస్తోంది.
ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియక , తెలిసినా పొరపాట్లను ఆన్‌లైన్‌లో సవరించుకునే అవకాశం లేక లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దూరమవుతున్నారు. యాజమాన్యాల ఒత్తిడితో సొంతంగా ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఆధార్ కష్టాలు ఇలా ఉంటే.. ఇకపై సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సహా అన్నీ అన్‌లైన్‌లోనే జరగాలంటూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆధార్ లింకుతో అనేక మంది విద్యార్థులు స్కాలర్‌షిప్, ట్యూషన్ ఫీజులకు దూరం కాగా.. ఈ కొత్త విధానంతో మరింత మంది నష్టపోయే పరిస్థితి నెలకొంది.
ఆన్‘లైన్’లోనే లక్షల దరఖాస్తులు..
గతేడాది డిసెంబరు 31 నాటికే స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్ ఫీజుల కోసం 28. 47 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య 29 లక్షలకు చేరుతుందని అంచనా. ఇప్పటివరకు 23.54 ల క్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలోనూ లక్షల మంది దరఖాస్తులు ఇంకా ఆన్‌లైన్ ‘ప్రాసెస్’ పేరుతో పెండింగ్‌లోనే ఉండిపోయాయి.
పరీక్షల సమయం వచ్చేసినా..
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వచ్చేనెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫీజులు చెల్లించాలంటూ యాజమన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్ ఫీజుల ప్రక్రియ మాత్రం ఇంకా దరఖాస్తుల గడప దాటలేదు. ఈ దరఖాస్తులు ప్రాసెస్ అయ్యేదెప్పుడు? మంజూరు అయ్యేదెప్పుడో ప్రభుత్వానికే తెలియాలి. మొదటి సంవత్సరం చదివే విద్యార్థులైతే కాస్త ఫర్వా లేదు. కానీ ఇంటర్ రెండో సంవత్సరం, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. గత్యంతరం లేక అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు.
ఫీజులకు తూట్లు: కిషన్‌రెడ్డి
ఫీజుల పథకానికి తూట్లు పొడిచేందుకు కిరణ్ సర్కారు ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు ఆధార్ లింకు పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. గ్యాస్ సిలిండర్ కేటాయింపులకు ఆధార్ అక్కర్లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసినా విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి చేయడమేమిటని ప్రశ్నించారు.
ఇవీ తిప్పలు..
- విద్యార్థులు వేలి ముద్రలు సేకరించి, ఆధార్ సమయంలో ఇచ్చిన వేలి ముద్రలను సరిపోల్చేందుకుగాను ఈపాస్‌తో అనుసంధానం చేసుకున్న బయోమెట్రిక్ యంత్రాలను కళాశాలలు అమర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ యంత్రాలు ఎక్కడ లభిస్తాయి? వీటిని అమర్చుకునేందుకు ఎంత ఖర్చవుతుందన్న సమాచారం అటు ప్రభుత్వం వద్దగానీ, ఇటు కాలేజీల వద్దగానీ లేదు.
- ఏదైనా స్థాయిలో చిన్న పొరపాటు జరిగితే దాన్ని సవరించుకునే అవకాశాలపై స్పష్టత లేదు. బ్యాంకు అకౌంట్ నెంబర్ మారినా, ఆధార్ నంబర్ పొరపాటుగా నమోదైనా ప్రత్యామ్నాయం ఏంటి?
- కళాశాల ప్రిన్సిపల్‌కూ తప్పనిసరిగా ఆధార్ ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. ఆ నంబర్‌నే పాస్‌వర్డ్‌గా ఉపయోగించుకోవాలంటోంది. ఒకవేళ ప్రిన్సిపల్‌కు ఆధార్ లేకపోతే ఆ కళాశాలలో చదువుకునే విద్యార్థులందరి దరఖాస్తులు ఆగిపోవాల్సిందేనా?
- ప్రతి దశ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తే వాటన్నింటికి సంబంధించి ఐడీలు, పాస్‌వర్డ్‌లు ఎలా భద్రపరచాలి?
- చాలామంది విద్యార్థుల వద్ద ఆధార్ లేకపోవడంతో వారు తమ తల్లిదో, తండ్రిదో ఆధార్ సంఖ్య ఇచ్చి దరఖాస్తు చేసుకున్నారు. అలాంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి?
విద్యార్థులకు నష్టం: కృష్ణయ్య
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆధార్ కార్డును ముడిపెట్టడంతో లక్షలాది మంది విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే ఆధార్ లింక్ తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పలువురు బీసీ సంఘాల నాయకులతో కలిసి సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి తమ వినతికి సానుకూలంగా స్పందించారని, సమస్య పరిష్కరించకపోతే వేలాది మంది బీసీ విద్యార్థులతో ఈనెల 23న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.